bank licence
-
ఖాతాదారులకు షాక్.. రెండు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఏంటి? దీనికి సంబంధించిన ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మహారాష్ట్ర బుల్ధానా కేంద్రంగా ఉన్న మల్కాపుర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Malkapur Urban Co-operative Bank Ltd), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్' (Shushruti Souharda Sahakara Bank) లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసింది. గత బుధవారం రోజు బ్యాంకింగ్ లావాదేవీలు జరగకుండా సీజ్ చేసింది. రెండు బ్యాంకుల వద్ద ప్రస్తుతం సరైన మూలధనం లేదని.. భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే సూచనలు లేవని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతే కాకుండా డిపాజిటర్లకు కూడా పూర్తిగా డబ్బు చెల్లించే స్థితిలో లేనట్లు ఆర్బీఐ నిర్దారించింది. లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) డిఐసీజీసీ ప్రకారం మల్కాపుర్ సహకార బ్యాంక్ 97.60 శాతం మంది డిపాజిటర్లు తిరిగి వారి అమౌంట్ పొందటానికి అర్హులని తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్‌లో 91.92 శాతం మంది డిపాజిటర్లు అర్హులుగా తెలుస్తోంది. డిపాజిటర్లు దీనిని తప్పకుండా గమనించాలి. -
ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్
ముంబై: కొత్త బ్యాంకు కార్యకలాపాల నిర్వహణ అనేది మారథాన్ లాంటిదని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సంస్థ ఐడీఎఫ్సీ చైర్మన్ రాజీవ్ లాల్ వ్యాఖ్యానించారు. తొలి మూడేళ్లూ నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిస్తామని, ఆ తర్వాతే వృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌తో పాటు కొత్తగా బ్యాంకు లెసైన్సు దక్కించుకున్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘ఇది స్ప్రింట్ (వేగంగా పరుగెత్తడం) కాదు.. మారథాన్ (ఎక్కువదూరం పరుగెత్తడం)లాంటిది. ఇవాళ మొదలెడితే కనీసం ఆరేళ్ల నుంచి తొమ్మిదేళ్ల దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది’ అని బ్యాంకింగ్ కార్యకలపాల గురించి లాల్ చెప్పారు. తొలి మూడేళ్లలో నిలదొక్కుకోవడం, ప్రయోగాలు చేయడం, నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహణ గురించి తెలుసుకోవడంతోనే సరిపోతుందని లాల్ తెలిపారు. ఫలితంగా తొలి మూడేళ్లు వ్యాపార వృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టడానికి అవకాశం లభించదన్నారు. అందుకే, తొలి మూడేళ్లు తమ రుణాల మంజూరు పద్దులు తక్కువగా ఉన్నా పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని లాల్ పేర్కొన్నారు. ఏదేమైనా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), నిర్దేశిత ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) లాంటి అంశాల వల్ల తమ వ్యాపార పరిమాణం ప్రస్తుత స్థాయికన్నా మరింత ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. వ్యూహమిది.. తొలి మూడేళ్లలో వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యమిస్తామని లాల్ చెప్పారు. మూడేళ్లు ముగిసిన తర్వాత అప్పటికే సాధించిన వృద్ధిని నిలబెట్టుకోవడం, మరింత వృద్ధిని సాధించడంపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఆరో సంవత్సరం తర్వాత నుంచి వేగవంతమైన వృద్ధి సాధన మొదలు కాగలదన్నారు. ప్రారంభంలో 24-36 నెలల పాటు బ్యాంకు లాభదాయకతపై ఒత్తిడి ఉంటుందని లాల్ తెలిపారు. అయితే, బ్యాంకు నిలదొక్కుకున్నాక, అవసరమైన శాఖలు, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ..ప్రక్రియలను ఏర్పాటు చేసుకున్న తర్వాత నుంచి లాభదాయకత మెల్లిగా మెరుగుపడుతుంటుందని చెప్పారు. రిక్రూట్మెంట్.. కొత్త బ్యాంకులో మానవ వనరులకు సంబంధించి.. ఇప్పటికే ఇద్దరు-ముగ్గురు సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను తీసుకోవడం జరిగిందని లాల్ వివరించారు. మిగతా వారిని తీసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ప్రస్తుత, కొత్త బృందాలు కలిసి బ్యాంకును నిర్వహిస్తాయని ఆయన చెప్పారు. తాను, ఐడీఎఫ్సీ ఎండీ విక్రమ్ లిమాయే .. ఇటు బ్యాంకును, అటు మిగతా గ్రూప్‌ను పర్యవేక్షిస్తామన్నారు. బ్యాంకు సీఈవోని ఐడీఎఫ్సీ నుంచే ఎంపిక చేస్తామని, పేరు త్వరలో వెల్లడిస్తామని లాల్ పేర్కొన్నారు. ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ ఏర్పాటు.. ప్రస్తుతం ఐడీఎఫ్సీకి నాలుగు కార్యాలయాలు ఉన్నాయని, వీటిలో ఒకదాన్ని హెడ్‌క్వార్టర్స్‌గా ఉంచుకుని మిగతా మూడింటిని బ్యాంకు శాఖల కింద మార్చాలని యోచిస్తున్నామని లాల్ వివరించారు. బ్యాంకింగ్ సంస్థగా రూపాంతరం చెందే ప్రక్రియను వివరిస్తూ.. ఇందుకోసం నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ)ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త బ్యాంకు సహా ప్రస్తుత ఉన్న మూడు అనుబంధ సంస్థలకి (ఐడీఎఫ్సీ ఆల్టర్నేటివ్, ఐడీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఐడీఎఫ్సీ ఏఎంసీ) ఇది హోల్డింగ్ సంస్థగా ఉంటుందని లాల్ తెలిపారు. ఎన్వోఎఫ్హెచ్సీకి బ్యాంకు నాలుగో అనుబంధ సంస్థగా ఉంటుందని, దీన్ని తొలి రోజునే లిస్టింగ్ చేస్తామని చెప్పారు. ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ నుంచి బ్యాంకుగా రూపాంతరం చెందే క్రమంలో ప్రస్తుతమున్న ఐడీఎఫ్సీ షేర్హోల్డర్లకు కొంత మేర లిస్టెడ్ బ్యాంకులో నేరుగా వాటాలు ఇవ్వడం జరుగుతుందని లాల్ పేర్కొన్నారు. ఐడీఎఫ్‌సీలో 52-53 శాతం దాకా విదేశీ ప్రమోటర్ల వాటాలు ఉండగా.. వీటిని నిబంధనలకు అనుగుణంగా క్రమంగా 50 శాతం దిగువకు తెస్తామని లాల్ చెప్పారు. ఇందుకోసం ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ విధానాన్ని పాటిస్తామన్నారు. అటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ) లెసైన్సు కోసం కూడా ఐడీఎఫ్సీ దరఖాస్తు చేసిందని, వచ్చే రెండు-మూడు నెలల్లో దీన్ని దక్కించుకోగలదని లాల్ తెలిపారు. లెసైన్సు వచ్చాకా హౌసింగ్ లోన్స్ మంజూరు చేయడం ప్రారంభిస్తామని, ఆ తర్వాత వాటిని క్రమంగా బ్యాంకునకు బదలాయిస్తామన్నారు. -
ఐడీఎఫ్సీ లాభదాయకత తగ్గుతుంది
ముంబై: బ్యాంక్ లెసైన్స్ పొందినప్పటికీ ప్రస్తుతం ఐడీఎఫ్సీ రేటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని క్రెడిట్ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ పేర్కొంది. అయితే స్వల్పకాలానికి లాభదాయకత క్షీణించే అవకాశమున్నదని తెలిపింది. కంపెనీకి అనుభవంలేని, పోటీ అధికంగాగల బ్యాంకింగ్ రంగంలో విస్తరించే బాటలో కంపెనీకి సవాళ్లు ఎదురుకాగలవని హెచ్చరించింది. బ్యాంక్‌గా అవతరించేందుకు ఐడీఎఫ్సీకి రిజర్వ్ బ్యాంక్ నుంచి ముందస్తు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఇండియా రేటింగ్స్ ఇలా...: బ్యాంక్‌గా మారడంలో ఐడీఎఫ్సీ పలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. దీంతో స్వల్ప, మధ్యకాలాలకు లాభాదాయకత పడిపోతుందని వ్యాఖ్యానించింది. ఇన్ఫ్రాపై దృష్టిపెట్టిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ స్థాయి నుంచి బ్యాంక్‌గా మారడంలో రిటైల్ డిపాజిట్లను ఆకట్టుకోవడం, వివిధ రంగాలకు రుణాల మంజూరీ వంటి అంశాలలో ఐడీఎఫ్సీ పలు సమస్యలను అధిగమించవలసి ఉంటుందని వివరించింది. నగదు నిల్వల నిష్పత్తిని 4%, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తిని 23% చొప్పున నిలుపుకోవ డంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ భారీగా క్షీణించే అవకాశమున్నదని అంచనా వేసింది. కాగా, బీఎస్ఈలో ఐడీఎఫ్సీ షేరు తొలుత దాదాపు 9% ఎగసి రూ. 139ను తాకింది. ఆపై అమ్మకాలు పెరగడంతో లాభాలు కోల్పోవడమేకాకుండా చివరికి 2.4% నష్టంతో రూ. 125 వద్ద ముగిసింది. -
