న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఫోన్ చేశారు. పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై వీరు చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పుతిన్.. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. గత ఏడాది మేలో రష్యాలోని సోచిలో ఇద్దరు నేతల చర్చలు, పుతిన్ భారత్ పర్యటనల ద్వారా అత్యంత కీలకమైన ఉమ్మడి భాగస్వామ్యంలో అధిగమించిన మైలురాళ్లను, సాధించిన విజయాలపై ఇద్దరు సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ రంగం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మోదీ, పుతిన్ చర్చించారు. అంతర్జాతీయ అంశాలతోపాటు ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, తదితర ప్రపంచ వేదికలపై పరస్పర సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించారని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యాలోని వ్లాడివొస్టోక్‌లో సెప్టెంబర్‌లో జరగనున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మోదీని పుతిన్ ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment