
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది జరగబోయే 10వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని∙మోదీ హాజరుకానున్నారు. జూలై 25 నుంచి 27 వరకు జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఈసారి అంతర్జాతీయ శాంతి, రక్షణ అంశాలపై చర్చ జరిగే వీలుంది. అంతకుముందు రువాండా, ఉగాండాలో పర్యటించనున్నారు. జూలై 23 నుంచి 27 వరకు మోదీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. మొదట రువాండాలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. తర్వాత జూలై 24న ఉగాండాకు బయల్దేరి వెళ్లి, అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అక్కడి జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో అంతర్జాతీయ శాంతి, రక్షణ, అంతర్జాతీయ పరిపాలన, వాణిజ్య సంబంధ సమస్యలపై సభ్య దేశాల నేతలు చర్చిస్తారు. సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కాగా, బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ కానున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరువురు నేతలు వాణిజ్యంలో అమెరికా వైఖరి సహా ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను చర్చిస్తారు.