రాజన్ ‘సెకండ్ ఇన్నింగ్స్’కు నెటిజన్ల మద్దతు
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండోసారి రఘురామ్ రాజన్‌కు అవకాశం ఇవ్వడంపై ఒకపక్క రాజకీయంగా దుమారం చెలరేగుతుండగా... ఆయనకు నెటిజన్ల నుంచి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఆన్‌లైన్ పిటిషన్ ప్లాట్‌ఫామ్ ఛేంజ్.ఆర్గ్ ద్వారా ఇప్పటివరకూ రాజన్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి 60 వేల మంది విజ్ఞప్తి చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఈ వెబ్‌సైట్ ద్వారా కనీసం ఏడు పిటిషన్లు ప్రారంభం కాగా, వీటిపై 60 వేల మంది సంతకాలు చేయడం గమనార్హం.
దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్ తూట్లు పొడిచారని, ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. అయితే, ప్రధాని మాత్రం ఆర్‌బీఐ గవర్నర్ పోస్టుకు సంబంధించి చర్చ అనవరమని, సెప్టెంబర్‌లోనే(రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 3తో ముగియనుంది) దీనిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేయడం గమనార్హం. రాజన్‌కు మరో చాన్స్ ఇచ్చేందుకుకే మోదీ సుముఖంగానే ఉన్నారంటూ ఊహాగానాలు ఇటీవల జోరందుకున్నాయి. అటు పారిశ్రామిక వర్గాల నుంచి కూడా రాజన్ రెండో విడత పగ్గాలకు మద్దతు లభిస్తుండటం దీనికి బలం చేకూరుస్తోంది.