credit rating
-
9 ఎయిర్‌పోర్టులు .. 50 శాతం వృద్ధి
ముంబై: విమాన ప్రయాణీలకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నడుస్తున్న తొమ్మిది ఎయిర్‌పోర్టులు ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి సాధించనున్నాయి. వాటి ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,450 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 9,650 కోట్లకు చేరనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్యాసింజర్ ట్రాఫిక్ ఈసారి 70 శాతం వృద్ధి చెందనుంది. కరోనా పూర్వ స్థాయిలో 93 శాతానికి చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది కోవిడ్ పూర్వ స్థాయికి 1.12 రెట్లు అధికంగా నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ ట్రాఫిక్‌లో 50 శాతం వాటా ఉన్న తొమ్మిది పీపీపీ విమానాశ్రయాల ఆర్థిక పరిస్థితిని మదింపు చేసిన మీదట ఈ అంచనాలకు వచ్చినట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. కోవిడ్ సమయంలో ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు ఆదాయ పంపకంపరంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఊరటనివ్వడంతో 2021–22లో వాటి స్థూల మార్జిన్లు మెరుగ్గా 56 శాతం స్థాయిలో నమోదయ్యాయి. అయితే, ఆదాయ పంపకాన్ని పునరుద్ధరించడంతో ఈసారి ఇవి 37 శాతానికి తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కార్యకలాపాల స్థాయి పెరగడం వల్ల ఈ మార్జిన్లు సుమారు 45 శాతం వద్ద స్థిరపడవచ్చని కేర్ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. ప్రైవేటీకరణలో మరింత జాప్యం.. విమానాశ్రయాల ప్రైవేటీకరణలోనూ, జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టుల నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ ప్రణాళికల అమల్లోనూ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కింద 25 ఎయిర్‌పోర్టులను మానిటైజ్ చేయాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ ఆ దిశగా ఇంకా పటిష్టమైన చర్యలేమీ అమలవుతున్నట్లు లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట గడువులను మరింత ముందుకు జరపవచ్చని, కేంద్రం జోక్యం చేసుకోవాల్సి రావచ్చని నివేదిక అభిప్రాయపడింది. భారత జీడీపీ వృద్ధి, విమాన ప్రయాణీకుల పెరుగుదలపై దాని ప్రభావం.. పని చేయగలిగే వయస్సు గల జనాభా సంఖ్య పెరుగుతుండటం తదితర అంశాలు భారతీయ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు సానుకూలంగా ఉండగలవని వివరించింది. సకాలంలో టారిఫ్ ఆర్డర్లను జారీ చేస్తూ నియంత్రణపరమైన పరిస్థితులను మెరుగుపర్చగలిగితే ఆపరేటర్లకు ఆదాయ అంచనాలపరంగా ఊరటగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ’లో బేస్ ఎఫెక్ట్’ కారణంగా 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి రేటు .. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకన్నా 2.25 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ మౌలేష్ దేశాయ్ పేర్కొన్నారు. -
మూడీస్ ‘రేటింగ్’ షాక్
న్యూఢిల్లీ: భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్ (దృక్పథాన్ని)ను ప్రతికూలానికి (నెగెటివ్) మారుస్తూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇది స్థిరం (స్టేబుల్)గా ఉంది. ఆరి్థక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయినట్టు మూడిస్ పేర్కొంది. దీంతో సమస్యలు పెరిగాయని, ఫలితంగా వృద్ధి రేటు ఇక ముందూ తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. విదేశీ కరెన్సీ రేటింగ్‌ను మార్చకుండా ‘బీఏఏ2 మైనస్’గానే కొనసాగించింది.పెట్టుబడుల విషయంలో రెండో అతి తక్కువ గ్రేడ్ ఇది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2019–20) 3.7 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ప్రభుత్వ లక్ష్యం జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతం కంటే ఇది ఎక్కువే. వృద్ధి తక్కువగా ఉండడం, కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాల నేపథ్యంలో ద్రవ్యలోటు అంచనాలను మూడీస్ పెంచింది. జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 2013 తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలో 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడిస్ నిర్ణయం వెలువడడం గమనార్హం. అయితే, రేటింగ్ అవుట్‌లుక్‌ను తగ్గించడంతో మరిన్ని సంస్కరణలు, దిద్దుబాటు చర్యల దిశగా ప్రభుత్వంపై ఒత్తిళ్లను పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిచ్ రేటింగ్స్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారత అవుట్‌లుక్‌ను స్థిరంగానే (స్టేబుల్)గానే కొనసాగిస్తున్నాయి. మూడీస్ అభిప్రాయాలు... ►అవుట్‌లుక్‌ను నెగెటివ్‌కు మార్చడం పెరిగిన రిస్కలను తెలియజేస్తుంది. ఆరి్థక రంగ వృద్ధి గతం కంటే తక్కువగానే ఉండనుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆరి్థక, వ్యవస్థాగత బలహీనతలను పరిష్కరించే విషయంలో ప్రభావవంతంగా వ్యవహరించలేకపోవడాన్ని ఇది కొంత మేర ప్రతిఫలిస్తుంది. ►ఇప్పటికే రుణ భారం అధిక స్థాయిలో ఉండగా, ఇది ఇంకా క్రమంగా పెరిగేందుకు దారితీస్తుంది. ►ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు మందగమనం తీవ్రత, కాల వ్యవధిని తగ్గించొచ్చు. ►గ్రామీణ స్థాయిలో దీర్ఘకాలం పాటు ఆరి్థక ఒత్తిళ్లు, ఉపాధి కల్పన బలహీనంగా ఉండటం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్ఐ) రుణ సంక్షోభంతో మందగమనం మరింత స్థిరపడే అవకాశాలున్నాయి. ►ఎన్బీఎఫ్ఐల్లో రుణ సంక్షోభం వేగంగా పరిష్కారం కాకపోవచ్చు. ►ఆర్బీఐ రేట్ల తగ్గింపు సహా ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలు ఆరి్థక రంగానికి మద్దతునిస్తాయే గానీ, ఉత్పాదకత, వాస్తవ జీడీపీ వృద్ధి పూర్వపు స్థాయికి తీసుకెళ్లలేకపోవచ్చు. ►నెగెటివ్ అవుట్‌లుక్ సమీప కాలంలో రేటింగ్ అప్‌గ్రేడ్‌కు ఛాన్స్ లే దని తెలియ జేస్తుంది. ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయి: కేంద్రం రేటింగ్ అవుట్‌లుక్‌ను నెగెటివ్‌గా మార్చడం పట్ల కేంద్ర ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. దీనివల్ల భారత్‌పై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. ‘‘ఆరి్థక రంగ మూలాలు పూర్తి బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. బాండ్ ఈల్డ్స్ తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీసుకున్న వరుస సంస్కరణలు పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తాయి. భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది’’ అని కేంద్ర ఆరి్థక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 2019 భాతర వృద్ధి రేటు 6.1 శాతం, తర్వాతి సంవత్సరంలో 7 శాతంగా ఉండొచ్చన్న ఇటీవలి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలను ప్రస్తావించింది. భారత వృద్ధి సామర్థ్యాలు ఏమీ మారలేదన్న ఐఎంఎఫ్, ఇతర సంస్థల అంచనాలను గుర్తు చేసింది. ‘‘అంతర్జాతీయ మందగమనం నేపథ్యంలో చురుకైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఈ చర్యలు భారత్ పట్ల సానుకూల దృక్పథానికి దారితీస్తాయి. నిధులను ఆకర్షించడంతోపాటు, పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తాయి’’అని పేర్కొంది. -
రేటింగ్ ఏజెన్సీల పాత్ర కీలకం: ఆర్బీఐ గవర్నర్
ముంబై: ఫైనాన్షియల్ రంగ స్థిరత్వంలో... అవి సమర్థంగా పనిచేయడంలో రేటింగ్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. భాగస్వాములతో సంప్రతింపుల కార్యక్రమంలో భాగంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ఉన్నతోద్యోగులతో ఆర్బీఐ గవర్నర్ సమావేశమై చర్చించారు. ‘‘ఫైనాన్షియల్ సెక్టార్ సమర్థవంతంగా, సుస్థిరంగా పనిచేయడంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భాగస్వాముల సంప్రతింపుల్లో భాగంగా గురువారం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ఎండీ, సీఈవోలతో సమావేశమయ్యాను’’ అంటూ శక్తికాంతదాస్ ట్వీట్ చేశారు. కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్ ఏజెన్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఐఎల్ఎఫ్ఎస్ మొండి బకాయిలను సమయానికి గుర్తించడంలో విఫలమయ్యాయంటూ రేటింగ్ ఏజెన్సీలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. -
నిధులు మళ్లిస్తే ఆర్బీఐ రేటింగ్‌కు కోత
న్యూఢిల్లీ: ఆర్బీఐ వద్ద అధికంగా ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి గనక బదిలీ చేస్తే అది కేంద్ర బ్యాంకు రేటింగ్ తగ్గడానికి దారితీస్తుందని మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐకి ప్రస్తుతం ఏఏఏ రేటింగ్ ఉండగా, ఇది తగ్గితే నిధుల వ్యయాల భారం పెరిగి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్నారు. ఆర్బీఐ నుంచి అదనపు నిధుల బదలాయింపు కేంద్రానికి జరిగితే రేటింగ్ తగ్గడానికి దారితీస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘‘అది ఎంత మొత్తం బదలాయిస్తున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇదో అంశం కాదు. ఏదో ఒక సమయంలో మాత్రం ఇది ఓ అంశంగా మారుతుంది. ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ కూడా చర్చల ద్వారా దీనికి ముగింపు పలకాలి. మనది ‘బీఏఏ’ దేశం. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. ఏదో ఒక సమయంలో అంతర్జాతీయ లావాదేవీల నిర్వహణ కోసం అధిక క్రెడిట్ రేటింగ్ అవసరపడుతుంది’’ అని రాజన్ చెప్పారు. ‘మీరు గవర్నర్‌గా ఉన్న సమయంలోనూ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారా’ అన్న ప్రశ్నకు... ప్రభుత్వానికి మరింత మొత్తం చెల్లించాలన్న ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని బదులిచ్చారు. ‘‘ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న సమయంలో నేను కూడా ఎంత మొత్తం నిధులు కలిగి ఉండాలన్న అంశంపై ఆర్బీఐకి లేఖ రాశాను. ఆర్బీఐ గవర్నర్‌గా వచ్చాక కమిటీ ఏర్పాటు చేయగా, లాభం మొత్తాన్ని పంపిణీ చేసేందుకు సరిపడా క్యాపిటల్ మన దగ్గర ఉన్నట్టు చెప్పింది. నేను గవర్నర్‌గా ఉన్న ఆ మూడు సంవత్సరాల్లో ఆర్బీఐ చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది. అయితే, లాభాలకు మించి చెల్లించాలన్నది డిమాం డ్. కానీ, అలా చెల్లించరాదని మాలేగామ్ కమిటీ అభిప్రాయపడింది’’ అని రాజన్ వివరించారు. నోట్ల రద్దుతో ఆర్థిక వృద్ధి మందగమనం ప్రపంచ ఆర్థిక రంగం 2017లో వృద్ధి క్రమంలో ఉంటే, నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) కారణంగా భారత ఆర్థిక వృద్ధి కుంటుపడిందని రాజన్ పేర్కొన్నారు. వృద్ధి తగ్గుముఖం పట్టిందని తిరిగి నిర్ధారించిన అధ్యయనాలను తాను చూసినట్టు చెప్పారు. దీనితోపాటు జీఎస్టీ అమలు ప్రభావం కూడా వృద్ధిపై పడినట్టు అభిప్రాయపడ్డారు. 2017–18లో మన జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. దీర్ఘకాలంలో జీఎస్టీ మంచిదేనని, స్వల్ప కాలంలో మాత్రం సమస్యలు ఉంటాయన్నారు. తన హయాంలో నోట్ల రద్దుపై అభిప్రాయాన్ని కోరారని, ఇది చెడ్డ ఆలోచనని చెప్పినట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజన్ 2013 నుంచి 2016 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో ఆర్థిక అస్థిరత రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ హెచ్చరిక సింగపూర్: ఆర్బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి అన్నది... బ్యాంకింగ్ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని, దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ హెచ్చరించింది. 2019 జనవరిలో జరిగే ఆర్బీఐ సమావేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణలో ఏవైనా మార్పులు చేస్తారేమో వేచి చూస్తున్నట్టు తెలిపింది. ఆర్బీఐ స్వతంత్రత సహా పలు అంశాల విషయంలో ప్రభుత్వంతో పొసగక ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ప్రస్తుతం ఆర్బీఐ స్వతంత్రత విషయంలో, ముఖ్యంగా పాలసీ అమలులో ఏ మార్పూ లేదని ఎస్అండ్పీ పేర్కొంది. ఎన్పీఏల గుర్తింపు, రీక్యాపిటలైజేషన్, పరిష్కారం, సంస్కరణలపై సెంట్రల్ బ్యాంకు దృష్టి సారించి ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇది కచ్చితంగా రిస్క్ అని అభిప్రాయపడింది. ‘‘మాజీ గవర్నర్ రాజన్ ఆస్తుల నాణ్యత సమీక్ష చేపట్టిన తర్వాత నుంచి, ఆర్బీఐ తీసు కున్న చర్యలు బ్యాంకింగ్ రంగలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాయి’’అని ఎస్అండ్పీ తెలిపింది. -
బ్రిక్స్ దేశాలకూ రేటింగ్ ఏజెన్సీ!
►మూడీస్ కాదిక... మోడీస్!! ► వర్ధమాన దేశాల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు ► అమెరికన్ ఏజెన్సీల ఆధిపత్యానికి చెక్ ► బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన జియామెన్: ఇప్పటిదాకా క్రెడిట్ రేటింగ్ విభాగంలో ఆధిపత్యం చలాయిస్తున్న పశ్చిమ దేశాల ఏజెన్సీలకు చెక్ చెప్పే దిశగా వర్ధమాన దేశాలు తమ కోసం ప్రత్యేకంగా రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్ధమాన దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, ఇతర కార్పొరేట్ల ఆర్థిక అవసరాల కోసం బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ తోడ్పడగలదని ఆయన చెప్పారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌతాఫ్రికా) కూటమి 9వ సదస్సు ప్లీనరీ సెషన్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ సూచన చేశారు. బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలతో పాటు ఇతర వర్ధమాన దేశాలకూ లాభం ఉంటుందని చెప్పారాయన. ‘‘దీని గురించి గత ఏడాది కూడా చర్చించాం. సాధ్యాసాధ్యాలను ఒక నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళిక సిద్ధం చేయాలని కోరుకుంటున్నాను‘ అని ఆయన తెలిపారు. అలాగే ఆర్థిక రంగంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింతగా పెరగాలని మోదీ పేర్కొన్నారు. ఇందులో కేంద్రీయ బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా సీఆర్ఏ (క్రెడిట్ రేటింగ్) మార్కెట్లో ఎస్అండ్పీ, మూడీస్, ఫిచ్ వంటి సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ మూడు సంస్థలూ అమెరికాకు