మావద్ద మంత్రదండం లేదు
ముంబై: మొండిబకాయిల (ఎన్‌పీఏ) సంక్షోభంలో చిక్కుకున్న యునెటైడ్ బ్యాంక్ (యూబీ)కు సహాయం చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏదీ లేదని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి గురువారం పేర్కొన్నారు. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ బ్యాంక్ ఉద్యోగులు కష్టపడి పనిచేసి, ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాల్సి ఉంటుందని అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చక్రవర్తి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ స్థూల మొండిబకాయిలు 11 శాతం పైబడి ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. అసెట్ నాణ్యత పెంపు, నిర్వాహణా వ్యయాల తగ్గింపు, వ్యాపారాభివృద్ధి తత్సబంధ అంశాలపై యునెటైడ్ బ్యాంక్ సిబ్బంది దృష్టి సారించాలని ఆయన సూచించారు.
పుత్తడి దిగుమతులకు మరిన్ని బ్యాంకులను అనుమతించడాన్ని చక్రవర్తి సమర్థించుకున్నారు. ఈ నిర్ణయం దేశీయంగా సరఫరాలు మెరుగుపడి ధరలు తగ్గడానికి దోహదపడుతుందన్నారు.
పదవికి ముందస్తు రాజీనామా..
కేసీ చక్రవర్తి తన డిప్యూటీ గవర్నర్ పదవికి రాజీ నామా చేశారు. పదవీ విరమణకు 3 నెలల ముందుగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 62 సంవత్సరాల చక్రవర్తి 2009 జూన్ 15న మూడేళ్ల కాలానికి ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. తదుపరి ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండేళ్లు పొడిగించింది. దీని ప్రకారం ఆయన 2014 జూన్ 15న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ముందస్తు రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని సమాచారం.
ఏప్రిల్ 25 వరకూ బాధ్యతల్లో..: ఏప్రిల్ 25కల్లా తనను బాధ్యతల నుంచి తప్పించాలని చక్రవర్తి కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎండీగా పనిచేశారు. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ ఉంచాల్సిన పరిమాణం) ముఖ్య పాత్ర పోషిస్తుందని, దీన్ని కొనసాగించాల్సిందేనని గట్టిగా భావించే వ్యక్తుల్లో చక్రవర్తి ఒకరు. ఈ విషయంలో ఆయన ఎస్‌బీఐ గత చైర్మన్ ప్రతిప్ చౌదరితో విభేదించారు కూడా.