కొత్త బ్యాంకులకు ఫ్రీ ఎంట్రీ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థను మరింత మందికి చేరువ చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త బ్యాంకులకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉంది. ఇక అవసరమైన సమయంలో, తరచుగా లెసైన్సులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి సోమవారం తెలిపారు. దీనిపై సంబంధిత వర్గాలు తమ తమ అభిప్రాయాలు తెలిపాకా.. సమగ్రమైన మార్గదర్శ ప్రణాళిక రూపొందించే యోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు. అత్యుత్తమ ప్రమాణాలు, పారదర్శకతతో కొత్త బ్యాంకుల లెసైన్సులను జారీ చేసే ప్రక్రియలో ఆర్బీఐ నిమగ్నమైందని చక్రవర్తి పేర్కొన్నారు. ఇప్పటికే దేశీయ బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ చర్చాపత్రాన్ని విడుదల చేసిందని, సంబంధిత వర్గాల అభిప్రాయాలను ఆహ్వానించిందని ఆయన వివరించారు. చిన్న బ్యాంకులు, హోల్‌సేల్ బ్యాంకులు వంటి వాటికి వేర్వేరు విభాగాల కింద లెసైన్సులు ఇవ్వడం, భారీ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా మార్చడం తదితర అవకాశాలను ఇందులో ప్రస్తావించినట్లు చక్రవర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ లెసైన్సులను జారీ చేసే ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. టాటా, బిర్లా, అనిల్ అంబానీ గ్రూప్ వంటి 26 సంస్థలు వీటి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించేందుకు ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. వచ్చే ఏడాది జనవరి నాటికి లెసైన్సులు జారీ చేసే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. సేవలు మెరుగుపడేందుకు చర్యలు.. ఆధునిక ఎకానమీ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించేందుకు, బ్యాంకింగ్ సర్వీసులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చక్రవర్తి చెప్పారు. దీని కోసం అర్హతా ప్రమాణాలు ఉన్న ప్రైవేట్ సంస్థలకు అదనంగా మరిన్ని బ్యాంకింగ్ లెసైన్సులు ఇచ్చే అవకాశాలను ఆర్బీఐ పరిశీలిస్తోందని ఆయన వివరించారు. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ బ్యాంకులు కూడా ఇక్కడ పూర్తి అనుబంధ బ్యాంకు విధానాన్ని పాటించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సహిస్తోందని చెప్పారు. దేశీయంగా ప్రస్తుతం 44 పైగా విదేశీ బ్యాంకులు ఉండగా.. వాటిలో కనీసం 3 బ్యాంకులు వందేళ్ల పైగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చక్రవర్తి చెప్పారు. మన బ్యాంకింగ్ వ్యవస్థ బెస్ట్.. బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత స్థాయిలో పెట్టుబడులు ఉన్నాయని చక్రవర్తి పేర్కొన్నారు. లాభదాయకత, ఈక్విటీలపై రాబడులు సముచితంగా ఉన్నాయని, మొండిబకాయిలు అదుపులోనే ఉన్నాయన్నారు. అలాగే దేశీ బ్యాంకింగ్ వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో పనిచేస్తోందని వివరించారు. ఎకానమీ ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం, పెట్టుబడులు.. వృద్ధి మందగమనంతో పాటు అధిక కరెంటు ఖాతా లోటు వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని చక్రవర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ పెట్టుబడులు, టెక్నాలజీకి తోడుగా ఉండేలా విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహించడంపై దృష్టి సారించిందని చెప్పారు. సమర్ధతను బట్టి లెసైన్సులు సమర్థమంతమైనవిగా నిరూపించుకున్న కార్పొరేట్ సంస్థలకు కొత్త బ్యాంకు లెసైన్సులు ఇవ్వాలని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ సూచించింది. ఈ లక్ష్యాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఒంటరిగా సాధించడం సాధ్యం కాని నేపథ్యంలో మరిన్ని కొత్త ప్రైవేట్ బ్యాంకులకు అవకాశం కల్పించాలని పేర్కొంది.