
సదస్సులో మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు చేయూతనిస్తే ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఉద్గారాల్లో నెట్ జీరోస్థాయిని సాధించేందుకు క్లీన్ ఎనర్జీ వనరులను పెంచడంతోపాటు గ్రీన్ సొల్యూషన్లపై పాఠ్యాంశాల ద్వారా అవగాహన కల్పించాలని, ఆ దిశగా తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
గురువారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 9వ రీజినల్ యాక్షన్ గ్రూప్ వర్చువల్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ఇంధన వనరులు, విద్యుచ్ఛక్తి నుంచి గ్రీన్ పవర్, గ్రీన్ ట్రాన్సిషన్ దిశగా పెట్టుకున్న లక్ష్యాలను అందుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసి పనిచేయాలని పేర్కొన్నారు. లక్ష్యాలను పూర్తి చేయాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమన్నారు.
ముఖ్యంగా గ్రీన్ ట్రాన్సిషన్, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ చురుగ్గా ముందుకు పోతోందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సోలార్ పవర్ పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ స్టోరేజ్ సొల్యూషన్స్ పాలసీ రాష్ట్రంలో గ్రీన్ విద్యుత్, గ్రీన్ సొల్యూషన్స్ వైపు తెలంగాణను తీసుకుపోతున్నదని పేర్కొన్నారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశం ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్ శక్తిలో 4.2 గిగా వాట్ల సామర్థ్యంతో 10.30 శాతం కలిగి ఉండటం, గ్రీన్ సొల్యూషన్స్, క్లీన్ ఎనర్జీ పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని కేటీఆర్ తెలిపారు. రానున్న సంవత్సరంలో సుమారు ఆరు గిగా వాట్ల స్థాయికి రాష్ట్రంలో సోలార్ ఉత్పత్తి పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పచ్చదనం పెంపుదలకు చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం ఇంధన అవసరాల కోసం సోలార్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనం రంగంపై ఫోకస్ చేస్తూనే హరితహారం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకుపోతున్నదని కేటీఆర్ తెలిపారు. డ్రోన్లతో సీడ్ బాంబింగ్ చేస్తూ, పచ్చదనం పెంచేందుకు టెక్నాలజీని ఆసరాగా తీసుకుంటున్నామని, ఈ దిశగా తెలంగాణ చేపట్టిన పలు కార్యక్రమాలను ఉదహరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రాండె అధ్యక్షత వహించిన ఈ వర్చువల్ సదస్సులో బంగ్లాదేశ్ మాల్దీవులు, యూఏఈ వంటి దేశాల మంత్రులతోపాటు పలు వాహన, ఇంధన రంగ కంపెనీల అధినేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment