సమన్వయంతో ‘ఉగ్ర’పోరు!
ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ పిలుపు
► సభ్యదేశాల అనుసంధానతకు మద్దతు
► ఈ కూటమిలోకి అధికారికంగా చేరిన భారత్, పాక్
అస్తానా: ఉగ్రవాదంపై, ఈ మహమ్మారికి అందుతున్న సాయంపై షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమన్వయంతో పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన వార్షిక సదస్సులో ఎస్‌సీవోలో భారత్, పాక్‌లకు సభ్యత్వమిచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదం మానవహక్కులను, కనీస విలువలను ఉల్లంఘిస్తోంది. ఉగ్రవాదంపై పోరే ఎస్‌సీవో సహకారంలో చాలా కీలకం.
ఈ బృందంలో భారత్ చేరటం టెర్రరిజంపై పోరును సరికొత్త దిశలోకి తీసుకెళ్తుంది’ అని తెలిపారు. ‘ఉగ్రవాదం, ఉగ్ర సంస్థల్లోకి నియామకాలు, శిక్షణ, వీరికి అందుతున్న నిధుల అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టి దీన్ని అంతం చేసేందుకు ఈ కూటమిలోని సభ్య దేశాలన్నీ ఏకతాటిపై నడవాలి’ అని మోదీ కోరారు. ఎస్‌సీవోలోని సభ్య దేశాలన్నీ తోటి సభ్య దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించుకుంటూ అనుసంధానత పెంచుకోవాలి. పరస్పర సహకారానికి ఇవే కీలకాంశాలు’ అని మోదీ తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమక్షంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్‌సీవోలో భారత్ చేరటం ద్వారా ఉగ్రవాదంపై పోరు మరింత వేగం పుంజుకుంటుందన్నారు.
వాతావరణ మార్పుపైనా చర్చించాలి
‘ఎస్‌సీవో సభ్యదేశాల మధ్య అనుసంధానత చాలా కీలకం. దీనికి భారత్ మనస్ఫూర్తిగా మద్దతిస్తుంది. అయితే సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత చాలా అవసరం’ అని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఎస్‌సీవో సభ్యదేశాల మధ్య సత్సంబంధాలున్నాయి. అనుసంధానతపై మనం ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని తెలిపారు. భారత్‌కు సభ్యత్వం కల్పించినందుకు ఎస్‌సీవో దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కూటమిలో క్రియాశీలకంగా సానుకూల భాగస్వామిగా భారత్ ప్రయాణం మొదలైందన్నారు. వాతావరణ మార్పుపైనా ఎస్‌సీవో కూటమి చర్చించాలని.. అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించాలని ప్రధాని సూచించారు.
చైనా ప్రతిపాదించిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ను భారత్ వ్యతిరేకించిన నేపథ్యంలో ‘సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్లాలం’టూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘భారత్, పాకిస్తాన్‌లు ఎస్‌సీవోలో సభ్యులవటం మాకు చాలా కీలకం’ అని కజకిస్తాన్ ప్రధాని నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్ తెలిపారు. 2005 నుంచి ఈ కూటమిలో భారత్, ఇరాన్, పాక్ దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ సందర్భంగా సభ్యదేశాలు అస్తానా డిక్లరేషన్‌తోపాటు 10 ఇతర ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరు చేసే అంశం కూడా ఉంది.
నేతలు శాంతి, స్నేహాన్ని పెంచాలి
ఎస్‌సీవోలో పూర్తిస్థాయి సభ్యత్వం పొందిన భారత్‌కు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. నేతలు భవిష్యత్ తరాలకోసం శాంతి, స్నేహాలను పెంచాలి తప్ప విషాన్ని చిమ్మటం సరికాదన్నారు. ఎస్‌సీవో సభ్యులు పొరుగుదేశాలతో ఐదేళ్లపాటు సత్సంబంధాలు కొనసాగించాలన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిపాదనను షరీఫ్ స్వాగతించారు. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాల విషయంలో ఎస్‌సీవో నిబంధనలు, పాక్ సిద్ధాంతాలు ఒకేలా ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ స్థిరత్వంలో ఎస్‌సీవో క్రియాశీలకంగా పనిచేస్తుందని, ఆసియా పసిఫిక్, తూర్పు, పశ్చిమ ఆసియా, అట్లాంటిక్ ప్రాంతంతో బలమైన బంధాలను ఏర్పాటుచేస్తుందని షరీఫ్ అభిప్రాయపడ్డారు.
ఆకట్టుకున్న అలనాటి మధుర గీతాలు
ఈ సదస్సులో బాలీవుడ్ అలనాటి మధురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సదస్సు భోజన విరామ సమయంలో అలనాటి మేటి హీరో రాజ్‌కపూర్ నటించిన చిత్రాల్లోని ‘ఆవారా హూ’, ‘మేరా జూతాహై జపానీ’ పాటలను వినిపించారు. వీటికి సదస్సుకు హాజరైన వారి నుంచి మంచి స్పందన వచ్చింది.