ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ
చింగ్‌దావ్: పొరుగుదేశమైన చైనాతో ద్వైపాక్షిక బంధాలను మరింత పరిపుష్టం చేసుకునే దిశగానే ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో విస్తృతాంశాలపై భారత ప్రధాని మోదీ శనివారం చర్చలు జరిపారు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పులపైనా ఈ భేటీలో చర్చించినట్లు మోదీ చెప్పారు. చైనాలోని చింగ్‌దావ్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 18వ సదస్సుకు ముందు ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. ఏప్రిల్ చివరివారంలో చైనాలోని వుహాన్‌లో మోదీ–జిన్‌పింగ్ మధ్య జరిగిన ప్రత్యేక భేటీలో చర్చించిన అంశాలకు కొనసాగింపుగా శనివారం నాటి భేటీ జరిగింది.
బ్రహ్మపుత్ర నదిపై సమాచార మార్పిడి సహా పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. వుహాన్ సదస్సులో బంధాల బలోపేతం దిశగా బ్లూప్రింట్‌పై చర్చించారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. డోక్లాం వివాదం తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడంతోపాటు పరస్పర విశ్వాసాన్ని పెంచుకునే దిశగానే వీరి భేటీ జరిగింది. ‘జిన్‌పింగ్‌తో సమావేశం జరిగింది. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించాం. భారత్–చైనా స్నేహ బంధాన్ని ఈ చర్చలు బలోపేతం చేయనున్నాయి.
అంతర్జాతీయ సమాజానికీ మేలుచేసే అంశాలపై చర్చించాం. వుహాన్‌లో జరిగిన భేటీలోనూ చాలా అంశాలపై ఇద్దరం ఏకాభిప్రాయానికి వచ్చాం’ అని మోదీ ట్వీట్ చేశారు. భారత్‌తో కలసి పనిచేసేందుకు చైనా ఆసక్తిగా ఉందని.. పరస్పర విశ్వాసం పెంచుకునేందుకు వుహాన్ సమావేశం తొలిమెట్టని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు చైనా అధికారిక మీడియా జిన్‌హువా వెల్లడించింది. తమ సైన్యాలు పరస్పర సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకునేలా వ్యూహాత్మక మార్గదర్శనం చేయాలని కూడా భేటీలో నిర్ణయించారు. గత నాలుగేళ్లలో వీరిద్దరూ భేటీ కావడం ఇది 14వ సారి.
ఒకరికొకరుగా ముందుకు..
డోక్లాం వివాదం, అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వాన్ని, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు అణ్వాయుధ దేశాలు మళ్లీ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాయి. గతవారం సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ–లా డైలాగ్ సదస్సులో ‘భారత్–చైనాలు పరస్పర విశ్వా సం, పరస్పర సహకారంతో పనిచేయడం ద్వారా ఆసియాతోపాటు మొత్తం ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందిస్తుంద’ని మోదీ పేర్కొనటం ఇరుదేశాలు ఒకరి సామర్థ్యాలను మరొకరు గుర్తించి ముందుకెళ్లాలన్న ప్రయత్నాన్ని సూచిస్తోంది.
ఎస్‌సీవోతో కలసి పనిచేస్తాం: మోదీ
ఎస్‌సీవోలోని సభ్య దేశాలతో చురుకుగా పనిచేసేందుకు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందని మోదీ పేర్కొన్నారు. ఎస్‌సీవో సెక్రటరీ జనరల్ రశీద్ అలిమోవ్‌తో ఆయన శనివారం భేటీ అయ్యారు. ‘ఎస్‌సీవోలో పూర్తిస్థాయి సభ్యత్వం వచ్చిన తర్వాత భారత్ పాల్గొంటున్న తొలి సమావేశం ఇది. ఇందులో భాగంగా రశీద్ అలిమోవ్‌తో పలు అంశాలపై జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి’ అని మోదీ పేర్కొన్నారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీజింగ్‌లోని ఎస్‌సీవో ప్రధాన కార్యాలయంలో అధికారికంగా నిర్వహిస్తామని రశీద్ చెప్పారు. 2005 నుంచి ఈ కూటమిలో భారత్ అబ్జర్వర్‌గా ఉంది. అంతకుముందు, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం తదుపరి పనిచేయాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలీ రెహమాన్‌తోనూ మోదీ భేటీ అయ్యారు.
జిన్‌పింగ్‌కు మోదీ ఆహ్వానం
భారత్‌లో వుహాన్ తరహా భేటీ
ఇటీవల వుహాన్‌లో మోదీ–జిన్‌పింగ్ మధ్య జరిగిన ప్రత్యేకమైన ఇష్టాగోష్టి తరహా సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రావాలని ద్వైపాక్షిక చర్చల అనంతరం జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారు. ఇందుకు చైనా అధ్యక్షుడు అంగీకరించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే పేర్కొన్నారు. 2019లో భారత్‌లో వుహాన్ తరహా భేటీని నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. దీనికి రావాలంటూ జిన్‌పింగ్‌ను కోరగా ఆయన ఈ ఆహ్వానాన్ని మన్నించారు. అయితే.. ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా నిర్ణయం కాలేదు.
ఇరుదేశాల దౌత్య అధికారులు దీనిపై చర్చించి ఖరారు చేస్తారు’ అని గోఖలే వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జూలైలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో మళ్లీ మోదీ–జిన్‌పింగ్ కలవనున్నారు. ముంబైలో బ్యాంక్ ఆఫ్ చైనా శాఖను తెరిచేందుకు అనుమతివ్వాలని ఈ సందర్భంగా మోదీని జిన్‌పింగ్ కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించారు. అటు, ఇరుదేశాల విదేశాంగ శాఖల మంత్రులు సుష్మా స్వరాజ్, వాంగ్ యీల నేతృత్వంలో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి కొత్త వ్యవస్థ ఏర్పాటుకానుంది. ఈ వ్యవస్థ తొలి సమావేశం ఈ ఏడాది చివరికల్లా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment