రాజన్ కు ఉద్వాసనా? ఊరటా?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం పొడిగింపు పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆయనపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ వ్యాఖ్యల ప్రభావం ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రభావితం చేయనుందా అంటే లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన్ని రెండవసారి గవర్నర్ గా కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆగస్టులోనే ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
దీంతోపాటుగా రాజన్ పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యల ప్రభావం ఉండకపోవచ్చని ఆయని పేర్కొన్నారు. రాజన్ ను కేంద్ర బ్యాంకు ఉత్తమ గవర్నర్ గా వరల్డ్ బ్యాంక్ మ్యాగజీన్ గుర్తించిందన్నారు. ఈ కారణాల నేపథ్యంలో ఆయన్ను రెండవ సారి కేంద్ర బ్యాంకు గవర్నర్ గా నియమించే అవకాశ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ సెప్టెంబర్ లో మూడు సంవత్సరాల రాజన్ పదవీకాలం ముగియనుండగా..ఒక నెల ముందుగా ఆగస్టు నెలలో ప్రభుత్వం నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని చెప్పారు.
కాగా యూపీఏ ప్రభుత్వం 2013సెప్టెంబర్ 4 న రఘురామ రాజన్ ఆర్బీయై గవర్నర్ గా నియమించింది. అధికారంలోకి వచ్చీ రాగానే తనదైన సంస్కరణలతో బ్యాకింగ్ రంగంలో మంచి దూకుడును తీసుకొచ్చారు. అటు నెటిజన్లు కూడా ఆయనక సానుకూలంగా స్పందించారు. అయితే రాజన్ ను తక్షణమే పదవి తొలగించి, చికాగో పంపించమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో రాజన్ ఉద్దేశ పూర్వకంగానే దేశ ఆర్థిక వ్యవస్థను నష్టాల బాట పట్టిస్తున్నారని మోదీకి ఒక లేఖ కూడా రాశారు.అయితే రాజన్ పనితీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రశంసలు కురింపించగా, రఘురామ్ రాజన్ కాలాన్ని పొడిగించే విషయమై మీడియా ప్రశ్నల్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాటవేశారు. ఇది మీడియాతో చర్చించే విషయమా అంటూ.. అసహనం ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇపుడు ప్రభుత్వం రాజన్ పట్ల సానుకూల ధోరణితో ఉందనే వార్తలకు ప్రాధాన్యత చేకూరింది.