వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది
ప్రచార యావతో ఒరిగేదేం లేదు: ప్రధాని మోదీ
- ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నిజమైన దేశభక్తుడు
- సుబ్రమణ్య స్వామిపై పరోక్ష విమర్శలు
- ఎన్‌ఎస్జీలో సభ్యత్వం సాధిస్తాం.. టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్‌ఎస్జీ (అణు సరఫరాదారుల కూటమి)లో భారత్‌కు సభ్యత్వం దక్కుతుందని, సానుకూల వాతావరణంలో చర్చలు మొదలయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పాక్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, రుణ ఎగవేతదారుల్ని చట్టముందు నిలబెడతామని చెప్పారు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యల్ని పరోక్షంగా తప్పుపట్టిన ప్రధాని.. దేశభక్తిలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఎవరికీ తక్కువ కాదన్నారు. వ్యక్తికన్నా వ్యవస్థ గొప్పదని, ప్రచారంపై మోజుతో దేశానికి మేలు జరగదని అన్నారు. సోమవారం ‘టైమ్స్ నౌ’ చానల్ ఇంటర్వ్యూలో మోదీ ఏమన్నారో ఆయన మాటల్లోనే ..
ఎన్‌ఎస్జీ సభ్యత్వంపై... ఐరాస భద్రతామండలి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ), క్షిపణి సాంకేతికత నియంత్రణ బృందం(ఎంటీసీఆర్), ఎన్‌ఎస్జీలో సభ్యత్వం కోసం వరుసగా ప్రభుత్వాలు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రయత్నాల్ని కొనసాగించాయి. మా ప్రభుత్వం మాత్రమే ప్రయత్నాలు చేయడం లేదు. మా హయాంలో ఎస్‌సీఓలో సభ్యత్వం సాధించాం. ఎంటీసీఆర్‌లో స్థానం పొందడంలో విజయవంతమయ్యాం. ఎన్‌ఎస్జీలో సభ్యత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. ఈ ప్రక్రియ సానుకూల వాతావరణంలో మొదలైంది. ప్రతిదీ దాని నిబంధనల మేరకు జరుగుతుంది.
చైనా వ్యతిరేకతపై... విదేశాంగ విధానం ప్రకారం చర్చల్లో ఏకాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. చైనాతో విభేదాల్ని చర్చలతో పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చర్చలు జరుగుతున్నాయి.. అలాగే కొనసాగాలి. చైనాతో మనకు ఒక్క సమస్యే కాకుండా అనేక అపరిష్కృత వివాదాలున్నాయి. ఒకదాని వెంట ఒకటి పరిష్కారమయ్యేలా నెమ్మదిగా, నిదానంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చైనా కూడా సమస్య పరిష్కారం దిశగా సహకరిస్తుంది. కొన్ని అంశాల్లో చైనాతో విభేదిస్తున్నాం.. వాళ్లు కూడా మనతో విభేదిస్తున్నారు. ముఖ్యమైన విషయమేంటంటే ఇప్పుడు చైనాతో ముఖాముఖి చర్చిస్తున్నాం. భారత్ ప్రయోజనాలే ప్రాతిపదికగా చర్చల్లో అంశాల్ని లేవనెత్తుతున్నాం. మూడ్రోజుల క్రితం చైనా అధ్యక్షుడితో భారత్ ప్రయోజనాలే లక్ష్యంగా చర్చించా.
లక్ష్మణరేఖపై ఎవరితో చర్చించాలి
పాకిస్తాన్‌తో చర్చల విషయంలో లక్ష్మణరేఖ గురించి ఎవరితో చర్చించాలి. పాకిస్తాన్‌లోని ఎన్నికైన ప్రభుత్వంతోనా... లేదా ప్రభుత్వేతర శక్తులతోనా... అందుకే పాకిస్తాన్ విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా, జాగరూకతతో ఉండాల్సి వస్తోంది. అందులో ఎలాంటి నిర్లక్ష్యం, చూసీ చూడనట్లు ఉండకూడదు. లాహోర్ పర్యటన, పాక్ ప్రధానిని ఆహ్వానించడం వంటి నిరంతర యత్నాలతో ఉగ్రవాదంపై భారత్ అభిప్రాయమేంటో ప్రపంచానికి చెప్పాం.పాక్ ఈ విషయంలో సమాధానం చెప్పడం కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉగ్రవాదంపై భారత్ చెపుతున్న దాన్ని అంగీకరిస్తుంది. ఉగ్రవాదం వల్ల భారత్‌కు జరిగిన నష్టాన్ని, మానవత్వానికి జరిగిన నష్టాన్ని ప్రపంచంఅంగీకరిస్తుంది. ఈ అంశంలో భారత్ తన వాదనను ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నా.
సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలు సరికాదు
అది మా పార్టీలోని వ్యక్తా? కాదా? అన్నది కాదు... ఇలాంటివి సరైనవి కావు. ప్రచారంపై ఉన్న మోజు దేశానికి ఎప్పుడూ ఎలాంటి మంచి చేయదు. ప్రజలు ఎంతో బాధ్యతతో ప్రవర్తించాలి. ఎవరైనా తాము వ్యవస్థ కంటే ఎక్కువని భావిస్తే అది తప్పు.
విదేశాంగ విధానంలో సమష్టి కృషి
కేంద్రంలో ప్రభుత్వానికి పూర్తి బలం ఉండడంతోనే విదేశాంగ విధానం బలోపేతమైంది. పూర్తి మెజార్టీ కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఇది ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపింది. విదేశాంగ విధానంలో మా ప్రభుత్వం సమష్టిగా పనిచేస్తుంది. నాకు విదేశాంగ విధానం కొత్తే. విదేశాంగ శాఖ, ప్రధాని కార్యాలయం, వాణిజ్య, రక్షణ శాఖలు కలసి పనిచేస్తున్నాయి.
పేదవాడే కేంద్ర బిందువు
పాలనపైనే నా దృష్టంతా. కేవలం ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేయడం వల్ల దేశం ఎంతో నష్టపోయింది. ప్రజల డిమాండ్లను, అంచనాల్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నించాలి. మా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలో పేదవాడే కేంద్ర బిందువు. దేశంలోని ఓటర్లు చాలా పరిణితి చెందినవాళ్లు.. లోక్‌సభ ఎన్నికల్లో ఒకలాగా, రాష్ట్రాల ఎన్నికల్లో మరోలా తీర్పునిచ్చారు. వారి పరిణితిని మనం నమ్మి తీరాలి.
పార్లమెంట్ సమావేశాలపై..
ఎన్నో ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న వాళ్లు పార్లమెంట్ సమావేశాల్ని అడ్డుకోవడం సరికాదు. కీలకమైన బిల్లులు ఆమోదం పొందనందుకు నేను బాధ పడలేదు. చర్చ బదులు గందరగో ళం చోటు చేసుకోవడంతో నేను నిరాశ చెందా.
రఘురాం రాజన్ దేశభక్తిపై...
రఘురాం రాజన్‌ను అభినందిస్తున్నా... ఆయన దేశభక్తిలో ఎవరికీ తక్కువ కాదు. రాజన్ దేశాన్ని ప్రేమించే వ్యక్తి. ఎక్కడ ఉన్నా భారతదేశం కోసం పనిచేస్తారు. యూపీఏ హయాంలోనే రాజన్‌ను నియమించినా పదవీకాలం ముగిసేవరకూ ఆయన కొనసాగుతారు. రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులైన మూడు నెలల అనంతరం 2014లో పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. యూపీఏ ప్రభుత్వం నియమించిన రాజన్‌ను కొనసాగనిస్తారా? అంటూ రాశారు. నేను ఆయనను కొనసాగనివ్వనని చెప్పారు. అది తప్పని రుజువైంది.
అప్పులు ఎగ్గొట్టే వారికి చట్టం రుచి చూపిస్తా
ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టేవారికి చట్టం రుచేంటో చూపిస్తాను. వారిని దేశానికి రప్పించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ పని చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీనే అని గట్టి ప్రజలు నమ్మకంతో ఉన్నారు. నేను ఈ పని తప్పకుండా చేస్తాను.
జనంలో తగ్గుతున్న హాస్యం
నాకు హాస్యమంటే ఇష్టం. కానీ నేడు ప్రజా జీవితంలో హాస్యం అనేది తగ్గిపోతుంది. 24 గంటల వార్తా చానళ్ల యుగంలో ఎవరైనా సరే చిన్నమాటను పెద్ద సమస్యగా మార్చేయవచ్చు. ప్రజల్లో హాస్యం తగ్గిపోవడానికి కారణం భయం. ఈ భయం వల్లే ప్రజా జీవితంలో హాస్యాన్ని కోల్పోతున్నాం.
అవినీతి కళలో ఘనులు
అగస్టా సహా ఇతర రక్షణ రంగ కుంభకోణాల్లో సంబంధమున్నవారు ఇలాంటి విషయాల్లో చాలా అనుభవజ్ఞులు. వారు తప్పులు చేసే కళలో ఆరితేరినవారు. పై స్థాయిలో కాపాడే వ్యవస్థ లేకుండా ఇలాంటి కుంభకోణాలు చేయడం సాధ్యం కాదు. అగస్టా స్కామ్‌కు సంబంధించి మా ప్రభుత్వం ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కుంభకోణం వెనుక ఎవరున్నారు? ఎంత నష్టం జరిగింది? అనే అంశాలను దర్యాప్తు సంస్థలు నిగ్గుతేలుస్తాయి.