
న్యూఢిల్లీ : ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సీటు ఆఫర్ చేయబోతుంది. రాజ్యసభ సభ్యుడిగా రాజన్‌ను పేరును ఆప్ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులను త్వరలోనే రాజ్యసభకు పంపించబోతున్నారు. వీరి పదవీ కాలం జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది.
ఉన్న మూడు ఖాళీలకు పార్టీలో ఉన్న నేతలను కాకుండా బయట నుంచి ప్రొఫెషనల్స్‌ను రాజ్యసభకు ఎంపికచేయాలని కేజ్రీవాల్ నిర్ణయిస్తున్నట్టు తెలిసింది. సెంట్రల్ బ్యాంకుకు గవర్నర్‌గా పనిచేసిన రాజన్, ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండోసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ కొనసాగింపును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, ఆయన పదవిని పొడిగించలేదు. ఈ క్రమంలో ఆయన తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృతిని ఎంచుకున్నారు. ఖాళీ కాబోతున్న ఈ మూడు రాజ్యసభ సీట్ల కోసం పోటీ బాగానే ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ ఆప్ నేత కుమార్ విశ్వాస్ కూడా రాజ్యసభ పదవికి పోటీ పడుతున్నారు.