కీలకాంశాలను గౌరవించుకుంటూ!
అస్తానాలో మోదీ–జిన్‌పింగ్ ప్రత్యేక భేటీ
► ఇరుదేశాల వివాదాల పరిష్కారంపై సానుకూల చర్చ
అస్తానా: భారత్–చైనా మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుని పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఇరుదేశాల అధినేతలు మోదీ, జిన్‌పింగ్‌లు నిర్ణయించారు. ఎస్‌సీవో సదస్సుకు ముందే.. వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ఇరుదేశాలు కీలక సమస్యలను గౌరవిస్తూనే.. ఆ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్‌తో మోదీ తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో సమాచారం, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతోపాటు పలు కీలక ద్వైపాక్షిక అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.
‘ఇరుదేశాల మధ్య చిన్న చిన్న సమస్యలున్నాయి. అభిప్రాయ భేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. దీనిపైనే సమావేశంలో చర్చ జరిగింది’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ తెలిపారు. సమావేశాలు హృదయపూర్వకంగా, సానుకూలంగా జరిగాయన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం ఎస్‌సీవో, దీని ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థపై ఉంటుందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది. భారత్–పాక్ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించటంలోనూ ఈ కూటమి చొరవ తీసుకోవచ్చని పేర్కొంది.
‘దంగల్ సినిమా చూశా.. బాగుంది’
ఆమిర్‌ఖాన్ నటించిన దంగల్ చిత్రాన్ని చూశానని.. తనకు బాగా నచ్చిందని మోదీతో సమావేశం సందర్భంగా జిన్‌పింగ్ తెలిపారు. చైనాలో ఈ చిత్రం చాలా బాగా నడుస్తోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలని జిన్‌పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మే 5న చైనాలో విడుదలైన ఈ చిత్రం ఆ దేశ చిత్రపరిశ్రమలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి.. రూ. 1,100 కోట్లు వసూళ్లు చేసింది. దీంతోపాటుగా జూన్ 21న జరగనున్న యోగా డే సంబరాల గురించి కూడా జిన్‌పింగ్ మోదీతో చర్చించినట్లు జై శంకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సహకారాన్ని మరింత వృద్ధి చేసుకోవటంపైనా ఇరువురూ చర్చించారన్నారు.