భారత్‌కు కలిసొస్తున్న...మోదీ-రాజన్-కమోడిటీస్ త్రయం! | Narendra Modi-Raghuram Rajan-commodities trinity keeping India a favourite: Citigroup | Sakshi
Sakshi News home page

భారత్‌కు కలిసొస్తున్న...మోదీ-రాజన్-కమోడిటీస్ త్రయం!

Published Tue, Dec 23 2014 4:29 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

భారత్‌కు కలిసొస్తున్న...మోదీ-రాజన్-కమోడిటీస్ త్రయం! - Sakshi

భారత్‌కు కలిసొస్తున్న...మోదీ-రాజన్-కమోడిటీస్ త్రయం!

పెట్టుబడులకు ఫేవరెట్...
వచ్చే ఏడాదీ స్టాక్ మార్కెట్ జోరు
సిటీ గ్రూప్ నివేదికలో వెల్లడి

 
న్యూఢిల్లీ: అమెరికా కంపెనీలకు అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ కొనసాగుతోందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం సిటీ గ్రూప్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, దిగొస్తున్న అంతర్జాతీయ కమోడిటీ ధరలు భారత్‌ను ఫేవరెట్‌గా నిలుపుతున్నాయని సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

కాగా, భారీగా పడిపోయిన ముడిచమురు ధరలు, రష్యా కరెన్సీ రూబుల్ భారీ పతనం ఇతరత్రా అంతర్జాతీయ ప్రతికూలాంశాల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తప్పించుకోలేనప్పటికీ.. ఇతర దేశాలతోపోలిస్తే మెరుగైన స్థితిలో ఉందని సిటీ గ్రూప్ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. భారీగా క్రూడ్ దిగుమతులు చేసుకుంటున్న భారత్‌కు దీని ధర నేలకు దిగిరావడం శుభపరిణామమని.. దీంతోపాటు స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, విదేశీ మారక నిల్వల పెరుగుదల ఆర్థిక వ్యవస్థకు మరింత చేయూతనివ్వనున్నట్లు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఐదున్నరేళ్ల కనిష్టానికి(బ్యారెల్ 60 డాలర్ల దిగువకు) పడిపోయిన సంగతి తెలిసిందే.

కొన్ని ఆందోళనలూ ఉన్నాయ్...
వ్యాపారానుకూల మోదీ ప్రభుత్వం, వేగవంతంగా తగిన పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, కమోడిటీ ధరల క్షీణతతో పెట్టుబడులకు సానుకూల దేశంగా భారత్ నిలుస్తోందని తెలిపింది. 2014లో స్టాక్ మార్కెట్ల జోరు నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరింత ఉత్సాహంగా ఉన్నారని అభిప్రాయపడింది. ఈ వేగం కొంత తగ్గనున్నప్పటికీ... వచ్చే ఏడాది కూడా మార్కెట్లు లాభాల జోరును కొనసాగించే అవకాశం ఉందని సిటీ పేర్కొంది. కాగా, భారత్ మార్కెట్‌పై అంచనాలు భారీగా ఉన్నా... అమెరికా ప్యాకేజీల ఉపసంహరణ, వడ్డీరేట్ల పెంపు భయాలు ఇన్వెస్టర్లలో తొలగిపోలేదని వ్యాఖ్యానించింది.

బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు పెరిగిపోవడం... పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్ఠంభన కారణంగా కీలక సంస్కరణలకు ఆమోదం లభిస్తుందోలేదోనన్న అనిశ్చితి ఇన్వెస్టర్లకు ఆందోళనకలిగిస్తున్న ప్రధానాంశాలని అభిప్రాయపడింది. 2012-13లో ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగబాకిన క్యాడ్(జీడీపీలో 4.8%)... 2013-14లో 1.7 శాతానికి దిగొచ్చిన సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.4%కి తగ్గగా, టోకు ధరల ద్రవ్యోల్బణం  సున్నా శాతానికి పడిపోవడం గమనార్హం.

బడ్జెట్‌పై దృష్టి...
‘బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. భవిష్యత్తులో భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇది దిశానిర్దేశం చేయనుంది. అంతేకాకుండా ద్రవ్యలోటు కట్టడి ఇతరత్రా కీలక చర్యల విషయంలో ఎలా నెగ్గుకొస్తుందనేది కూడా బడ్జెట్‌లో ఆవిష్కృతమౌతుంది’ అని సిటీ గ్రూప్ పేర్కొంది. కాగా, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి దిగిరావడం భారత్‌కు కలిసొచ్చే అంశమని.. మళ్లీ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7% స్థాయిని అందుకోగల సత్తా ఉందని అభిప్రాయపడింది. గడిచిన రెండేళ్లలో 5% దిగువకు పడిపోయిన వృద్ధి రేటు ఈ ఏడాది 5.5 శాతం ఉండొచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement