హీరోయిన్‌కు ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ప్రశంసలు  | Sakshi
Sakshi News home page

దీపికా పదుకొనేపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ప్రశంసలు 

Published Fri, Jan 10 2020 8:32 PM

Raghuram Rajan on Deepika silent protest at JNU - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ జేఎన్‌యూ వ్యవహారంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే నిరసనపై స్పందించారు. జేఎన్‌యు హింసకు స్పందించిన దీపికాకు మద్దతు తెలపడంతో పాటు, ఆమె చేసిన సైలెంట్‌ ప్రొటెస్ట్‌పై ఆయన తన అభిమానం చాటారు. అంతేకాదు తన కుటుంబానికి వేధింపులు ఉన్నప్పటికీ నిష్పాక్షికంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో దీపికా పదుకొనేను పోల్చారు. కొంతమంది వ్యక్తులు తమ చర్యల ద్వారా సత్యం, స్వేచ్ఛ ,న్యాయం లాంటివే కాకుండా త్యాగం చేయవలసిన ఆదర్శాలను చూపిస్తారన్నారు

భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటైన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) లోకి ముసుగు దుండగుల ముఠా  ప్రవేశించి, ఆపై గంటల తరబడి వినాశనం సృష్టించి, విద్యార్థులు అధ్యాపకులపై దాడి చేయడంతోపాటు, పోలీసుల నిర్లక్ష్యం అనే వార్త తీవ్ర ఆందోళన కరమైందని లింక్డిన్‌లోని ఒక బ్లాగులో రాజన్‌ వ్యాఖ్యానించారు. జేఎన్‌యూ బాధితులను కలవడం ద్వారా అటు పుష్ప గుచ్ఛాలను, ఇటు ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న ఆమె మనందరికీ స్పూర్తిదాయకమని  పేర్కొన్నారు. తన తాజా చిత్రం 'ఛపాక్' ప్రమాదంలో పడుతుందని తెలిసీ కూడా జేఎన్‌యూ బాధితులకు అండగా నిలిచేందుకు ఆమె వెనుకాడలేదన్నారు.

అలాగే జేఎన్‌యూ ఆందోళనలో కీలక పాత్ర పోషిస్తున్న యువతను కూడా రాజన్‌ ప్రశంసించారు. విభిన్న విశ్వాసాలు కలిగిన యువకులు ఒక్కటిగా కలిసి కవాతు చేయడం, హిందూ,ముస్లింలు మన జాతీయ జెండా వెనుక ఐక్యం కావడం సంతోషకరమన్నారు. తమ సొంత లాభం కోసం కృత్రిమ విభజనలను ప్రేరేపించే స్వార్థరాజకీయ పరులను తిరస్కరించడం చాలా ఆనందంగా ఉందని రాజన్ అన్నారు.  తద్వారా మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకాశవంతంగా నిలుస్తుందనే విషయాన్ని తేల్చి చెప్పారన్నారు. మహాత్మాగాంధీ ప్రాణత్యాగం చేసిన దేశ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం యువత పోరాడుతోంది. స్వేచ్ఛను కాపాడటం కోసం వీరు కవాతు చేస్తున్నారు. ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న స్వేచ్ఛా స్వర్గం కోసం ఉద్యమిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఉన్నత విశ్వవిద్యాలయాలు కూడా అక్షరాలా యుద్ధభూమిగా మారిపోయాయి. ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో వివక్ష, ఉదాసీనత రెండింటి పాత్ర ఉందనీ, నాయకత్వాన్ని నిందించడం చాలా సులభమే అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు బాధ్యత కూడా ఉందని ఆయన రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యం అంటే హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా.  స్వాత్రంత్యం అంటే ఎన్నికల రోజున మాత్రమే గుర్తుకువచ్చేది కాదు, ప్రతి రోజు రావాలి అని రాజన్‌ రాశారు.  ఈ సందర్భంగా నిజాన్ని చూపించడం కోసం కృషి చేస్తున్న మీడియా సంస్థలను,  రాజీనామా చేసిన అధి​కారులను కూడా ఆయన ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి నిరాకరించిన మాజీ ఎన్నికల సంఘం ఏకైక  అధికారి అని లావాసాను పరోక్షంగా గుర్తు చేసుకున్నారు రఘురామ రాజన్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement