ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్ | IDFC spells out cautious six-year plan for commercial bank | Sakshi
Sakshi News home page

ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్

Published Sat, Apr 5 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్

ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్

 ముంబై: కొత్త బ్యాంకు కార్యకలాపాల నిర్వహణ అనేది మారథాన్ లాంటిదని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సంస్థ ఐడీఎఫ్‌సీ చైర్మన్ రాజీవ్ లాల్ వ్యాఖ్యానించారు. తొలి మూడేళ్లూ నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిస్తామని, ఆ తర్వాతే వృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌తో పాటు కొత్తగా బ్యాంకు లెసైన్సు దక్కించుకున్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘ఇది స్ప్రింట్ (వేగంగా పరుగెత్తడం) కాదు.. మారథాన్ (ఎక్కువదూరం పరుగెత్తడం)లాంటిది. ఇవాళ మొదలెడితే కనీసం ఆరేళ్ల నుంచి తొమ్మిదేళ్ల దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది’ అని బ్యాంకింగ్ కార్యకలపాల గురించి లాల్ చెప్పారు.

 తొలి మూడేళ్లలో నిలదొక్కుకోవడం, ప్రయోగాలు చేయడం, నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహణ గురించి తెలుసుకోవడంతోనే సరిపోతుందని లాల్ తెలిపారు. ఫలితంగా తొలి మూడేళ్లు వ్యాపార వృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టడానికి అవకాశం లభించదన్నారు. అందుకే, తొలి మూడేళ్లు తమ రుణాల మంజూరు పద్దులు తక్కువగా ఉన్నా పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని లాల్ పేర్కొన్నారు. ఏదేమైనా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్), నిర్దేశిత ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్) లాంటి అంశాల వల్ల తమ వ్యాపార పరిమాణం ప్రస్తుత స్థాయికన్నా మరింత ఎక్కువగానే ఉంటుందని చెప్పారు.

 వ్యూహమిది..
 తొలి మూడేళ్లలో వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యమిస్తామని లాల్ చెప్పారు. మూడేళ్లు ముగిసిన తర్వాత అప్పటికే సాధించిన వృద్ధిని నిలబెట్టుకోవడం, మరింత వృద్ధిని సాధించడంపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఆరో సంవత్సరం తర్వాత నుంచి వేగవంతమైన వృద్ధి సాధన మొదలు కాగలదన్నారు. ప్రారంభంలో 24-36 నెలల పాటు బ్యాంకు లాభదాయకతపై ఒత్తిడి ఉంటుందని లాల్ తెలిపారు. అయితే, బ్యాంకు నిలదొక్కుకున్నాక, అవసరమైన శాఖలు, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ..ప్రక్రియలను ఏర్పాటు చేసుకున్న తర్వాత నుంచి లాభదాయకత మెల్లిగా మెరుగుపడుతుంటుందని చెప్పారు.

 రిక్రూట్‌మెంట్..
 కొత్త బ్యాంకులో మానవ వనరులకు సంబంధించి.. ఇప్పటికే ఇద్దరు-ముగ్గురు సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను తీసుకోవడం జరిగిందని లాల్ వివరించారు. మిగతా వారిని తీసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ప్రస్తుత, కొత్త బృందాలు కలిసి బ్యాంకును నిర్వహిస్తాయని ఆయన చెప్పారు. తాను, ఐడీఎఫ్‌సీ ఎండీ విక్రమ్ లిమాయే .. ఇటు బ్యాంకును, అటు మిగతా గ్రూప్‌ను పర్యవేక్షిస్తామన్నారు. బ్యాంకు సీఈవోని ఐడీఎఫ్‌సీ నుంచే ఎంపిక చేస్తామని, పేరు త్వరలో వెల్లడిస్తామని లాల్ పేర్కొన్నారు.

 ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ ఏర్పాటు..
 ప్రస్తుతం ఐడీఎఫ్‌సీకి నాలుగు కార్యాలయాలు ఉన్నాయని, వీటిలో ఒకదాన్ని హెడ్‌క్వార్టర్స్‌గా ఉంచుకుని మిగతా మూడింటిని బ్యాంకు శాఖల కింద మార్చాలని యోచిస్తున్నామని లాల్ వివరించారు. బ్యాంకింగ్ సంస్థగా రూపాంతరం చెందే ప్రక్రియను వివరిస్తూ.. ఇందుకోసం నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ)ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త బ్యాంకు సహా ప్రస్తుత ఉన్న మూడు అనుబంధ సంస్థలకి (ఐడీఎఫ్‌సీ ఆల్టర్నేటివ్, ఐడీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఐడీఎఫ్‌సీ ఏఎంసీ) ఇది హోల్డింగ్ సంస్థగా ఉంటుందని లాల్ తెలిపారు. ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీకి బ్యాంకు నాలుగో అనుబంధ సంస్థగా ఉంటుందని, దీన్ని తొలి రోజునే లిస్టింగ్ చేస్తామని చెప్పారు. ఇన్‌ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ నుంచి బ్యాంకుగా రూపాంతరం చెందే క్రమంలో ప్రస్తుతమున్న ఐడీఎఫ్‌సీ షేర్‌హోల్డర్లకు కొంత మేర లిస్టెడ్ బ్యాంకులో నేరుగా వాటాలు ఇవ్వడం జరుగుతుందని లాల్ పేర్కొన్నారు.

 ఐడీఎఫ్‌సీలో 52-53 శాతం దాకా విదేశీ ప్రమోటర్ల వాటాలు ఉండగా.. వీటిని నిబంధనలకు అనుగుణంగా క్రమంగా 50 శాతం దిగువకు తెస్తామని లాల్ చెప్పారు. ఇందుకోసం ప్రిఫరెన్షియల్  షేర్ల అలాట్‌మెంట్ విధానాన్ని పాటిస్తామన్నారు. అటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ) లెసైన్సు కోసం కూడా ఐడీఎఫ్‌సీ దరఖాస్తు చేసిందని, వచ్చే రెండు-మూడు నెలల్లో దీన్ని దక్కించుకోగలదని లాల్ తెలిపారు. లెసైన్సు వచ్చాకా హౌసింగ్ లోన్స్ మంజూరు చేయడం ప్రారంభిస్తామని, ఆ తర్వాత వాటిని క్రమంగా బ్యాంకునకు బదలాయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement