సాక్షి, అల్లూరి జిల్లా: విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో గిరిజన సంఘాల అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీలకతీతంగా అన్ని వర్గాలను ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. 'శ్రీకృష్ణ కమిషన్ కూడా వెనుక బడిన విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి నినాదం అని మండిపడ్డారు. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో ఎలా యాత్ర చేపడతారని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు మాటలకు తలొగ్గి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు వికేంద్రీకరణపై విమర్శలు చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు కూడా అమరావతి రాజధాని ఇష్టం లేదన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు అయితే ప్రయోజనం ఉంటుందని టీడీపీ నేతల్లో కూడా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు వినడం మాని ఇప్పటికైనా టీడీపీ నాయకులు బయటకు రావాలని కోరారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు.
హైదరాబాద్‌ను విడిచి రావడంతో ఏపీకి నష్టం జరిగిందని ఆదివాసీ ఐక్యవేదిక అభిప్రాయపడింది. విభజన సమయంలోనే వికేంద్రీకరణ జరిగి ఉంటే అమరావతిలో పెట్టిన డబ్బు వృథా అయ్యేది కాదని స్పష్టం చేసింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని గిరిజన ఉపాధ్యాయ సంఘం తెలిపింది. గిరిజనుల అభివృద్ధి విశాఖ రాజధానితోనే సాధ్యమని, విశాఖ కేంద్రంగా రాజధాని సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది.
ఒకే చోట అభివృద్ధి ఎప్పటికైనా ప్రమాదకరని, గిరిజనులు ప్రాజెక్టుల కోస భూములు త్యాగం చేశారని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలిపింది. అమరావతి రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment