ముంబై: ఏటీఎం సర్వీసులకు సమంజసమైన చార్జీలను వసూలు చేసుకోవడానికి ఆర్‌బీఐ, బ్యాంకులకు అనుమతిచ్చింది. ఏటీఎంల నిర్వహణ భారం కాకుండా ఉండడం కోసం ఖాతాదారుల ఏటీఎం లావాదేవీలపై బ్యాంకులు సముచితమైన చార్జీలు విధించుకోవచ్చని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కె.సి. చక్రవర్తి గురువారం చెప్పారు. ఏటీఎంల సేవలకు సమంజసమైన చార్జీలు విధిస్తే, ఆర్‌బీఐ ఎలాంటి అభ్యంతరం చెప్పదని పేర్కొన్నారు. ఆర్‌బీఐలో బ్యాంకింగ్ వ్యవహారాలను చక్రవర్తి పర్యవేక్షిస్తున్నారు.
అయితే ఈ చార్జీల విషయమై బ్యాంకుల నుంచి ఎలాంటి వినతులు ఇప్పటిదాకా రాలేదన్నారు. బ్యాంకింగ్ రంగంలో పోటీ తీవ్రంగా ఉన్నందున చార్జీల విధింపు మార్కెట్ శక్తుల నిర్ణయమేనని, అయితే చార్జీల విషయమై బ్యాంక్‌లకు స్వేచ్ఛ ఉంటుందని వివరించారు. ఇతర బ్యాంక్‌ల ఏటీఎంలను ఉపయోగించుకున్నందుకు గాను ఒక్కో బ్యాంక్ ఆ బ్యాంక్‌కు రూ.15 చార్జీ చెల్లిస్తోందని, అయితే ఖాతాదారులకు కొన్ని బ్యాంకులు ఈ సర్వీసును ఉచితంగానే ఇస్తున్నాయని తెలిపారు. ఈ విషయమై బ్యాంకులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని, త్వరలోనే ఒక నిర్ణయం వెలువడుతుందని అంచనా.