KC Chakrabarty
-
మావద్ద మంత్రదండం లేదు
ముంబై: మొండిబకాయిల (ఎన్పీఏ) సంక్షోభంలో చిక్కుకున్న యునెటైడ్ బ్యాంక్ (యూబీ)కు సహాయం చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏదీ లేదని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి గురువారం పేర్కొన్నారు. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ బ్యాంక్ ఉద్యోగులు కష్టపడి పనిచేసి, ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాల్సి ఉంటుందని అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చక్రవర్తి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ స్థూల మొండిబకాయిలు 11 శాతం పైబడి ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. అసెట్ నాణ్యత పెంపు, నిర్వాహణా వ్యయాల తగ్గింపు, వ్యాపారాభివృద్ధి తత్సబంధ అంశాలపై యునెటైడ్ బ్యాంక్ సిబ్బంది దృష్టి సారించాలని ఆయన సూచించారు. పుత్తడి దిగుమతులకు మరిన్ని బ్యాంకులను అనుమతించడాన్ని చక్రవర్తి సమర్థించుకున్నారు. ఈ నిర్ణయం దేశీయంగా సరఫరాలు మెరుగుపడి ధరలు తగ్గడానికి దోహదపడుతుందన్నారు. పదవికి ముందస్తు రాజీనామా.. కేసీ చక్రవర్తి తన డిప్యూటీ గవర్నర్ పదవికి రాజీ నామా చేశారు. పదవీ విరమణకు 3 నెలల ముందుగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 62 సంవత్సరాల చక్రవర్తి 2009 జూన్ 15న మూడేళ్ల కాలానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. తదుపరి ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండేళ్లు పొడిగించింది. దీని ప్రకారం ఆయన 2014 జూన్ 15న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ముందస్తు రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని సమాచారం. ఏప్రిల్ 25 వరకూ బాధ్యతల్లో..: ఏప్రిల్ 25కల్లా తనను బాధ్యతల నుంచి తప్పించాలని చక్రవర్తి కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎండీగా పనిచేశారు. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ ఉంచాల్సిన పరిమాణం) ముఖ్య పాత్ర పోషిస్తుందని, దీన్ని కొనసాగించాల్సిందేనని గట్టిగా భావించే వ్యక్తుల్లో చక్రవర్తి ఒకరు. ఈ విషయంలో ఆయన ఎస్బీఐ గత చైర్మన్ ప్రతిప్ చౌదరితో విభేదించారు కూడా. -
ఏటీఎం చార్జీలు బ్యాంకుల ఇష్టం: ఆర్బీఐ
ముంబై: ఏటీఎం సర్వీసులకు సమంజసమైన చార్జీలను వసూలు చేసుకోవడానికి ఆర్బీఐ, బ్యాంకులకు అనుమతిచ్చింది. ఏటీఎంల నిర్వహణ భారం కాకుండా ఉండడం కోసం ఖాతాదారుల ఏటీఎం లావాదేవీలపై బ్యాంకులు సముచితమైన చార్జీలు విధించుకోవచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కె.సి. చక్రవర్తి గురువారం చెప్పారు. ఏటీఎంల సేవలకు సమంజసమైన చార్జీలు విధిస్తే, ఆర్బీఐ ఎలాంటి అభ్యంతరం చెప్పదని పేర్కొన్నారు. ఆర్బీఐలో బ్యాంకింగ్ వ్యవహారాలను చక్రవర్తి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ చార్జీల విషయమై బ్యాంకుల నుంచి ఎలాంటి వినతులు ఇప్పటిదాకా రాలేదన్నారు. బ్యాంకింగ్ రంగంలో పోటీ తీవ్రంగా ఉన్నందున చార్జీల విధింపు మార్కెట్ శక్తుల నిర్ణయమేనని, అయితే చార్జీల విషయమై బ్యాంక్‌లకు స్వేచ్ఛ ఉంటుందని వివరించారు. ఇతర బ్యాంక్‌ల ఏటీఎంలను ఉపయోగించుకున్నందుకు గాను ఒక్కో బ్యాంక్ ఆ బ్యాంక్‌కు రూ.15 చార్జీ చెల్లిస్తోందని, అయితే ఖాతాదారులకు కొన్ని బ్యాంకులు ఈ సర్వీసును ఉచితంగానే ఇస్తున్నాయని తెలిపారు. ఈ విషయమై బ్యాంకులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని, త్వరలోనే ఒక నిర్ణయం వెలువడుతుందని అంచనా. -
కొత్త బ్యాంకులకు ఫ్రీ ఎంట్రీ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థను మరింత మందికి చేరువ చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త బ్యాంకులకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉంది. ఇక అవసరమైన సమయంలో, తరచుగా లెసైన్సులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి సోమవారం తెలిపారు. దీనిపై సంబంధిత వర్గాలు తమ తమ అభిప్రాయాలు తెలిపాకా.. సమగ్రమైన మార్గదర్శ ప్రణాళిక రూపొందించే యోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు. అత్యుత్తమ ప్రమాణాలు, పారదర్శకతతో కొత్త బ్యాంకుల లెసైన్సులను జారీ చేసే ప్రక్రియలో ఆర్బీఐ నిమగ్నమైందని చక్రవర్తి పేర్కొన్నారు. ఇప్పటికే దేశీయ బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ చర్చాపత్రాన్ని విడుదల చేసిందని, సంబంధిత వర్గాల అభిప్రాయాలను ఆహ్వానించిందని ఆయన వివరించారు. చిన్న బ్యాంకులు, హోల్‌సేల్ బ్యాంకులు వంటి వాటికి వేర్వేరు విభాగాల కింద లెసైన్సులు ఇవ్వడం, భారీ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా మార్చడం తదితర అవకాశాలను ఇందులో ప్రస్తావించినట్లు చక్రవర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ లెసైన్సులను జారీ చేసే ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. టాటా, బిర్లా, అనిల్ అంబానీ గ్రూప్ వంటి 26 సంస్థలు వీటి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించేందుకు ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. వచ్చే ఏడాది జనవరి నాటికి లెసైన్సులు జారీ చేసే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. సేవలు మెరుగుపడేందుకు చర్యలు.. ఆధునిక ఎకానమీ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించేందుకు, బ్యాంకింగ్ సర్వీసులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చక్రవర్తి చెప్పారు. దీని కోసం అర్హతా ప్రమాణాలు ఉన్న ప్రైవేట్ సంస్థలకు అదనంగా మరిన్ని బ్యాంకింగ్ లెసైన్సులు ఇచ్చే అవకాశాలను ఆర్బీఐ పరిశీలిస్తోందని ఆయన వివరించారు. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ బ్యాంకులు కూడా ఇక్కడ పూర్తి అనుబంధ బ్యాంకు విధానాన్ని పాటించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సహిస్తోందని చెప్పారు. దేశీయంగా ప్రస్తుతం 44 పైగా విదేశీ బ్యాంకులు ఉండగా.. వాటిలో కనీసం 3 బ్యాంకులు వందేళ్ల పైగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చక్రవర్తి చెప్పారు. మన బ్యాంకింగ్ వ్యవస్థ బెస్ట్.. బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత స్థాయిలో పెట్టుబడులు ఉన్నాయని చక్రవర్తి పేర్కొన్నారు. లాభదాయకత, ఈక్విటీలపై రాబడులు సముచితంగా ఉన్నాయని, మొండిబకాయిలు అదుపులోనే ఉన్నాయన్నారు. అలాగే దేశీ బ్యాంకింగ్ వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో పనిచేస్తోందని వివరించారు. ఎకానమీ ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం, పెట్టుబడులు.. వృద్ధి మందగమనంతో పాటు అధిక కరెంటు ఖాతా లోటు వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని చక్రవర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ పెట్టుబడులు, టెక్నాలజీకి తోడుగా ఉండేలా విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహించడంపై దృష్టి సారించిందని చెప్పారు. సమర్ధతను బట్టి లెసైన్సులు సమర్థమంతమైనవిగా నిరూపించుకున్న కార్పొరేట్ సంస్థలకు కొత్త బ్యాంకు లెసైన్సులు ఇవ్వాలని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ సూచించింది. ఈ లక్ష్యాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఒంటరిగా సాధించడం సాధ్యం కాని నేపథ్యంలో మరిన్ని కొత్త ప్రైవేట్ బ్యాంకులకు అవకాశం కల్పించాలని పేర్కొంది.