ముంబై: బ్యాంక్ లెసైన్స్ పొందినప్పటికీ ప్రస్తుతం ఐడీఎఫ్‌సీ రేటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని క్రెడిట్ రేటింగ్ దిగ్గజం ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అయితే స్వల్పకాలానికి లాభదాయకత క్షీణించే అవకాశమున్నదని తెలిపింది. కంపెనీకి అనుభవంలేని, పోటీ అధికంగాగల బ్యాంకింగ్ రంగంలో విస్తరించే బాటలో కంపెనీకి సవాళ్లు ఎదురుకాగలవని హెచ్చరించింది. బ్యాంక్‌గా అవతరించేందుకు ఐడీఎఫ్‌సీకి రిజర్వ్ బ్యాంక్ నుంచి ముందస్తు అనుమతి లభించిన సంగతి తెలిసిందే.
ఇండియా రేటింగ్స్ ఇలా...: బ్యాంక్‌గా మారడంలో ఐడీఎఫ్‌సీ పలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. దీంతో స్వల్ప, మధ్యకాలాలకు లాభాదాయకత పడిపోతుందని వ్యాఖ్యానించింది. ఇన్‌ఫ్రాపై దృష్టిపెట్టిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ స్థాయి నుంచి బ్యాంక్‌గా మారడంలో రిటైల్ డిపాజిట్లను ఆకట్టుకోవడం, వివిధ రంగాలకు రుణాల మంజూరీ వంటి అంశాలలో ఐడీఎఫ్‌సీ పలు సమస్యలను అధిగమించవలసి ఉంటుందని వివరించింది. నగదు నిల్వల నిష్పత్తిని 4%, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తిని 23% చొప్పున నిలుపుకోవ డంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ భారీగా క్షీణించే అవకాశమున్నదని అంచనా వేసింది. కాగా, బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ షేరు తొలుత దాదాపు 9% ఎగసి రూ. 139ను తాకింది. ఆపై అమ్మకాలు పెరగడంతో లాభాలు కోల్పోవడమేకాకుండా చివరికి 2.4% నష్టంతో రూ. 125 వద్ద ముగిసింది.
ఐడీఎఫ్‌సీ లాభదాయకత తగ్గుతుంది
Published Fri, Apr 4 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
Advertisement