ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ విరమణకు కేవలం రెండు రోజుల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగాలని అనుకున్నానని కానీ, అది సాధ్యపడలేదని జాతీయ మీడియాతో తెలిపారు. కొన్ని అంసపూర్ణ చర్యల నేపథ్యంలో తాను రెండవసారి గవర్నర్ గా కొనసాగాలని భావించానని తెలిపారు. కానీ అది నెరవేరలేదని తెలిపారు. దీనిపై మరింత వివరించడానికి నిరాకరించిన రాజన్ తన వివాదాస్పద ప్రసంగాలను సమర్థించుకున్నారు. ఐఐటీ ఢిలీలో సహనం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఆలోచనలతో కూడిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి ఆయన వివరణ ఇచ్చారు.
కొంతకాలం పాటు పబ్లిక్ స్పీక్ కు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు. తాను నిజానికి దేశంలోని కొన్ని అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలనుకుంటున్నానీ, దీనికోసం దేశం చుట్టి రావాలనుకుంటున్నానని చెప్పారు. ఊర్జిత్ కు తాను సలహాలు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు. అతనిమీద తనకు విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుత అన్ని విషయాలపై ఆయనకు వివరించాననీ, ఆయన ధోరణి ఆయకుందని రాజన్ చెప్పారు.
ఇపుడిక మళ్లీ అకాడమీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. చాలాకాలం దూరంగా ఉన్న పరిశోధన, బోధన రంగానికి వెళ్లాలన్నారు. అక్కడ ఎన్నాళ్లు అన్నదే ప్రశ్న అని రాజన్ వ్యాఖ్యానించారు. అలాగే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత దిగి వస్తుందన్నారు. జులై నెలలో ఇది అంతకంటే ఎక్కువే (6.07 శాతం) ఉంది. 6 శాతం కంటే తక్కువే ఉంచాలన్నదే తన లక్ష్యమనీ, అది సాధించాకే తన పదవీకాలం ముగిసిందని రాజన్ తెలిపారు.
కాగా ఈనెల (సెప్టెంబర్) 4వ తేదీన రాజన్ పదవీ కాలం ముగియనుంది. ఆర్ బీఐ నూతన గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నియమితులైన సంగతి తెలిసిందే.