బ్రిక్స్‌ దేశాలకూ రేటింగ్‌ ఏజెన్సీ! | BRICS silent on new rating agency despite push by Narendra Modi | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ దేశాలకూ రేటింగ్‌ ఏజెన్సీ!

Published Tue, Sep 5 2017 3:28 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

బ్రిక్స్‌ దేశాలకూ రేటింగ్‌ ఏజెన్సీ! - Sakshi

బ్రిక్స్‌ దేశాలకూ రేటింగ్‌ ఏజెన్సీ!

మూడీస్‌ కాదిక... మోడీస్‌!!
► వర్ధమాన దేశాల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు
►  అమెరికన్‌ ఏజెన్సీల ఆధిపత్యానికి చెక్‌
► బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన  


జియామెన్‌: ఇప్పటిదాకా క్రెడిట్‌ రేటింగ్‌ విభాగంలో ఆధిపత్యం చలాయిస్తున్న పశ్చిమ దేశాల ఏజెన్సీలకు చెక్‌ చెప్పే దిశగా వర్ధమాన దేశాలు తమ కోసం ప్రత్యేకంగా రేటింగ్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్ధమాన దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, ఇతర కార్పొరేట్ల ఆర్థిక అవసరాల కోసం బ్రిక్స్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ తోడ్పడగలదని ఆయన చెప్పారు. బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌతాఫ్రికా) కూటమి 9వ సదస్సు ప్లీనరీ సెషన్‌లో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ సూచన చేశారు.

బ్రిక్స్‌ రేటింగ్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలతో పాటు ఇతర వర్ధమాన దేశాలకూ లాభం ఉంటుందని చెప్పారాయన. ‘‘దీని గురించి గత ఏడాది కూడా చర్చించాం. సాధ్యాసాధ్యాలను ఒక నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళిక సిద్ధం చేయాలని కోరుకుంటున్నాను‘ అని ఆయన తెలిపారు. అలాగే ఆర్థిక రంగంలో బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం మరింతగా పెరగాలని మోదీ పేర్కొన్నారు. ఇందులో కేంద్రీయ బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని సూచించారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా సీఆర్‌ఏ (క్రెడిట్‌ రేటింగ్‌) మార్కెట్లో ఎస్‌అండ్‌పీ, మూడీస్, ఫిచ్‌ వంటి సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ మూడు సంస్థలూ అమెరికాకు చెందినవే కావటం గమనార్హం. సావరిన్‌ క్రెడిట్‌ రేటింగ్స్‌ మార్కెట్లో ఈ మూడు సంస్థలకూ ప్రస్తుతం 90 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలోనే గతేడాది గోవాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో వర్ధమాన దేశాలు రేటింగ్స్‌ పరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను భారత్‌ ముందుకు తెచ్చింది. ప్రత్యామ్నాయ ఏజెన్సీ ఏర్పాటు అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

టెక్నాలజీతో అవినీతి, పేదరిక నిర్మూలన...
పేదరికం, అవినీతి నిర్మూలనకు టెక్నాలజీ, డిజిటల్‌ వనరులు అత్యంత శక్తిమంతమైన సాధనాలని నరేంద్ర మోదీ చెప్పారు. భారత ప్రభుత్వం వీటి ఊతంతో నల్లధనం, అవినీతిపై మరింత బలంగా పోరు సాగిస్తోందని ఆయన తెలిపారు. కొంగొత్త ఆవిష్కరణలు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థల రూపకల్పనలో బ్రిక్స్‌ దేశాలన్నీ భాగస్వాములైతే వృద్ధికి ఊతం లభిస్తుందని, పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు నిలకడగా అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని ప్రధాని తెలిపారు.

పన్ను ఎగవేతలు అరికట్టేందుకు సమాచార మార్పిడి ..
పన్ను ఎగవేతల సమస్యను అరికట్టే దిశగా పన్నులపరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, ఇతర వర్ధమాన దేశాలకూ కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందించాలని బ్రిక్స్‌ కూటమి తీర్మానించింది. తద్వారా సహేతుకమైన, అధునాతనమైన అంతర్జాతీయ స్థాయి పన్ను వ్యవస్థ రూపకల్పనకు కృషి చేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. బ్రిక్స్‌ సదస్సు ప్లీనరీ సెషన్‌ ముగింపు సందర్భంగా ఈ మేరకు షియామెన్‌ తీర్మాన ప్రకటనను విడుదల చేశాయి.

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) కంటింజెంట్‌ రిజర్వ్‌ అరేంజ్‌మెంట్‌ (సీఆర్‌ఏ) మొదలైన వాటి ఏర్పాటు ఫలవంతం కావడంపై బ్రిక్స్‌ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ ఆర్థిక వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాలు, వర్ధమాన దేశాల గళం వినిపిస్తామని పేర్కొన్నాయి. ‘అంతర్జాతీయ పన్ను నిబంధనల రూపకల్పనలో తన వంతుగా మరింత కీలకపాత్ర పోషించే క్రమంలో బ్రిక్స్‌ కూటమి దేశాలు పన్నులపరమైన అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకుంటాయి. అలాగే ప్రాధాన్యతలను బట్టి.. ఇతర వర్ధమాన దేశాలకూ తగిన సాంకేతిక సహకారాన్ని అందిస్తాయి‘ అని తీర్మానంలో బ్రిక్స్‌ కూటమి పేర్కొంది.

నాలుగు ఒప్పందాలు ..
సదస్సు సందర్భంగా బ్రిక్స్‌ కూటమిలో భారత్‌ సహా అయిదు సభ్య దేశాలు.. నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక, వాణిజ్య సహకారంపై బ్రిక్స్‌ కార్యాచరణ ప్రణాళిక, నవకల్పనల ఆవిష్కరణలో పరస్పర సహకారం (2017–2020), బ్రిక్స్‌ కస్టమ్స్‌ కోఆపరేషన్‌పై వ్యూహాత్మక విధానంపై ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. అలాగే, వ్యూహాత్మక సహకారంపై బ్రిక్స్‌ వ్యాపార మండలి, న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ కూడా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement