ఆర్బీఐ చీఫ్కు మూడేళ్లు చాలదు
♦ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయం
♦ కనీసం నాలుగేళ్లు ఉండాలని సూచన
♦ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంటు కమిటీకి వివరణ
♦ ఆర్థికమంత్రి జైట్లీతోనూ భేటీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ పదవీకాలం ప్రస్తుతం ఉన్నట్టుగా మూడేళ్లు సరిపోదని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా పలు దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని భారత్ కూడా అనుసరించాలనీ సూచించారు. మరో 9 వారాల్లో (సెప్టెంబర్ 4న) తన పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రాజన్ ఈ కీలక అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. భారత్ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, బ్యాంకింగ్‌లో మొండిబకాయిల తీవ్రత వంటి అంశాలపై గురువారం ఆయన పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయి సంఘం ముందు వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులడిగిన ప్రశ్నకు రాజన్ సమాధానమిస్తూ... ఆర్‌బీఐ గవర్నర్ పదవీకాలం మూడేళ్లు స్వల్ప వ్యవధి అని అభిప్రాయపడ్డట్లు అత్యున్నత స్థాయి వర్గాలు చెప్పాయి. కనీసం నాలుగేళ్లు ఈ పదవీకాలం ఉండాలని సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకున్న నాలుగేళ్ల పదవీకాలం విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. సెప్టెంబర్ 4న రిటైరవుతున్న రాజన్, ‘ చేయాల్సింది మరెంతో ఉంది’ అంటూ ఈ పదవిలో రెండవ విడత కొనసాగడానికి తొలుత ఉత్సుకత చూపించారు. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి విమర్శల నేపథ్యంలో తాను రేసులో లేనని ఇటీవలే ప్రకటించారు. తాజా సమావేశానికి సంబంధించిన మరిన్ని అంశాలను చూస్తే...
⇔ మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.వీరప్ప మొయిలీ నేతృత్వంలోని కమిటీ పాల్గొంది. ఆర్థిక వ్యవస్థ, సంస్కరణలు, ఆర్‌బీఐ పునర్‌వ్యవస్థీకరణ, బ్యాంకింగ్ రంగంలో సవాళ్లు, పరిష్కారం వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి.
⇔ ఎన్‌పీఏల పరిష్కారానికి తీసుకుంటున్న పలు చర్యలను రాజన్ వివ రించారు. మార్చి 2016 నాటికి 7.6 శాతంగా ఉన్న ఎన్‌పీఏలు 2017 మార్చి నాటికి 9.3 శాతానికి చేరతాయని ఆర్‌బీఐ ఇప్పటికే పేర్కొంది.
⇔ బ్యాంకింగ్ రుణ వృద్ధి తీరు ప్రస్తావనకు వచ్చింది. రుణాల మంజూరీలో ప్రభుత్వ రంగం బ్యాంకుల కన్నా... ప్రైవేటు రంగంలో బ్యాంక్‌లు క్రియాశీలకంగా ఉన్నాయి. నిధుల కొరత లేకున్నా, ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణ మంజూరీలో వెనకడుగు వేస్తున్నాయని రాజన్ వివరించారు.
⇔ బ్రెగ్జిట్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, భారత్‌పై ప్రభావం వంటి అంశాలు చర్చల్లో చోటుచేసుకున్నాయి.
రెగ్జిట్ ప్రభావం ఉండదు: సీఐఐ
ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ పదవీ విరమణ (రెగ్జిట్) ప్రభావం ఆర్థిక వ్యవస్థపై, ఇన్వెస్టర్ సెంటిమెంట్‌పై ప్రతికూలత ఏదీ చూపబోదని పారిశ్రామిక సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ పేర్కొన్నారు. రాజన్ వారసుడిగా మరొక సమర్థమైన వ్యక్తి పేరును కేంద్రం త్వరలో ప్రకటిస్తుందని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తద్వారా ఈ విషయంలో అనిశ్చితి, సందేహాలు తొలగిపోవాలన్నది తమ ఉద్దేశమని పేర్కొన్నారు. వృద్ధికి సంబంధించి భారత్ పటిష్ట స్థానంలో ఉందని, భారత్ వంటి అతిపెద్ద, సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థపై ఒక వ్యక్తి ప్రభావం ఉండబోదని వివరించారు.
ఎంపీసీపై జైట్లీతో చర్చలు!
పార్లమెంటరీ కమిటీతో సమావేశానికి ముందు రాజన్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో కూడా సమావేశమయ్యారు. రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) విస్తృత మెజారిటీ అభిప్రాయ ప్రాతిపదికన నిర్ణయించడంపై ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏర్పాటుకు సంబంధించి జైట్లీతో రాజన్ చర్చించినట్లు తెలియవచ్చింది. ఈ యంత్రాంగాన్ని వీలయినంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సమావేశం అనంతరం రాజన్ విలేకరులతో ఈ అంశంపైనే మాట్లాడుతూ, ఎంపీసీ ఏర్పాటుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తదుపరి పాలసీ సమీక్ష ఆగస్టు 9 నాటికి ఈ కమిటీ ఏర్పడుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘‘ తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఆ పని ఎంతవరకూ జరుగుతుందో వేచి చూద్దాం’ అని అన్నారు. ప్రస్తుతం రెపో రేటుపై టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సిఫారసులు చేస్తున్నా... వీటిని తోసిపుచ్చి, ఆర్‌బీఐ గవర్నర్ దీనిపై నిర్ణయం తీసుకునే వీలుంది. కాకపోతే తాజా ప్రతిపాదనల ప్రకారం ఆరుగురు సభ్యులు ప్రతిపాదిత ఎంపీసీలో ఉంటారు. మెజారిటీ ప్రాతిపదికన రెపో రేటు నిర్ణయం ఉంటుంది. ఒకవేళ సంఖ్య సమానమైతే... ఆర్‌బీఐ గవర్నర్ ఓటుతో నిర్ణయం ఖరారవుతుంది.