న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వద్ద అధికంగా ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి గనక బదిలీ చేస్తే అది కేంద్ర బ్యాంకు రేటింగ్ తగ్గడానికి దారితీస్తుందని మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐకి ప్రస్తుతం ఏఏఏ రేటింగ్ ఉండగా, ఇది తగ్గితే నిధుల వ్యయాల భారం పెరిగి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్నారు. ఆర్‌బీఐ నుంచి అదనపు నిధుల బదలాయింపు కేంద్రానికి జరిగితే రేటింగ్ తగ్గడానికి దారితీస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘‘అది ఎంత మొత్తం బదలాయిస్తున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇదో అంశం కాదు. ఏదో ఒక సమయంలో మాత్రం ఇది ఓ అంశంగా మారుతుంది. ప్రభుత్వం, ఆర్‌బీఐ రెండూ కూడా చర్చల ద్వారా దీనికి ముగింపు పలకాలి. మనది ‘బీఏఏ’ దేశం. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్. ఏదో ఒక సమయంలో అంతర్జాతీయ లావాదేవీల నిర్వహణ కోసం అధిక క్రెడిట్ రేటింగ్ అవసరపడుతుంది’’ అని రాజన్ చెప్పారు. ‘మీరు గవర్నర్‌గా ఉన్న సమయంలోనూ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారా’ అన్న ప్రశ్నకు... ప్రభుత్వానికి మరింత మొత్తం చెల్లించాలన్న ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని బదులిచ్చారు. ‘‘ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న సమయంలో నేను కూడా ఎంత మొత్తం నిధులు కలిగి ఉండాలన్న అంశంపై ఆర్‌బీఐకి లేఖ రాశాను. ఆర్‌బీఐ గవర్నర్‌గా వచ్చాక కమిటీ ఏర్పాటు చేయగా, లాభం మొత్తాన్ని పంపిణీ చేసేందుకు సరిపడా క్యాపిటల్ మన దగ్గర ఉన్నట్టు చెప్పింది. నేను గవర్నర్‌గా ఉన్న ఆ మూడు సంవత్సరాల్లో ఆర్‌బీఐ చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది. అయితే, లాభాలకు మించి చెల్లించాలన్నది డిమాం డ్. కానీ, అలా చెల్లించరాదని మాలేగామ్ కమిటీ అభిప్రాయపడింది’’ అని రాజన్ వివరించారు.
నోట్ల రద్దుతో ఆర్థిక వృద్ధి మందగమనం
ప్రపంచ ఆర్థిక రంగం 2017లో వృద్ధి క్రమంలో ఉంటే, నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) కారణంగా భారత ఆర్థిక వృద్ధి కుంటుపడిందని రాజన్ పేర్కొన్నారు. వృద్ధి తగ్గుముఖం పట్టిందని తిరిగి నిర్ధారించిన అధ్యయనాలను తాను చూసినట్టు చెప్పారు. దీనితోపాటు జీఎస్టీ అమలు ప్రభావం కూడా వృద్ధిపై పడినట్టు అభిప్రాయపడ్డారు. 2017–18లో మన జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. దీర్ఘకాలంలో జీఎస్టీ మంచిదేనని, స్వల్ప కాలంలో మాత్రం సమస్యలు ఉంటాయన్నారు. తన హయాంలో నోట్ల రద్దుపై అభిప్రాయాన్ని కోరారని, ఇది చెడ్డ ఆలోచనని చెప్పినట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజన్ 2013 నుంచి 2016 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు.
ప్రభుత్వ ఒత్తిళ్లతో ఆర్థిక అస్థిరత
రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ హెచ్చరిక
సింగపూర్: ఆర్‌బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి అన్నది... బ్యాంకింగ్ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని, దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ హెచ్చరించింది. 2019 జనవరిలో జరిగే ఆర్‌బీఐ సమావేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణలో ఏవైనా మార్పులు చేస్తారేమో వేచి చూస్తున్నట్టు తెలిపింది. ఆర్‌బీఐ స్వతంత్రత సహా పలు అంశాల విషయంలో ప్రభుత్వంతో పొసగక ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌బీఐ స్వతంత్రత విషయంలో, ముఖ్యంగా పాలసీ అమలులో ఏ మార్పూ లేదని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ఎన్‌పీఏల గుర్తింపు, రీక్యాపిటలైజేషన్, పరిష్కారం, సంస్కరణలపై సెంట్రల్ బ్యాంకు దృష్టి సారించి ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇది కచ్చితంగా రిస్క్ అని అభిప్రాయపడింది. ‘‘మాజీ గవర్నర్ రాజన్ ఆస్తుల నాణ్యత సమీక్ష చేపట్టిన తర్వాత నుంచి, ఆర్‌బీఐ తీసు కున్న చర్యలు బ్యాంకింగ్ రంగలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాయి’’అని ఎస్‌అండ్‌పీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment