ఆర్బీఐ గవర్నర్ అంశం మీడియాకెందుకు?
♦ రాజన్ పదవీకాలం పొడిగింపుపై మౌనం వీడిన ప్రధాని
♦ ఈ నియామకం పాలనాపరమైన వ్యవహారమని వ్యాఖ్య
♦ ఈ అంశంలో రాజకీయ నాయకుల జోక్యం తగదన్న అసోచామ్
♦ మరోసారి రాజన్‌పై స్వామి విమర్శలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం పొడిగింపు అంశంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలు, రాజకీయ విమర్శల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మొట్టమొదటిసారి ఈ అంశంపై పెదవి విప్పారు. ఇది పూర్తిగా పాలనాపరమైన నిర్ణయం, వ్యవహారం అనీ, దీనిపై మీడియా ఉత్సుకత తగదని వ్యాఖ్యానించారు. కాగా అసలు ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు సరికాదని అసోచామ్ వ్యాఖ్యానించింది. ఇవేమీ పట్టించుకోని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యంస్వామి మామూలుగానే మరోసారి రాజన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
సెప్టెంబర్‌లోనే నిర్ణయం: మోదీ
వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ ఈ అంశంపై మాట్లాడుతూ, ‘‘ పాలనా పరమైన అంశం మీడియా ఉత్సుకత చూపే అంశంగా ఉండాలని నేను భావించడం లేదు. ఈ అంశాన్ని సెప్టెంబర్‌లోనే చేపట్టడం జరుగుతుంది’’ అని స్పష్టంచేశారు. రాజన్ మూడేళ్ల బాధ్యతలు సెప్టెంబర్ మొదటివారంలో ముగియనున్నాయి. రాజన్‌పై స్వామి విమర్శలు... రాజన్ బాధ్యతల పొడిగింపునకు సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు ఇటీవలే ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇస్తూ ‘‘ప్రభుత్వం-ఆర్‌బీఐ మధ్య పరిపక్వతతో కూడిన సంబంధాలు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ఆరోపణలను అంగీకరించబోమని కూడా స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్‌కు... అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై విశేష పట్టు ఉంది.
2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన ఘనత ఆయనకు సొంతం. ప్రతిష్టాత్మక చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఫైనాన్స్)లో ‘ఆన్‌లీవ్’ ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్‌మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది. చేయాల్సింది చాలా ఉందని ఇటీవలే పేర్కొన్న రాజన్.. బాధ్యతల్లో రెండోసారి కొనసాగడానికి సిద్ధమని ఇటీవలే సంకేతాలు ఇచ్చారు.
స్వామి మాటలు షరా మామూలే!
యథాపూర్వం బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి శుక్రవారమూ రాజన్‌పై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ఆయన విధానాలు వ్యవసాయ రంగానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ విధానాలు వ్యవసాయ రంగానికి ప్రతికూలంగా ఉన్నాయని విమర్శించారు. అమెరికా బహుళజాతి కంపెనీలకు సహాయం చేసే విధంగా.. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రయోజనాలను రాజన్ దెబ్బతీసినట్లు భారతీయ కిసాన్ అభియాన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ‘రాజన్ బాధ్యతల పొడిగింపులో మీడియా ఉత్సుకత అనవసరం అని మాత్రం ప్రధాని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు’ అని సైతం స్వామి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాజకీయ నాయకులకు అనవసరం: అసోచామ్
రాజన్ బాధ్యతలు రెండవ విడత పొడిగింపు అంశం రాజకీయ నాయకులకు అనవసరమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అంశంపై వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు తగదని అభిప్రాయపడింది. సంబంధిత వ్యక్తి తీవ్ర తప్పిదం చేస్తేతప్ప, ఆర్‌బీఐ గవర్నర్ వంటి పదవిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని స్పష్టంచేసింది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చిచూస్తే భారత్ స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలో రిజర్వ్ బ్యాంక్ పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. ఆర్‌బీఐ గవర్నర్ వంటి అత్యున్నత స్థాయి నియామకాలు ప్రభుత్వ నిర్ణయ పరిధికి లోబడిన వ్యవహారమని, దీనిపై అనవసర మీడియా ప్రకటనలు తగదని పేర్కొంది.