SCO convention
-
ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మీడియా ఆకాశానికెత్తింది. ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ఎస్సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని సూచించడంపై ప్రశంసలతో ముంచెత్తింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను హైలైట్ చేస్తూ అమెరికా ప్రముఖ వార్తా సంస్థలు, వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ తమ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించాయి. 'సమకాలీన ప్రపంచంలో యుద్ధానికి తావులేదు.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించండి' అని మోదీ పుతిన్‌తో అన్నారు అంటూ వాషింగ్టన్ పోస్టు హెడ్లైన్లో చెప్పింది. దీంతో రష్యా అధ్యక్షుడు ప్రపంచ నలుమూలల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు అయిందని పేర్కొంది. మోదీకి బదులిస్తూ.. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని పుతిన్ మాటిచ్చారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భారత్ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, చర్చల ప్రక్రియను ఉక్రెయిన్ బహిష్కరించడం వల్లే సైన్యం ఇంకా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పుతిన్ చెప్పినట్లు వెల్లడించింది. ఎస్సీఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా పుతిన్‌లో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం గరించి ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. మోదీ మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తి యుద్ధాన్ని ఆపాలని కోరడాన్ని అమెరికా మీడియా కొనియాడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పుతిన్‌తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే పలుమార్లు ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు. చదవండి: బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్ -
జిన్‌పింగ్, పుతిన్‌లతో మోదీ భేటీ
బిష్కెక్ : షాంఘై సహకార సంస్ధ (ఎస్సీఓ) సమావేశాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. పుతిన్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ అమేథిలో రైఫిల్ తయారీ యూనిట్‌కు రష్యా సహకారాన్ని కొనియాడారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. భారత్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్‌ల ప్రారంభంతో పాటు మసూద్ అజర్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడం సహా పలు ద్వైపాక్షిక అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. కాగా, ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారని, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతమవుతోందని..వారు పలు ద్వైపాక్షిక అంశాలపై సంప్రదింపులు జరిపారని పీఎంఓ ట్వీట్ చేసింది. -
బలమైన బంధం దిశగా..!
చింగ్‌దావ్: పొరుగుదేశమైన చైనాతో ద్వైపాక్షిక బంధాలను మరింత పరిపుష్టం చేసుకునే దిశగానే ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో విస్తృతాంశాలపై భారత ప్రధాని మోదీ శనివారం చర్చలు జరిపారు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పులపైనా ఈ భేటీలో చర్చించినట్లు మోదీ చెప్పారు. చైనాలోని చింగ్దావ్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 18వ సదస్సుకు ముందు ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. ఏప్రిల్ చివరివారంలో చైనాలోని వుహాన్‌లో మోదీ–జిన్‌పింగ్ మధ్య జరిగిన ప్రత్యేక భేటీలో చర్చించిన అంశాలకు కొనసాగింపుగా శనివారం నాటి భేటీ జరిగింది. బ్రహ్మపుత్ర నదిపై సమాచార మార్పిడి సహా పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. వుహాన్ సదస్సులో బంధాల బలోపేతం దిశగా బ్లూప్రింట్‌పై చర్చించారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. డోక్లాం వివాదం తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడంతోపాటు పరస్పర విశ్వాసాన్ని పెంచుకునే దిశగానే వీరి భేటీ జరిగింది. ‘జిన్‌పింగ్‌తో సమావేశం జరిగింది. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించాం. భారత్–చైనా స్నేహ బంధాన్ని ఈ చర్చలు బలోపేతం చేయనున్నాయి. అంతర్జాతీయ సమాజానికీ మేలుచేసే అంశాలపై చర్చించాం. వుహాన్‌లో జరిగిన భేటీలోనూ చాలా అంశాలపై ఇద్దరం ఏకాభిప్రాయానికి వచ్చాం’ అని మోదీ ట్వీట్ చేశారు. భారత్‌తో కలసి పనిచేసేందుకు చైనా ఆసక్తిగా ఉందని.. పరస్పర విశ్వాసం పెంచుకునేందుకు వుహాన్ సమావేశం తొలిమెట్టని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా వెల్లడించింది. తమ సైన్యాలు పరస్పర సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకునేలా వ్యూహాత్మక మార్గదర్శనం చేయాలని కూడా భేటీలో నిర్ణయించారు. గత నాలుగేళ్లలో వీరిద్దరూ భేటీ కావడం ఇది 14వ సారి. ఒకరికొకరుగా ముందుకు.. డోక్లాం వివాదం, అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వాన్ని, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు అణ్వాయుధ దేశాలు మళ్లీ సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాయి. గతవారం సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ–లా డైలాగ్ సదస్సులో ‘భారత్–చైనాలు పరస్పర విశ్వా సం, పరస్పర సహకారంతో పనిచేయడం ద్వారా ఆసియాతోపాటు మొత్తం ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందిస్తుంద’ని మోదీ పేర్కొనటం ఇరుదేశాలు ఒకరి సామర్థ్యాలను మరొకరు గుర్తించి ముందుకెళ్లాలన్న ప్రయత్నాన్ని సూచిస్తోంది. ఎస్సీవోతో కలసి పనిచేస్తాం: మోదీ ఎస్సీవోలోని సభ్య దేశాలతో చురుకుగా పనిచేసేందుకు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందని మోదీ పేర్కొన్నారు. ఎస్సీవో సెక్రటరీ జనరల్ రశీద్ అలిమోవ్తో ఆయన శనివారం భేటీ అయ్యారు. ‘ఎస్సీవోలో పూర్తిస్థాయి సభ్యత్వం వచ్చిన తర్వాత భారత్ పాల్గొంటున్న తొలి సమావేశం ఇది. ఇందులో భాగంగా రశీద్ అలిమోవ్తో పలు అంశాలపై జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి’ అని మోదీ పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీజింగ్‌లోని ఎస్సీవో ప్రధాన కార్యాలయంలో అధికారికంగా నిర్వహిస్తామని రశీద్ చెప్పారు. 2005 నుంచి ఈ కూటమిలో భారత్ అబ్జర్వర్‌గా ఉంది. అంతకుముందు, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం తదుపరి పనిచేయాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలీ రెహమాన్తోనూ మోదీ భేటీ అయ్యారు. జిన్‌పింగ్‌కు మోదీ ఆహ్వానం భారత్‌లో వుహాన్ తరహా భేటీ ఇటీవల వుహాన్‌లో మోదీ–జిన్‌పింగ్ మధ్య జరిగిన ప్రత్యేకమైన ఇష్టాగోష్టి తరహా సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రావాలని ద్వైపాక్షిక చర్చల అనంతరం జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారు. ఇందుకు చైనా అధ్యక్షుడు అంగీకరించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే పేర్కొన్నారు. 2019లో భారత్‌లో వుహాన్ తరహా భేటీని నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. దీనికి రావాలంటూ జిన్‌పింగ్‌ను కోరగా ఆయన ఈ ఆహ్వానాన్ని మన్నించారు. అయితే.. ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఇరుదేశాల దౌత్య అధికారులు దీనిపై చర్చించి ఖరారు చేస్తారు’ అని గోఖలే వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జూలైలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో మళ్లీ మోదీ–జిన్‌పింగ్ కలవనున్నారు. ముంబైలో బ్యాంక్ ఆఫ్ చైనా శాఖను తెరిచేందుకు అనుమతివ్వాలని ఈ సందర్భంగా మోదీని జిన్‌పింగ్ కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించారు. అటు, ఇరుదేశాల విదేశాంగ శాఖల మంత్రులు సుష్మా స్వరాజ్, వాంగ్ యీల నేతృత్వంలో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి కొత్త వ్యవస్థ ఏర్పాటుకానుంది. ఈ వ్యవస్థ తొలి సమావేశం ఈ ఏడాది చివరికల్లా జరగనుంది. -
పుతిన్‌కు చైనా పురస్కారం
బీజింగ్ /క్వింగ్డావ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుక్రవారం బీజింగ్‌లోని గ్రేట్‌హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో రష్యా అధినేత పుతిన్‌కు చైనా అత్యున్నత పురస్కారమైన ‘ఫ్రెండ్షిప్ మెడల్’ను అందజేశారు. ఈ మెడల్‌ను చైనా ప్రదానం చేయడం ఇదే తొలిసారి. శాంతియుతమైన ప్రపంచం కోసం పుతిన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. చైనాలో పుతిన్‌కు అత్యంత గౌరవముందని వ్యాఖ్యానించారు. గతేడాది రష్యాలో పర్యటించిన జిన్‌పింగ్‌ను ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ’ పురస్కారంతో పుతిన్ గౌరవించారు. ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ బీజింగ్‌కు వచ్చిన నేపథ్యంలో అమెరికా దూకుడును కట్టడి చేసేందుకు ఇరుదేశాధినేతలు ఈ సమావేశంలో ఓ అంగీకారానికి వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి నుంచి ఎన్సీవో సదస్సు ప్రారంభం చైనాలోని క్వింగ్డావ్లో శనివారం ప్రారంభంకానున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సులో భారత్, చైనా, రష్యా సహా 8 దేశాల అధినేతలు హాజరై ఉగ్రవాదంపై పోరుతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. జూన్ 9 నుంచి రెండ్రోజుల పాటు ఎస్సీవో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శనివారం భేటీ కానున్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ సదస్సులో వేర్వేరు దేశాధినేతలతో భేటీ అయి పలు అంశాలపై విస్తృతంగా చర్చింనున్నాం’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే ప్రధాని పాక్ అధ్యక్షుడితో భేటీ అవుతారా? అన్న విషయమై స్పష్టత రాలేదు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడంతో పాటు చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు, రష్యాపై యూరప్ దేశాలతో కలసి దౌత్యపరమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో జరగనున్న ఈ భేటీకి విశేష ప్రాధాన్యం ఏర్పడింది. -
సమన్వయంతో ‘ఉగ్ర’పోరు!
ఎస్సీవో సదస్సులో ప్రధాని మోదీ పిలుపు ► సభ్యదేశాల అనుసంధానతకు మద్దతు ► ఈ కూటమిలోకి అధికారికంగా చేరిన భారత్, పాక్ అస్తానా: ఉగ్రవాదంపై, ఈ మహమ్మారికి అందుతున్న సాయంపై షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమన్వయంతో పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన వార్షిక సదస్సులో ఎస్సీవోలో భారత్, పాక్‌లకు సభ్యత్వమిచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదం మానవహక్కులను, కనీస విలువలను ఉల్లంఘిస్తోంది. ఉగ్రవాదంపై పోరే ఎస్సీవో సహకారంలో చాలా కీలకం. ఈ బృందంలో భారత్ చేరటం టెర్రరిజంపై పోరును సరికొత్త దిశలోకి తీసుకెళ్తుంది’ అని తెలిపారు. ‘ఉగ్రవాదం, ఉగ్ర సంస్థల్లోకి నియామకాలు, శిక్షణ, వీరికి అందుతున్న నిధుల అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టి దీన్ని అంతం చేసేందుకు ఈ కూటమిలోని సభ్య దేశాలన్నీ ఏకతాటిపై నడవాలి’ అని మోదీ కోరారు. ఎస్సీవోలోని సభ్య దేశాలన్నీ తోటి సభ్య దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించుకుంటూ అనుసంధానత పెంచుకోవాలి. పరస్పర సహకారానికి ఇవే కీలకాంశాలు’ అని మోదీ తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమక్షంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీవోలో భారత్ చేరటం ద్వారా ఉగ్రవాదంపై పోరు మరింత వేగం పుంజుకుంటుందన్నారు. వాతావరణ మార్పుపైనా చర్చించాలి ‘ఎస్సీవో సభ్యదేశాల మధ్య అనుసంధానత చాలా కీలకం. దీనికి భారత్ మనస్ఫూర్తిగా మద్దతిస్తుంది. అయితే సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత చాలా అవసరం’ అని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఎస్సీవో సభ్యదేశాల మధ్య సత్సంబంధాలున్నాయి. అనుసంధానతపై మనం ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని తెలిపారు. భారత్‌కు సభ్యత్వం కల్పించినందుకు ఎస్సీవో దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కూటమిలో క్రియాశీలకంగా సానుకూల భాగస్వామిగా భారత్ ప్రయాణం మొదలైందన్నారు. వాతావరణ మార్పుపైనా ఎస్సీవో కూటమి చర్చించాలని.. అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించాలని ప్రధాని సూచించారు. చైనా ప్రతిపాదించిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ను భారత్ వ్యతిరేకించిన నేపథ్యంలో ‘సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్లాలం’టూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘భారత్, పాకిస్తాన్‌లు ఎస్సీవోలో సభ్యులవటం మాకు చాలా కీలకం’ అని కజకిస్తాన్ ప్రధాని నూర్సుల్తాన్ నజర్బయేవ్ తెలిపారు. 2005 నుంచి ఈ కూటమిలో భారత్, ఇరాన్, పాక్ దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ సందర్భంగా సభ్యదేశాలు అస్తానా డిక్లరేషన్‌తోపాటు 10 ఇతర ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరు చేసే అంశం కూడా ఉంది. నేతలు శాంతి, స్నేహాన్ని పెంచాలి ఎస్సీవోలో పూర్తిస్థాయి సభ్యత్వం పొందిన భారత్‌కు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. నేతలు భవిష్యత్ తరాలకోసం శాంతి, స్నేహాలను పెంచాలి తప్ప విషాన్ని చిమ్మటం సరికాదన్నారు. ఎస్సీవో సభ్యులు పొరుగుదేశాలతో ఐదేళ్లపాటు సత్సంబంధాలు కొనసాగించాలన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిపాదనను షరీఫ్ స్వాగతించారు. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాల విషయంలో ఎస్సీవో నిబంధనలు, పాక్ సిద్ధాంతాలు ఒకేలా ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ స్థిరత్వంలో ఎస్సీవో క్రియాశీలకంగా పనిచేస్తుందని, ఆసియా పసిఫిక్, తూర్పు, పశ్చిమ ఆసియా, అట్లాంటిక్ ప్రాంతంతో బలమైన బంధాలను ఏర్పాటుచేస్తుందని షరీఫ్ అభిప్రాయపడ్డారు. ఆకట్టుకున్న అలనాటి మధుర గీతాలు ఈ సదస్సులో బాలీవుడ్ అలనాటి మధురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సదస్సు భోజన విరామ సమయంలో అలనాటి మేటి హీరో రాజ్‌కపూర్ నటించిన చిత్రాల్లోని ‘ఆవారా హూ’, ‘మేరా జూతాహై జపానీ’ పాటలను వినిపించారు. వీటికి సదస్సుకు హాజరైన వారి నుంచి మంచి స్పందన వచ్చింది.