ఆర్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్(ఏటిఎం) లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో బ్యాంక్ ఖాతాదారులపై మరీ ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు నిర్వహించే వారిపై మరింత భారం పడనుంది. ఇంటర్‌ఛేంజ్ చార్జీల వల్ల ఇక నుంచి బ్యాంకులు ఆర్ధిక లావాదేవిలపై రూ.17 వరకు రుసుమును వసూలు చేయవచ్చు. ఈ ఫీజు ఇప్పటి వరకు రూ.15గా ఉండేది. అలాగే ఆర్ధికేతర లావాదేవీలపై ఈ చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచింది.
ఒకవేల ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు ఏటీఎం లావాదేవీలు నిర్వహిస్తే అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో లావాదేవిపై రూ.21 వరకు వసూలు చేయొచ్చు. ఈ రుసుము ప్రస్తుతం రూ.20గా ఉంది. ఆర్ధిక లావాదేవిలపై విధించే ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. అదే ఆర్ధికేతర లావాదేవీలపై ఫీజు పెంపు నిర్ణయం ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటే? మీరు వేరే బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకున్నప్పడు మీ బ్యాంక్ ఏటీఎం బ్యాంక్‌కు డబ్బులు చెల్లించాలి. దాన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని అంటారు.
ఏటిఎం ఛార్జీల మొత్తం స్వరూపాన్ని సమీక్షించడానికి ఆర్‌బీఐ జూన్ 2019లో అప్పటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజి కన్నన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫారసులను జూలై 2020లో వెల్లడించింది. ఏటిఎం ఛార్జీలను లెక్కించడానికి జనాభాను మెట్రిక్‌గా ఉపయోగించాలని కమిటీ సిఫారసు చేసింది. ఉదాహరణకు, 1 మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న అన్ని కేంద్రాల్లోని ఏటిఎంలలో ఉచిత లావాదేవీలను నెలకు ప్రస్తుతం ఉన్న 5 నుంచి 6కు పెంచాలని సూచించింది.
అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న కేంద్రాలలో ఉచిత లావాదేవీల పరిమితిని 3 వద్ద ఉంచాలని సిఫారసు చేసింది. ఒక మిలియన్ అంతకు మించి జనాభా ఉన్న అన్ని కేంద్రాల్లోని ఆర్థిక లావాదేవీల ఫీజు రూ.17, ఆర్థికేతర లావాదేవీల ఫీజును రూ.7కు పెంచాలని కమిటీ సూచించింది. ఏటిఎం లావాదేవీల కోసం ఇంటర్‌చేంజ్ ఫీజు నిర్మాణంలో చివరిగా ఆగస్టు 2012లో మార్పు జరిగిందని, కస్టమర్లు చెల్లించాల్సిన ఛార్జీలు చివరిగా ఆగస్టు 2014లో సవరించినట్లు ఆర్‌బీఐ గురువారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment