మోదీ–జిన్‌పింగ్ భేటీ లేదు!
►భారత్ ఆర్మీని వెనక్కు తీసుకుంటేనే చర్చలు: చైనా
► భేటీ షెడ్యూల్‌లో లేదు: భారత్
► ఇజ్రాయెల్ నుంచి జీ–20 కోసం జర్మనీకి మోదీ
బీజింగ్/న్యూఢిల్లీ: జర్మనీలోని హాంబర్గ్‌లో జరగనున్న జీ–20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యే అవకాశాల్లేవని చైనా స్పష్టం చేసింది. సిక్కిం సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం లేనందున ద్వైపాక్షిక భేటీ జరగబోదని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. సరిహద్దుల్లోని బలగాలను భారత్ వెనక్కు తీసుకోవాలని హెచ్చరించింది. దీనికి భారత్ దీటుగానే స్పందించింది. జీ–20 సదస్సు సందర్భంగా భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక భేటీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌లోనే లేదని భారత్ స్పష్టం చేసింది.
బలగాలు వెనక్కు తీసుకుంటేనే..
భారత్–చైనా దేశాధినేతల మధ్య సమావేశం రద్దుచేసుకుంటున్నట్లు చైనా వెల్లడించటంతో మాటలయుద్ధం మరింత వేడెక్కింది. ‘సరిహద్దుల్లో మోహరించిన తన సైన్యాన్ని భారత్ వెంటనే వెనక్కు తీసుకోవాలి. తీవ్రమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ గురువారం హెచ్చరించారు. అయితే జీ–20 సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాధినేతల సమావేశం యథా విధిగానే కొనసాగుతుందన్నారు. డోక్లామ్ ప్రాంతంలో చైనా నిర్మించతలపెట్టిన వ్యూహా త్మక రోడ్డు నిర్మాణానికి భారత్ అనవసరంగా అడ్డుపడుతోందన్నారు. దీని వల్ల భారత్‌కు వచ్చే ఇబ్బందేమీ ఉండదని గెంగ్ తెలిపారు.
వివిధ దేశాధినేతలతో మోదీ భేటీ
హాంబర్గ్‌లో మూడ్రోజులపాటు జరగనున్న జీ–20 దేశాధినేతల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ.. పలుదేశాధినేతలతో భేటీ కానున్నారు. ‘జీ–20 సదస్సులో భాగంగా అర్జెంటీనా, కెనడా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, బ్రిటన్, వియత్నాం దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దీంతోపాటుగా బ్రిక్స్ నేతల సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలపైనే జీ–20 సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది.
ఇజ్రాయెల్ నిర్లవణీకరణ భేష్: మోదీ
హైఫా: ఇజ్రాయెల్ పర్యటనలో చివరిదైన మూడోరోజూ భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సరదాగా గడిపారు. భారత్‌తో కుదుర్చుకున్న నీటి సంస్కరణ ఒప్పందంలో భాగంగా సముద్రపు నీటిని నిర్లవణీకరణ చేసే వాహనాన్ని వీరిద్దరూ పరిశీలించారు. ఈ విధానం అమలును మోదీ ప్రశంసించారు. ఈ వాహనం ద్వారా రోజుకు 20వేల లీటర్ల సముద్రపు నీటిని, 80 వేల లీటర్ల మురికి (వర్షం పడ్డప్పుడు నదుల్లోకి వచ్చే బురదనీరు)ని శుద్ధి చేయగలదు.
‘నీటి శుద్ధీకరణ, నిర్లవణీకరణలో ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ముందుంది. ఈ సాంకేతికతను మేం భారత్‌తో పంచుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఈ వాహనంలోనే ఇరువురు నేతలు కాసేపు ప్రయాణించారు. మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయెల్ స్వాతంత్య్రం కోసం అమరులైన భారత సైనికుల స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంతకుముందు, భారత–ఇజ్రాయెల్ సీఈవోలతో మోదీ సమావేశమయ్యారు.
జీఎస్టీ పెద్ద ఆర్థిక సంస్కరణ
టెల్ అవివ్‌లో భారత–ఇజ్రాయెల్ సీఈవోల ఫోరమ్‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. భారత్‌లో ఇటీవలే అమల్లోకి తెచ్చిన జీఎస్టీ దేశంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అని ఆయన తెలిపారు. ఈ విధానం వల్ల దేశం ఆధునిక, పారదర్శక, స్థిరమైన పన్ను వ్యవస్థగా మారిందన్నారు. భారత–ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతమున్న 5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
ఇజ్రాయెల్ సాంకేతిక విజయంలో ఇక్కడి వాణిజ్యవేత్తల పాత్ర కీలకమన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు స్వాతంత్రం తీసుకురావటంలో భారత సైనికుల ప్రాణత్యాగం మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైఫా పట్టణంలోని అప్పటి అమరుల స్మారకాన్ని మోదీ గురువారం సందర్శించి నివాళులర్పించారు. ఈ యుద్ధంలో భారత సైనికులకు నాయకత్వం వహించిన దల్‌పత్ సింగ్ (హీరో ఆఫ్ హైఫాగా పిలుస్తారు) స్మారకాన్ని నెతన్యాహుతో కలిసి మోదీ ఆవిష్కరించారు. అనంతరం, జీ–20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జర్మనీ బయలుదేరారు.