
ఎక్కడ రేట్లు అక్కడే!
ఆర్థిక నిపుణులు ఊహించినట్లుగానే... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన కీలక రేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు.
♦ వర్షాలు పడి ధరలు తగ్గితే మేమూ తగ్గిస్తాం
♦ కీలక రేట్లపై ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్య
♦ ప్రస్తుత నిర్ణయానికి ద్రవ్యోల్బణం ఒత్తిళ్లే కారణమని వెల్లడి
♦ 2016-17లో వృద్ధి రేటు 7.6% ఉండొచ్చని అంచనా...
ముంబై: ఆర్థిక నిపుణులు ఊహించినట్లుగానే... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన కీలక రేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంగా రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు మంగళవారంనాటి ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నరు రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. ‘‘కఠినమైన, తటస్థ ద్రవ్య విధానం అనుసరించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. సరళతర విధానానికే అవకాశం ఉంది. తగిన వర్షపాతం నమోదై... ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండే పరిస్థితులు గనక ఏర్పడితే... ఈ ఆర్థిక సంవత్సరంలోనే రేట్ల కోతకు అవకాశం ఉంది’’ అని రాజన్ వివరించారు.
యథాతథ రేట్లు...
తాజా నిర్ణయంతో... బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో... యథాతథంగా 6.5 శాతంగా కొనసాగుతుంది. బ్యాంకులు తన వద్ద ఉంచే అదనపు నిధులకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ (రివర్స్ రెపో) రేటు 6 శాతంగా ఉంటుంది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగుతుంది. 2013న ఆర్‌బీఐ గవర్నర్‌గా మూడేళ్ల బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్‌మార్క్ రేటు- రెపోను 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటు తర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది.
కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
♦ ఈ ఏడాది(2016-17) వృద్ధి రేటు అంచనా 7.6 శాతం.
♦ 2017 జనవరికి ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం. అయితే పెరుగుదల వైపే మొగ్గు ఉంది.
♦ ఏప్రిల్ నుంచీ బ్యాంకులు అనుసరిస్తున్న మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (నిధుల సమీకరణ భారం ఆధారిత రుణ రేటు) విధానంపై త్వరలో సమీక్ష.
♦ క్రూడ్ ధరల పెరుగుదల, 7వ వేతన సంఘం సిఫారసుల అమలు ప్రభావాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది.
♦ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే తగ్గించిన రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలి. వృద్ధి పునరుత్తేజానికి ఇది దోహదపడుతుంది.
♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాల్లో వృద్ధిఅవసరం. ప్రభుత్వం తగినంత మూలధనం ఇస్తే రుణ వృద్ధి సాధ్యమవుతుంది.
♦ ప్రభుత్వ పెట్టుబడులు పటిష్టమవుతున్నాయి. అయితే ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఇంకా బలహీనంగా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పుడు తగ్గించే పరిస్థితి లేదు...
రేట్ల కోతపై రాజన్ వ్యాఖ్యానిస్తూ... ‘‘ప్రస్తుతానికి పలు కారణాలు రేటు కోతకు అనుకూలంగా లేవు. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (5.39 శాతం) ఊహించినదానికన్నా అధికంగా ఉంది. రుతు పవనాల పరిస్థితి ఎలా ఉంటుంది? నిత్యావసరాలపై ప్రభావం ఏమిటి? అనేది చూడాలి. అలాగే ప్రభుత్వ సరఫరాల పరిస్థితినీ గమనించాలి. ఇలాంటి పలు అంశాలు రేటుకోతకు ప్రస్తుతం అనుమతించడం లేదు. మా విధానాలు సరళమా? కఠినమా? అని చెప్పటానికి పావురం-డేగల తో పోల్చటం నాకిష్టం లేదు. నిర్ణయాలేవైనా వాస్తవ గణాంకాల ప్రాతిపదికనే ఉంటాయి. మొండి బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం- ఆర్‌బీఐ కలసి పనిచేస్తున్నాయి. మొండిబకాయిల్ని పరిష్కరించటం, ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగం కల్పించటం మా ఎజెండాలో కీలకం’’ అని వివరించారు.
బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై అభ్యంతరాలు...
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనను రాజన్ వ్యతిరేకించారు. ఎన్‌పీఏల కోసం ఒక బ్యాడ్ బ్యాంక్ లేదా అసెట్ రీకన్‌స్ట్రక్షన్ ఫండ్ ఏర్పాటుపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఎన్‌పీఏల కోసం ఏర్పాటు చేసే ఏ ఫండ్స్‌లోనైనా రుణదాతల వాటా తక్కువ ఉండాలి. బ్యాంకులకు మెజారిటీ యాజమాన్యం ఇవ్వటమూ సరికాదు. బ్యాంకులు లేదా ప్రభుత్వం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీల్ని ఏర్పాటు చేయటం నైతికంగా సరికాదు. దీనివల్ల బ్యాంకులు రుణ మంజూరులో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించే వీలుంది. ప్రభుత్వంతోపాటు ఇతరత్రా సంస్థలకు మైనారిటీ వాటా ఇస్తే బాగుంటుంది’’ అని రాజన్ చెప్పారు.
సరళ విధానం హర్షణీయం పాలసీపై బ్యాంకర్ల స్పందన
సరళతర విధానమే కొనసాగుతుందన్న ఆర్‌బీఐ ప్రకటన పట్ల బ్యాంకులు హర్షం వ్యక్తం చేశాయి. తగిన వర్షపాతం రేట్ల తగ్గుదలకు దారి తీస్తుందని పేర్కొన్నాయి. ప్రస్తుత నిర్ణయం ఊహించిందేనని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. విధాన నిర్ణయాలు సమతౌల్యంగా, ముందుచూపుతో ఉన్నట్లు విశ్లేషించారు. సరళతర విధానం, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితులు తగిన విధంగా ఉండే దిశలో ఆర్‌బీఐ నిర్ణయాలు ఉన్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందాకొచర్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ ఆచితూచి నిర్ణయం తీసుకుందని, ఆగస్టులో అరశాతం కోత ఉంటుందని భావిస్తున్నామని యస్ బ్యాంక్ చైర్మన్ రాణాకపూర్ అభిప్రాయపడ్డారు. విధాన నిర్ణయాలు ఊహించిన విధంగానే ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ అబీక్ బారువా పేర్కొన్నారు.
రేటు కోత తప్పదు: పరిశ్రమలు
రాజన్ నిర్ణయం తమకు నిరాశ కలిగించిందని, రెపో రేటు తగ్గించి ఉంటే పెట్టుబడుల ప్రక్రియ ఊపందుకోడానికి దోహదపడేదని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ, తదుపరి పాలసీ విధాన సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫిక్కీ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రెపో రేటును యథాతథ స్థితిలో కొనసాగించడం ద్వారా ఆర్‌బీఐ పరిశ్రమకు ఎటువంటి ఆశ్చర్యం కలిగించ లేదని అసోచామ్ ప్రెసిడెంట్ సునిల్ కనోరియా అన్నారు.
ఇకపై పాలసీ నిర్ణయం కమిటీదా?
ప్రస్తుతం రెపో రేటుపై ఆర్థిక నిపుణులతో కూడిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒకటి సలహా ఇస్తున్నప్పటికీ... ఆర్‌బీఐ గవర్నర్ ఈ సలహాలను వీటో చేసే అధికారం ఉంది. అయితే రెపో నిర్ణయానికి సంబంధించి తనకు తానుగా నిర్ణయం తీసుకుని ప్రకటించడం ఆర్‌బీఐ గవర్నర్‌కు ఇదే బహుశా చివరిసారి అవుతుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చట్టప్రకారం ఏర్పాటవుతున్న కమిటీ... వచ్చే సమీక్షలో ఏకాభిప్రాయం ప్రాతిపదికన రేటు నిర్ణయాన్ని వెలువరించవచ్చునని సమాచారం.
మీడియా సరదాను పాడుచేయను..!
సెప్టెంబర్ 4 తరవాత తన కొనసాగింపుపై వివరణ ఇస్తే మీడియా తమాషాను పాడుచేసి, కఠినంగా వ్యవహరించినట్లే అవుతుందని రాజన్ చమత్కరించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం-అధికారంలో ఉన్న వ్యక్తి మధ్య చర్చల అనంతరం ఒక నిర్ణయం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తు తం ఈ విషయంపై వస్తున్న వ్యాఖ్యలన్నీ ఊహాగానాలేనన్న రాజన్... ‘వార్త వచ్చినప్పుడు మీకు(మీడియా) తెలుస్తుంది కదా’ అన్నారు. ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి ప్రకటనలకన్నా... అధికంగా తాను ఏమీ చెప్పలేనని రాజన్ పేర్కొన్నారు.