చెందినవే కావటం గమనార్హం. సావరిన్ క్రెడిట్ రేటింగ్స్ మార్కెట్లో ఈ మూడు సంస్థలకూ ప్రస్తుతం 90 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలోనే గతేడాది గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో వర్ధమాన దేశాలు రేటింగ్స్ పరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను భారత్ ముందుకు తెచ్చింది. ప్రత్యామ్నాయ ఏజెన్సీ ఏర్పాటు అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. టెక్నాలజీతో అవినీతి, పేదరిక నిర్మూలన... పేదరికం, అవినీతి నిర్మూలనకు టెక్నాలజీ, డిజిటల్ వనరులు అత్యంత శక్తిమంతమైన సాధనాలని నరేంద్ర మోదీ చెప్పారు. భారత ప్రభుత్వం వీటి ఊతంతో నల్లధనం, అవినీతిపై మరింత బలంగా పోరు సాగిస్తోందని ఆయన తెలిపారు. కొంగొత్త ఆవిష్కరణలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల రూపకల్పనలో బ్రిక్స్ దేశాలన్నీ భాగస్వాములైతే వృద్ధికి ఊతం లభిస్తుందని, పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు నిలకడగా అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని ప్రధాని తెలిపారు. పన్ను ఎగవేతలు అరికట్టేందుకు సమాచార మార్పిడి .. పన్ను ఎగవేతల సమస్యను అరికట్టే దిశగా పన్నులపరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, ఇతర వర్ధమాన దేశాలకూ కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందించాలని బ్రిక్స్ కూటమి తీర్మానించింది. తద్వారా సహేతుకమైన, అధునాతనమైన అంతర్జాతీయ స్థాయి పన్ను వ్యవస్థ రూపకల్పనకు కృషి చేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. బ్రిక్స్ సదస్సు ప్లీనరీ సెషన్ ముగింపు సందర్భంగా ఈ మేరకు షియామెన్ తీర్మాన ప్రకటనను విడుదల చేశాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) మొదలైన వాటి ఏర్పాటు ఫలవంతం కావడంపై బ్రిక్స్ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ ఆర్థిక వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాలు, వర్ధమాన దేశాల గళం వినిపిస్తామని పేర్కొన్నాయి. ‘అంతర్జాతీయ పన్ను నిబంధనల రూపకల్పనలో తన వంతుగా మరింత కీలకపాత్ర పోషించే క్రమంలో బ్రిక్స్ కూటమి దేశాలు పన్నులపరమైన అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకుంటాయి. అలాగే ప్రాధాన్యతలను బట్టి.. ఇతర వర్ధమాన దేశాలకూ తగిన సాంకేతిక సహకారాన్ని అందిస్తాయి‘ అని తీర్మానంలో బ్రిక్స్ కూటమి పేర్కొంది. నాలుగు ఒప్పందాలు .. సదస్సు సందర్భంగా బ్రిక్స్ కూటమిలో భారత్ సహా అయిదు సభ్య దేశాలు.. నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక, వాణిజ్య సహకారంపై బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక, నవకల్పనల ఆవిష్కరణలో పరస్పర సహకారం (2017–2020), బ్రిక్స్ కస్టమ్స్ కోఆపరేషన్‌పై వ్యూహాత్మక విధానంపై ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. అలాగే, వ్యూహాత్మక సహకారంపై బ్రిక్స్ వ్యాపార మండలి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. -
సకాలంలో చెల్లిస్తే.. క్రెడిట్ కార్డ్ ఓకే!
‘అప్పు చేయడమంటే’ ఎవరికైనా ఇబ్బందే. డబ్బు లేకపోయినా కావలసినవన్నీ కొనుక్కోండంటూ బ్యాంకులు ఇవ్వజూపే ‘క్రెడిట్ కార్డ్’ అంటే కొంత భయం కూడా కలుగుతుంది. చెల్లింపుల్లో అనుకోకుండా జరిగే జాప్యం, వైఫల్యాలపై అధిక వడ్డీల భారాన్ని భరించాల్సి రావడమే ఈ భయానికి కారణం. అయితే ఇక్కడ చెల్లింపుల్లో ‘జాప్యం, వైఫల్యం’ లేకుండా తగిన విధంగా వినియోగించుకుంటే క్రెడిట్ కార్డ్ వల్ల ఒనగూరే ప్రయోజనాలు అపరిమితం. ఆర్థికంగానే కాకుండా, నగదును ప్రతిచోటుకీ మీ వెంట తీసుకుపోయే అవసరాన్ని సైతం ఇది నివారిస్తుంది. డబ్బు ఎలా ఖర్చవుతోందన్న విషయాన్ని సైతం (మనీ మేనేజ్మెంట్) క్రెడిట్ కార్డ్- ఒక ‘రికార్డు’ లాగా మీ ముందు ఉంచుతుంది. నిర్దిష్ట కాలంలో వడ్డీరహిత ప్రయోజనం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రొడక్ట్ గురించి ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది. ఫ్రీ క్రెడిట్ పీరియడ్ సదుపాయం... క్రెడిట్ కార్డ్ కంపెనీలు ‘ఫ్రీ క్రెడిట్ పీరియడ్’ పేరుతో ఆఫర్ ఇస్తాయి. ఈ కాలం చాలా కంపెనీల విషయంలో దాదాపు 45 నుంచి 50 రోజులు ఉంటుంది. అంటే ఇక్కడ క్రెడిట్ కార్డును సరిగా వినియోగించుకోగలిగితే గరిష్టంగా 45-50 రోజులు ఎటువంటి వడ్డీలేని రుణాన్ని పొందే వీలుంటుంది. మీ ద్రవ్య లభ్యతనూ తగిన విధంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన తేదీ నుంచీ ఈ ‘ఫ్రీ క్రెడిట్ పీరియడ్’ వర్తిస్తుందన్న అభిప్రాయం చాలా మందికి ఉంది. ఇది తప్పు. బిల్లింగ్ సర్కిల్ డే ప్రారంభం నుంచీ ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు పవన్ అనే వ్యక్తి బిల్లింగ్ సర్కిల్ జనవరి 1 నుంచి జనవరి 31 (నెల) అనుకుందాం. బిల్లింగ్ తేదీ జనవరి 31. ఇక్కడ పవన్ క్రెడిట్ ఫ్రీ పీరియడ్ 50 రోజులు అనుకుందాం. అంటే జనవరి 1 నుంచి జనవరి 31వ తేదీ మధ్య కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి రుణాన్ని జనవరి 1 నుంచే 50 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంటే బిల్లింగ్ తేదీ ఇక్కడ జనవరి 31 కాబట్టి, అక్కడి నుంచి 20 రోజుల్లో రుణం మొత్తాన్ని చెల్లించాలి. ఈ ఉదాహరణలో జనవరి 22న పవన్ ఒక వస్తువును క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేశాడనుకుందాం. ఇక్కడ పవన్‌కు వడ్డీలేని క్రెడిట్ ప్రయోజనం అందేది దాదాపు 29 రోజులు (జనవరిలో చివరి 9 రోజులు అటు తర్వాత 20 రోజులు). ఒకవేళ జనవరి 1నే కొనుగోలు జరిపితే 50 రోజులు ‘ఫ్రీ క్రెడిట్ పీరియడ్’ అమలవుతుంది. రివార్డులు... డిస్కౌంట్లు... ఆఫర్లు ఇక రివార్డు పాయింట్లూ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ‘ఫ్రీ క్రెడిట్ పీరియడ్’లో క్రెడిట్ కార్డ్‌పై ప్రతి కొనుగోలూ మీకు రివార్డు పాయింట్లను అందిస్తుంది. కంపెనీ-కంపెనీకి మధ్య ఈ రివార్డు పాయింట్లు వేర్వేరుగా ఉంటాయి. ఈ పాయింట్లు పెరిగిన కొలదీ మీకు ఆర్థికంగా ప్రయోజనమూ పెరుగుతుంది. షాపింగ్, వినోదం వంటి అంశాలకు సంబంధించి క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్, ప్రమోషనల్ ఆఫర్ల సంగతి చెప్పనక్కర్లేదు. కొన్ని బ్రాండ్ల ఉత్పత్తుల కొనుగోలుపై కొంత శాతం సొమ్ము మీ అకౌంట్లో తిరిగి జమ కావడమూ ఇక్కడ ప్రత్యేకాంశం. జాగ్రత్తలు ఇవీ... చెల్లింపుల్లో డిఫాల్ట్ అయితే... దాదాపు ప్రతి నెలా 2 నుంచి 3.5 శాతం వరకూ వడ్డీరేటు భరించాల్సి ఉంటుంది. వార్షికంగా ఈ రేటు 24 శాతం నుంచి 42 శాతం వరకూ లెక్కవుతుంది. కొనుగోలు తేదీ నుంచీ వడ్డీరేటు భారం పడడం ప్రారంభమవుతుంది. బిల్లింగ్ డేట్‌ను ఇక్కడ పరిగణనలోకి తీసుకోరు. అందుకే సకాలంలో బకాయి చెల్లించడానికి కమిట్ అయితే క్రెడిట్ కార్డ్ మంచి ఫలితాలను అందిస్తుంది. మీ భవిష్యత్ రుణాలపై సైతం మీ ‘క్రెడిట్ స్కోర్’, ‘క్రెడిట్ రేటింగ్’ ప్రభావం చూపుతుందన్న విషయం ఇక్కడ గమనార్హం. వెరసి చెల్లింపుల విషయంలో డిఫాల్ట్, జాప్యం వంటి అంశాలు మీ భవిష్యత్ రుణ లభ్యత మీదే కాకుండా, అధిక వడ్డీరేటు భారానికీ, రుణ ఊబిలో కూరుకుపోవడానికీ కారణమవుతుంది. మంచీ చెడూ ఆలోచించుకోవాల్సింది ఇక మీరే.!!- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
మాఫీపై స్పష్టత ఇవ్వండి
ఎస్ఎల్బీసీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరిన బ్యాంకర్లు మాఫీకి బ్యాంకులు సహకరించాలనే విజ్ఞప్తితో సరిపెట్టిన ఆర్థిక మంత్రి {పభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఉద్దేశంతోనే రైతులు రుణాలు చెల్లించలేదన్న బ్యాంకర్లు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలపైనా స్పష్టతకు విజ్ఞప్తి బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ బాగా పడిపోరుుందని ఆందోళన మాఫీ ప్రక్రియ విధివిధానాలపై నేటి కేబినెట్ భేటీలో నిర్ణయం కేవలం నివేదిక సమర్పణకే పరిమితమైన ఎస్ఎల్బీసీ భేటీ ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఉద్దేశంతోనే రైతులు రుణాలు చెల్లించలేదన్న బ్యాంకర్లు హైదరాబాద్: రైతుల వ్యవసాయ రుణాల మాఫీపై.. మంగళవారం నాటి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ప్రకటించడంతో రైతులు రుణాలు తిరిగి చెల్లించడానికి ముందుకు రావడం లేదని, తద్వారా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. రుణ మాఫీతో పాటు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలపై స్పష్టత ఇవ్వాలని బ్యాంకర్లు కోరారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కేవలం రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించాలన్న విజ్ఞప్తితో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సరిపెట్టారు. 186వ ఎస్ఎల్బీసీ సమావేశం ఆంధ్రా బ్యాంక్ కేంద్ర కార్యాలయం పట్టాభి భవన్లో జరిగింది. సమావేశానికి ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.కె.కల్రా అధ్యక్షత వహించారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ సి.దొరస్వామి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కేంద్ర ఆర్థిక శాఖ డెరైక్టర్ ఎన్.శ్రీనివాసరావు, ఆర్బీఐ రీజినల్ డెరైక్టర్ కె.ఆర్.దాస్, నాబార్డ్ సీజీఎం జిజి మెమ్మన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వల్ల బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ పడిపోయిందనే విషయాన్ని ఆంధ్రా బ్యాంక్ ఈడీ కల్రా తన 10 నిమిషాల ప్రసంగంలో ఐదుసార్లు ప్రస్తావించారు. రుణమాఫీకి సహకరించాలి: యనమల రైతులను ప్రభుత్వం ఆదుకోవడానికి వీలుగా రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు సహకరించాలని ఆర్థిక మంత్రి కోరారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం బ్యాంకర్లతో చర్చించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఎస్ఎల్బీసీ నిర్మాణాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలన్నారు. ఆ ప్రతిపాదనల ఆధారంగా రుణమాఫీ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాదాపు ముగిసినా ఇప్పటివరకు కేవలం 38 శాతమే రుణ వితరణ జరిగిందని, కనీసం రబీ సీజన్లో అయినా మెరుగ్గా రుణాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు లక్ష్యం రూ.25,888 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.5,593 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఏపీ పరిస్థితి తారుమారరుు్యంది: కల్రా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద లక్ష్యానికి మించి ఖాతాలు తెరవడంలో బ్యాంకులు విజయం సాధించాయని ఆంధ్రా బ్యాంక్ ఈడీ కల్రా చెప్పారు. మరోవైపు రుణాల మంజూరులో అధికభాగంగా ఉండే వ్యవసాయ రుణాల వితరణలో బ్యాంకులు విఫలమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఆశతో రైతులు రుణాలు తిరిగి చెల్లించడం/రెన్యువల్ చేసుకోవడానికి విముఖత చూపించడం వల్లే బ్యాంకుల వ్యాపార పరిమాణం తగ్గిపోయిందని చెప్పారు. ఈ ఏడాది వ్యవసాయానికి రూ. 56,019 కోట్ల రుణం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.7,263 కోట్లు(12.97 శాతం) మాత్రమే ఇచ్చామని తెలిపారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని అధిగమించే రాష్ట్రంగా ఏపీకి పేరుందని, కానీ ఈ ఏడాది పరిస్థితులు తారుమారయ్యాయని, ఫలితంగా రైతులతో పాటు బ్యాంకులకూ నష్టం కలిగిందన్నారు. వ్యవసాయ రుణాలు నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ)గా మారడంతో బ్యాంకు క్షేత్రస్థాయి సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతినడంతో పాటు బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాల సమగ్ర సమాచారాన్ని అక్టోబర్ 10కి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు కింద కేంద్రం ఇటీవలే ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజన పథకంపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో తిరిగే 30 రైళ్లపై రాతల ద్వారా ప్రచారం చేయనున్నట్లు నాబార్డు సీజీఎం తెలిపారు. వడ్డీ లేని రుణాలపై విధానమేంటో చెప్పండి వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని ఎస్ఎల్బీసీ కన్వీనర్ దొరస్వామి కోరారు. ఖరీఫ్ 2013-14కు సంబంధించి పంట రుణాలకు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ అమలు జరిగిందని, అరుుతే రబీకి సంబంధించి ఎలాం టి నిర్ణయం వెలువరించలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించకుంటే రైతులతో పాటు ప్రభుత్వంపైనా భారం పడుతుందన్నారు. అయితే దీనిపై మంత్రు లు యనమల, ప్రత్తిపాటి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. -
ఐడీఎఫ్సీ లాభదాయకత తగ్గుతుంది
ముంబై: బ్యాంక్ లెసైన్స్ పొందినప్పటికీ ప్రస్తుతం ఐడీఎఫ్సీ రేటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని క్రెడిట్ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ పేర్కొంది. అయితే స్వల్పకాలానికి లాభదాయకత క్షీణించే అవకాశమున్నదని తెలిపింది. కంపెనీకి అనుభవంలేని, పోటీ అధికంగాగల బ్యాంకింగ్ రంగంలో విస్తరించే బాటలో కంపెనీకి సవాళ్లు ఎదురుకాగలవని హెచ్చరించింది. బ్యాంక్‌గా అవతరించేందుకు ఐడీఎఫ్సీకి రిజర్వ్ బ్యాంక్ నుంచి ముందస్తు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఇండియా రేటింగ్స్ ఇలా...: బ్యాంక్‌గా మారడంలో ఐడీఎఫ్సీ పలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. దీంతో స్వల్ప, మధ్యకాలాలకు లాభాదాయకత పడిపోతుందని వ్యాఖ్యానించింది. ఇన్ఫ్రాపై దృష్టిపెట్టిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ స్థాయి నుంచి బ్యాంక్‌గా మారడంలో రిటైల్ డిపాజిట్లను ఆకట్టుకోవడం, వివిధ రంగాలకు రుణాల మంజూరీ వంటి అంశాలలో ఐడీఎఫ్సీ పలు సమస్యలను అధిగమించవలసి ఉంటుందని వివరించింది. నగదు నిల్వల నిష్పత్తిని 4%, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తిని 23% చొప్పున నిలుపుకోవ డంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ భారీగా క్షీణించే అవకాశమున్నదని అంచనా వేసింది. కాగా, బీఎస్ఈలో ఐడీఎఫ్సీ షేరు తొలుత దాదాపు 9% ఎగసి రూ. 139ను తాకింది. ఆపై అమ్మకాలు పెరగడంతో లాభాలు కోల్పోవడమేకాకుండా చివరికి 2.4% నష్టంతో రూ. 125 వద్ద ముగిసింది.