బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ కరచాలనం
జోహన్నెస్‌బర్గ్: డిజిటల్ విప్లవంతో బ్రిక్స్, ఇతర వర్థమాన దేశాలకు కొత్త అవకాశాలు వెల్లువెత్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ వల్ల వచ్చే మార్పుకు ఈ దేశాలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చివరి రోజు శుక్రవారం నిర్వహించిన ‘ఔట్‌రీచ్ సెషన్’లో మోదీ ప్రసంగించారు. డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు.
ఆఫ్రికా దేశాలతో భారత్‌కున్న చారిత్రక, లోతైన సంబంధాలను ప్రస్తావించారు. ‘డిజిటల్ విప్లవం వల్ల ఈ రోజు మనం మరో చారిత్రక సందర్భానికి చేరువలో ఉన్నాం. కొత్త అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ తీసుకొచ్చే మార్పుకు పూర్తిగా సంసిద్ధం కావాలి. ఆఫ్రికాలో అభివృద్ధి, శాంతి స్థాపనకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. భారత్–ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక, అభివృద్ధి సహకారం కొత్త శిఖరాలను తాకింది. గత నాలుగేళ్లలో ఇరు వర్గాల మధ్య దేశాధినేతలు, ఉన్నతాధికారుల స్థాయిలో 100కు పైగా ద్వైపాక్షిక చర్చలు, పర్యటనలు జరిగాయి.
40 ఆఫ్రికా దేశాలకు సుమారు రూ.75 వేల కోట్లకు పైగా రుణ సాయం కల్పించాం. ఆఫ్రికా ప్రాంతీయ ఆర్థిక కూటమికి జరుగుతున్న ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల గత మూడు దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచీకరణ ఫలాలను వారికి చేరువచేయడం చాలా ముఖ్యం. 2008 నాటి ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచీకరణకు రక్షణాత్మక వాణిజ్య విధానాలు సవాలుగా మారాయి’ అని మోదీ అన్నారు. ఆఫ్రికా దేశాలతో సంబంధాల బలోపేతానికి ఉగాండా పార్లమెంట్‌లో ప్రతిపాదించిన 10 మార్గదర్శక సూత్రాలను మరోసారి ప్రస్తావించారు. మూడు ఆఫ్రికా దేశాల పర్యటన, బ్రిక్స్ సదస్సు ముగించుకుని మోదీ శుక్రవారం సాయంత్రం భారత్ తిరుగు పయనమయ్యారు.
పుతిన్‌తో మోదీ భేటీ..
జోహన్నెస్‌బర్గ్‌లో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘పుతిన్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయి. రష్యా–భారత్‌ల స్నేహం దృఢమైనది. భిన్న రంగాల్లో సహకారం, కలసిపనిచేయడాన్ని రెండు దేశాలు కొనసాగిస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, పర్యాటకం తదితరాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు, టర్కీ, అంగోలా, అర్జెంటీనా అధ్యక్షులతోనూ మోదీ వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు.
గోల్డ్ మైనింగ్‌కు ‘బ్రిక్స్’ ప్రశంస..
రష్యాలోని సైబీరియాలో భారత్ నేతృత్వంలో ప్రారంభంకానున్న బంగారం తవ్వకాల ప్రాజెక్టును బ్రిక్స్ కూటమి ప్రశంసించింది. çక్లుచెవెస్‌కోయె గోల్డ్ మైనింగ్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భారత్‌కు చెందిన సన్ గోల్డ్ లిమిటెడ్‌దే కీలక పాత్ర. చైనా నేషనల్ గోల్డ్ గ్రూప్ కార్పొరేషన్, రష్యా సావెరిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, ఫార్ ఈస్ట్ అండ్ బైకాల్ రీజియన్ డెవలప్‌మెంట్ ఫండ్‌లతో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఈ గనుల నుంచి ఏటా 6.5 టన్నుల బంగారాన్ని వెలికితీసేలా ప్రణాళికలు రచించారు. ఉత్పాదకత ప్రారంభించడానికి ముందు సుమారు రూ.34 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అతిపెద్ద పెట్టుబడి, సాంకేతిక భాగస్వామి చైనా కంపెనీ కాగా, రష్యాలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సన్ గోల్డ్ లిమిటెడ్ అనుభవం ఈ ప్రాజెక్టుకు కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment