కొత్త బ్యాంకులకు ఫ్రీ ఎంట్రీ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థను మరింత మందికి చేరువ చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త బ్యాంకులకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉంది. ఇక అవసరమైన సమయంలో, తరచుగా లెసైన్సులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి సోమవారం తెలిపారు. దీనిపై సంబంధిత వర్గాలు తమ తమ అభిప్రాయాలు తెలిపాకా.. సమగ్రమైన మార్గదర్శ ప్రణాళిక రూపొందించే యోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు. అత్యుత్తమ ప్రమాణాలు, పారదర్శకతతో కొత్త బ్యాంకుల లెసైన్సులను జారీ చేసే ప్రక్రియలో ఆర్‌బీఐ నిమగ్నమైందని చక్రవర్తి పేర్కొన్నారు.
ఇప్పటికే దేశీయ బ్యాంకింగ్ రంగంపై ఆర్‌బీఐ చర్చాపత్రాన్ని విడుదల చేసిందని, సంబంధిత వర్గాల అభిప్రాయాలను ఆహ్వానించిందని ఆయన వివరించారు. చిన్న బ్యాంకులు, హోల్‌సేల్ బ్యాంకులు వంటి వాటికి వేర్వేరు విభాగాల కింద లెసైన్సులు ఇవ్వడం, భారీ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా మార్చడం తదితర అవకాశాలను ఇందులో ప్రస్తావించినట్లు చక్రవర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్‌బీఐ కొత్త బ్యాంకింగ్ లెసైన్సులను జారీ చేసే ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. టాటా, బిర్లా, అనిల్ అంబానీ గ్రూప్ వంటి 26 సంస్థలు వీటి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించేందుకు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. వచ్చే ఏడాది జనవరి నాటికి లెసైన్సులు జారీ చేసే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.
సేవలు మెరుగుపడేందుకు చర్యలు..
ఆధునిక ఎకానమీ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించేందుకు, బ్యాంకింగ్ సర్వీసులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చక్రవర్తి చెప్పారు. దీని కోసం అర్హతా ప్రమాణాలు ఉన్న ప్రైవేట్ సంస్థలకు అదనంగా మరిన్ని బ్యాంకింగ్ లెసైన్సులు ఇచ్చే అవకాశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోందని ఆయన వివరించారు. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ బ్యాంకులు కూడా ఇక్కడ పూర్తి అనుబంధ బ్యాంకు విధానాన్ని పాటించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సహిస్తోందని చెప్పారు. దేశీయంగా ప్రస్తుతం 44 పైగా విదేశీ బ్యాంకులు ఉండగా.. వాటిలో కనీసం 3 బ్యాంకులు వందేళ్ల పైగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చక్రవర్తి చెప్పారు.
మన బ్యాంకింగ్ వ్యవస్థ బెస్ట్..
బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత స్థాయిలో పెట్టుబడులు ఉన్నాయని చక్రవర్తి పేర్కొన్నారు. లాభదాయకత, ఈక్విటీలపై రాబడులు సముచితంగా ఉన్నాయని, మొండిబకాయిలు అదుపులోనే ఉన్నాయన్నారు. అలాగే దేశీ బ్యాంకింగ్ వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో పనిచేస్తోందని వివరించారు. ఎకానమీ ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం, పెట్టుబడులు.. వృద్ధి మందగమనంతో పాటు అధిక కరెంటు ఖాతా లోటు వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని చక్రవర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ పెట్టుబడులు, టెక్నాలజీకి తోడుగా ఉండేలా విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహించడంపై దృష్టి సారించిందని చెప్పారు.
సమర్ధతను బట్టి లెసైన్సులు
సమర్థమంతమైనవిగా నిరూపించుకున్న కార్పొరేట్ సంస్థలకు కొత్త బ్యాంకు లెసైన్సులు ఇవ్వాలని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ సూచించింది. ఈ లక్ష్యాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఒంటరిగా సాధించడం సాధ్యం కాని నేపథ్యంలో మరిన్ని కొత్త ప్రైవేట్ బ్యాంకులకు అవకాశం కల్పించాలని పేర్కొంది.