బీజింగ్: రష్యాలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీలో ముఖ్యమైన అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. బ్రెజిల్‌లో జరగబోయే జీ20 సదస్సులో మోదీ, జిన్‌పింగ్ భేటీ కానున్న నేపధ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ షియాన్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారన్నారు.
ఈ సందర్భంగా చర్చించిన ముఖ్యమైన అంశాలపై ఇరుదేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడానికి చైనా సిద్ధంగా ఉన్నదన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య చర్చలు, సహకారాన్ని మెరుగుపరచడానికి, పరస్పర నమ్మకాన్ని పెంపొందించడానికి భారతదేశంతో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయితే ఇరు దేశాల నేతలు, అధికారుల మధ్య త్వరలో జరగబోయే సమావేశపు షెడ్యూల్‌పై తన దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని షియాన్ చెప్పారు.
గత నెలలో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో సందర్భంగా జరిగిన సమావేశంలో తూర్పు లఢాక్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి మిగిలిన స్టాండ్ ఆఫ్ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకోవడంపై మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చ జరిగింది. విభేదాలు, వివాదాలను సక్రమంగా పరిష్కరించుకోవడంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరాన్ని మోదీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ఇరు దేశాల సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలని ఆయన అన్నారు. అదే సమయంలో చైనా, భారత్‌లు వ్యూహాత్మక అవగాహనను కొనసాగించాలని, ఇరు దేశాలు సామరస్యంగా జీవించడానికి, కలిసి అభివృద్ధి చెందడానికి కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ అన్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి.. మాజీ మంత్రి తలకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment