సకాలంలో చెల్లిస్తే.. క్రెడిట్ కార్డ్ ఓకే!
‘అప్పు చేయడమంటే’ ఎవరికైనా ఇబ్బందే. డబ్బు లేకపోయినా కావలసినవన్నీ కొనుక్కోండంటూ బ్యాంకులు ఇవ్వజూపే ‘క్రెడిట్ కార్డ్’ అంటే కొంత భయం కూడా కలుగుతుంది. చెల్లింపుల్లో అనుకోకుండా జరిగే జాప్యం, వైఫల్యాలపై అధిక వడ్డీల భారాన్ని భరించాల్సి రావడమే ఈ భయానికి కారణం. అయితే ఇక్కడ చెల్లింపుల్లో ‘జాప్యం, వైఫల్యం’ లేకుండా తగిన విధంగా వినియోగించుకుంటే క్రెడిట్ కార్డ్ వల్ల ఒనగూరే ప్రయోజనాలు అపరిమితం.
ఆర్థికంగానే కాకుండా, నగదును ప్రతిచోటుకీ మీ వెంట తీసుకుపోయే అవసరాన్ని సైతం ఇది నివారిస్తుంది. డబ్బు ఎలా ఖర్చవుతోందన్న విషయాన్ని సైతం (మనీ మేనేజ్‌మెంట్) క్రెడిట్ కార్డ్- ఒక ‘రికార్డు’ లాగా మీ ముందు ఉంచుతుంది. నిర్దిష్ట కాలంలో వడ్డీరహిత ప్రయోజనం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రొడక్ట్ గురించి ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది.
ఫ్రీ క్రెడిట్ పీరియడ్ సదుపాయం...
క్రెడిట్ కార్డ్ కంపెనీలు ‘ఫ్రీ క్రెడిట్ పీరియడ్’ పేరుతో ఆఫర్ ఇస్తాయి. ఈ కాలం చాలా కంపెనీల విషయంలో దాదాపు 45 నుంచి 50 రోజులు ఉంటుంది. అంటే ఇక్కడ క్రెడిట్ కార్డును సరిగా వినియోగించుకోగలిగితే గరిష్టంగా 45-50 రోజులు ఎటువంటి వడ్డీలేని రుణాన్ని పొందే వీలుంటుంది. మీ ద్రవ్య లభ్యతనూ తగిన విధంగా మేనేజ్ చేసుకోవచ్చు.
ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన తేదీ నుంచీ ఈ ‘ఫ్రీ క్రెడిట్ పీరియడ్’ వర్తిస్తుందన్న అభిప్రాయం చాలా మందికి ఉంది. ఇది తప్పు. బిల్లింగ్ సర్కిల్ డే ప్రారంభం నుంచీ ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు పవన్ అనే వ్యక్తి బిల్లింగ్ సర్కిల్ జనవరి 1 నుంచి జనవరి 31 (నెల) అనుకుందాం. బిల్లింగ్ తేదీ జనవరి 31. ఇక్కడ పవన్ క్రెడిట్ ఫ్రీ పీరియడ్ 50 రోజులు అనుకుందాం. అంటే జనవరి 1 నుంచి జనవరి 31వ తేదీ మధ్య కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి రుణాన్ని జనవరి 1 నుంచే 50 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
అంటే బిల్లింగ్ తేదీ ఇక్కడ జనవరి 31 కాబట్టి, అక్కడి నుంచి 20 రోజుల్లో రుణం మొత్తాన్ని చెల్లించాలి. ఈ ఉదాహరణలో జనవరి 22న పవన్ ఒక వస్తువును క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేశాడనుకుందాం. ఇక్కడ పవన్‌కు వడ్డీలేని క్రెడిట్ ప్రయోజనం అందేది దాదాపు 29 రోజులు (జనవరిలో చివరి 9 రోజులు అటు తర్వాత 20 రోజులు). ఒకవేళ జనవరి 1నే కొనుగోలు జరిపితే 50 రోజులు ‘ఫ్రీ క్రెడిట్ పీరియడ్’ అమలవుతుంది.
రివార్డులు... డిస్కౌంట్లు... ఆఫర్లు
ఇక రివార్డు పాయింట్లూ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ‘ఫ్రీ క్రెడిట్ పీరియడ్’లో క్రెడిట్ కార్డ్‌పై ప్రతి కొనుగోలూ మీకు రివార్డు పాయింట్లను అందిస్తుంది. కంపెనీ-కంపెనీకి మధ్య ఈ రివార్డు పాయింట్లు వేర్వేరుగా ఉంటాయి. ఈ పాయింట్లు పెరిగిన కొలదీ మీకు ఆర్థికంగా ప్రయోజనమూ పెరుగుతుంది. షాపింగ్, వినోదం వంటి అంశాలకు సంబంధించి క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్, ప్రమోషనల్ ఆఫర్ల సంగతి చెప్పనక్కర్లేదు. కొన్ని బ్రాండ్ల ఉత్పత్తుల కొనుగోలుపై కొంత శాతం సొమ్ము మీ అకౌంట్‌లో తిరిగి జమ కావడమూ ఇక్కడ ప్రత్యేకాంశం.
జాగ్రత్తలు ఇవీ...
చెల్లింపుల్లో డిఫాల్ట్ అయితే... దాదాపు ప్రతి నెలా 2 నుంచి 3.5 శాతం వరకూ వడ్డీరేటు భరించాల్సి ఉంటుంది. వార్షికంగా ఈ రేటు 24 శాతం నుంచి 42 శాతం వరకూ లెక్కవుతుంది. కొనుగోలు తేదీ నుంచీ వడ్డీరేటు భారం పడడం ప్రారంభమవుతుంది. బిల్లింగ్ డేట్‌ను ఇక్కడ పరిగణనలోకి తీసుకోరు. అందుకే సకాలంలో బకాయి చెల్లించడానికి కమిట్ అయితే క్రెడిట్ కార్డ్ మంచి ఫలితాలను అందిస్తుంది.
మీ భవిష్యత్ రుణాలపై సైతం మీ ‘క్రెడిట్ స్కోర్’, ‘క్రెడిట్ రేటింగ్’ ప్రభావం చూపుతుందన్న విషయం ఇక్కడ గమనార్హం. వెరసి చెల్లింపుల విషయంలో డిఫాల్ట్, జాప్యం వంటి అంశాలు మీ భవిష్యత్ రుణ లభ్యత మీదే కాకుండా, అధిక వడ్డీరేటు భారానికీ, రుణ ఊబిలో కూరుకుపోవడానికీ కారణమవుతుంది. మంచీ చెడూ ఆలోచించుకోవాల్సింది ఇక మీరే.!!- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం