Bhagya Lakshmi
-
మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
-
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్..ఘనత మన సీఎం జగన్ దే
-
గోడ కూలి ముగ్గురు మృతి
శాయంపేట: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి ముగ్గురు మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలోశుక్రవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథ నం ప్రకారం మండల కేంద్రానికి చెందిన ముష్కే భాగ్య లక్ష్మికి చెందిన ఇల్లు శిథిలావస్థకు చేరుకొని పైకప్పు కూలిపోయింది. దీంతో దాని పక్కనే ఆమె చిన్న రేకుల షెడ్డు వేసుకొని కిరా ణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ ఇంటి పక్కనే జోగమ్మ (60) ఇల్లు ఉంది. శుక్ర వారం మధ్యాహ్నం జోగమ్మ తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శిథిలావస్థకు చేరిన గోడ కూలి ఆమెపై మట్టిపెళ్లలు పడ్డాయి. అదే సమయంలో గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మోర సాంబయ్య (65), లోకలబోయిన సారలక్ష్మి (55)లపై గోడ పూర్తిగా పడింది. స్థాని కులు మట్టిపెళ్లలు తొలగించి చూడగా అప్పటికే సాంబయ్య, సారలక్ష్మి విగతజీవులపై కనిపించా రు. జోగమ్మ నడుం, కాళ్లు విరిగిపోయాయి. అంబులెన్స్ ఆలస్యంతో పోయిన ప్రాణం జోగమ్మను ఆసుపత్రికి తరలించడానికి స్థానికులు వెంటనే 108 నంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపాలని కోరగా గంటా 15 నిమిషాల తర్వాత అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటనలో మృతిచెందిన మోరె సాంబయ్య స్థానికంగా పనిలేక సిరిసిల్లలో చేనేత పనిచేస్తూ జీవిస్తున్నాడు. వినాయక చవితి పండగ కోసం శాయంపేటకు వచ్చిన సాంబయ్య... బీడీలు కొనుక్కోవడం కోసం రోడ్డుపైకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఎస్సై దేవేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ
సాక్షి, అల్లూరి జిల్లా: విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో గిరిజన సంఘాల అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీలకతీతంగా అన్ని వర్గాలను ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. 'శ్రీకృష్ణ కమిషన్ కూడా వెనుక బడిన విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి నినాదం అని మండిపడ్డారు. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో ఎలా యాత్ర చేపడతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాటలకు తలొగ్గి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు వికేంద్రీకరణపై విమర్శలు చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు కూడా అమరావతి రాజధాని ఇష్టం లేదన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు అయితే ప్రయోజనం ఉంటుందని టీడీపీ నేతల్లో కూడా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు వినడం మాని ఇప్పటికైనా టీడీపీ నాయకులు బయటకు రావాలని కోరారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌ను విడిచి రావడంతో ఏపీకి నష్టం జరిగిందని ఆదివాసీ ఐక్యవేదిక అభిప్రాయపడింది. విభజన సమయంలోనే వికేంద్రీకరణ జరిగి ఉంటే అమరావతిలో పెట్టిన డబ్బు వృథా అయ్యేది కాదని స్పష్టం చేసింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని గిరిజన ఉపాధ్యాయ సంఘం తెలిపింది. గిరిజనుల అభివృద్ధి విశాఖ రాజధానితోనే సాధ్యమని, విశాఖ కేంద్రంగా రాజధాని సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఒకే చోట అభివృద్ధి ఎప్పటికైనా ప్రమాదకరని, గిరిజనులు ప్రాజెక్టుల కోస భూములు త్యాగం చేశారని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలిపింది. అమరావతి రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదని పేర్కొంది. -
అభినవ అల్లూరి జగనన్న.. అది చంద్రబాబు జలగల సమూహం
-
ఆర్వీ నగర్‌కు రానున్న కాఫీ పరిశోధన స్థానం
కాఫీ రైతులకు శుభవార్త. కాఫీ పరిశోధనస్థానం వెనక్కి రానుంది. గతంలో ఆర్వీనగర్లో ఉన్న కాఫీ పరిశోధన స్థానం భవనాలను మావోయిస్టులు పేల్చేయడంతో మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అక్కడ నుంచి శాస్త్రవేత్తలు సేవలందిస్తున్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్ తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా నియమించడంతో కాఫీ రైతులకుమరింత మేలు జరగనుంది. గూడెంకొత్తవీధి : కాఫీ పరిశోధన స్థానం సేవలు రైతుల చెంతకే రానున్నాయి. ఇప్పటివరకు నర్సీపట్నంలో ఉన్న ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆరింటిలో ఒకటి.. కాఫీ సాగుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆరు కేంద్ర కాఫీ పరిశోధన కేంద్రాలు ఉండగా వాటిలో ఒకదానిని జీకేవీధి మండలం ఆర్.వి.నగర్లో నెలకొల్పారు. కాఫీకి సంబంధించి మేలు రకాలను గుర్తించి వాటిని రైతులకు అందించడం, ఏయే రకాలు మన్యానికి అనుకూలమనే విషయాలపై ఇక్కడ కొంతకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర కాఫీబోర్డు ఆధ్వర్యంలో విస్తరణ విభాగం ఉంది. కాఫీ తోటలను విస్తరించడం, రైతులకు అవసరమైన విత్తనాలను, యంత్రాలను, కాఫీ కల్లాలను ఈ విభాగం సమకూరుస్తోంది. మావోయిస్టులు పేల్చేయడంతో.. ఆర్వీనగర్లో ఉన్న ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని 18 ఏళ్ల క్రితం మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌తో పేల్చేశారు. దీంతో భవనాల కొరత ఏర్పడింది. అప్పటి అవసరాల రీత్యా శాస్త్రవేత్తలు పరిపాలన సౌలభ్యం, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అప్పటి నుంచి 18 ఏళ్లుగా ఈ కార్యాలయం నుంచే శాస్త్రవేత్తలు పరిశోధనలు, విధులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ డీడీ స్థాయి అధికారితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుతో ఇప్పటికే మైదాన ప్రాంతాల్లోని కార్యాలయాలన్నీ మన్యానికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాఫీ పరిశోధన సంస్థ, కేంద్ర కాఫీ ప్రాంతీయ పరిశోధన స్థానం అల్లూరి జిల్లాలోనే కొనసాగించనున్నారు. శాస్త్రవేత్తల సేవలు మరింత చేరువ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టడం పరిశోధన స్థానం వెనక్కి రావడానికి అనుకూలమైన అంశంగా పలువురు పేర్కొంటున్నారు. లక్షన్నర ఎకరాల్లో సాగు కాఫీ సాగుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. సుమారు 1.3 లక్షలకు పైగా కుటుంబాలు లక్షన్నర ఎకరాల్లో కాఫీని వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు. ఏటా పదివేల టన్నుల వరకు కాఫీ గింజలను ఉత్పత్తి చేస్తున్నారు. పోడు వ్యవసాయం నిరోధించి గిరిజనులతో కాఫీసాగు చేపట్టడం ద్వారా అడవులను రక్షించవచ్చని భావించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర కాఫీబోర్డు ద్వారా కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఈ పరిస్థితుల్లో పరిశోధనస్థానం మళ్లీ ఆర్వీ నగర్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గిరి రైతులకు మేలు చేకూరనుంది. శాస్త్రవేత్తల సహకారం అవసరం ఇప్పటికే మన్యం కాఫీకి మంచి గుర్తింపు ఉంది. కాఫీ సాగులో మేలైన దిగుబడులతో పాటు శాస్త్రీయ విధానాలు ఆచరించేందుకు వీలుగా శాస్త్రవేత్తల సహకారం అవసరం. వారి సేవలను పూర్తిస్థాయిలో కాఫీ రైతులకు చేరువ చేస్తాం. మన్యం కాఫీకి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో మన్యం కాఫీకి మరింత పేరు దక్కేలే తమవంతు కృషిచేస్తా. – గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ, కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలు కాఫీ సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు రానున్న మూడేళ్లలో కాఫీ సాగు విస్తీర్ణం మరింత పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకు జి.మాడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి మండలాల్లో ఎకో పల్పింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోంది. విస్తీర్ణం పెంపుతో పాటు దిగుబడులు పెంపు ద్వారా గిరిజనుల ఆదాయం రెట్టింపు అవుతుంది. తద్వారా గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత కాఫీ రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐటీడీఏ సంపూర్ణ సహకారం అందిస్తోంది. వ్యక్తిగతంగా కాకుండా కాఫీ రైతులంతా సంఘటితంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడుతున్నాం. ఎఫ్‌పీవో ప్రోత్సహిస్తుంది. పరిశోధన స్థానం ఆర్వీ నగర్‌కు తిరిగి వస్తే గిరి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – అడపా విష్ణుమూర్తి, కాఫీ రైతుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, జి.కె.వీధి మండలం -
బ్రిటిష్ సైన్యానికి పట్టుబడిన చోటే.. 18 అడుగుల అల్లూరి విగ్రహం..
ఒక అల్లూరి మరణిస్తే లక్షల మంది వీరులు పుట్టుకువస్తారు.. వారంతా విప్లవ యోధులుగా మారతారు.. ప్రతి రక్తం బొట్టు ఒక సైనికుడిని తయారు చేస్తుంది.. బ్రిటిష్ సామ్రాజ్యం నేల కూలుతుంది.. మేజర్ గుడాల్‌తో అల్లూరి సీతారామరాజు నిర్భయంగా పలికిన పలుకులివి. ఆ వీరుడు అన్నట్టుగానే అతని మరణం తరువాత దేశంలో స్వాతంత్య్ర పోరాటం నిప్పుకణమై మండింది. లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పుట్టుకువచ్చారు. తెల్లవారిని తరిమికొట్టారు. సీతారామరాజును కొయ్యూరు మండలం మంపలో బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. ఆ ప్రాంతంలోనే ఆ యోధుడి అధ్యాయం ముగిసింది. అందుకు గుర్తుగా అదే చోట 18 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఆ బృహత్ కార్యక్రమానికి ఆదివారం శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.. కొయ్యూరు: అది మే నెల ఏడవ తేదీ.. 1924వ సంవత్సరం. ఉదయం ఎనిమిది గంటలకు మంపలో ఉన్న కొలనులో సీతారామరాజు స్నానం చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ సైన్యం మేజర్ గుడాల్ నేతృత్వంలో చుట్టుముట్టింది. ఆయనే అల్లూరి అని నిర్ధారించుకునేందుకు గుడాల్ ఓ పరీక్ష పెట్టాడు. మరిగే పాలను ఇచ్చినా రామరాజు గటగటా తాగుతారని తెలిసి వేడి పాలను తీసుకువచ్చి తాగించారు. ఆయన ఆ పాలను నీళ్లు మాదిరిగా తాగడంతో అతనే సీతారామరాజని తేలింది. అప్పుడు అల్లూరిని మంపకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేంద్రపాలేనికి తీసుకువచ్చారు. అక్కడ అతడిని మంచానికి కట్టి మేజర్ గుడాల్ కాల్చి చంపారు. రామరాజు చనిపోయే ముందు పలికిన ఒక్కో మాట తూటాగా పేలింది. వందేమాతరం అంటూ దేశభక్తిని నింపి ప్రాణత్యాగం చేశారు. అక్కడ నుంచి అతని పార్థివ దేహాన్ని కృష్ణాదేవిపేటకు తరలించి అక్కడ అంత్యక్రియలు చేశారు. అల్లూరి మరణించి 98 సంవత్సరాలు కావస్తోంది. జాతీయ అల్లూరి యువజన సంఘం ఆధ్వర్యంలో మంపలో ఆయన పట్టుబడిన కొలను మధ్యలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు అల్లూరికి కుడి ఎడమ భుజాలుగా నిలిచిన గాం గంటన్నదొర, మల్లుదొరతోపాటు మరికొందరి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. దీని శంకుస్థాపనకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలను ఆహ్వానించారు. వేధింపులతో విప్లవానికి నాంది: నాడు రంపుల, చింతపల్లి ఘాట్రోడ్ల నిర్మాణ సమయంలో కూలి విషయంలో బ్రిటిష్ పాలకులు గిరిజనులను వేధించడాన్ని సీతారామరాజు స్వయంగా చూశారు. వారికి జరుగుతున్న అన్యాయంపై అతను సాయుధ పోరాటం మొదలు పెట్టారు. 1922 ఆగస్టులో చింతపల్లి, కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల స్టేషన్లపై రామరాజు ధైర్యంగా దాడులు చేశారు. పోలీసు రికార్డుల్లో ఆయన పట్టుకువెళ్లిన ఆయుధాలను కూడా నమోదు చేశారు. అతనితో కలిసి పోరాటం చేసిన వారిలో మల్లుదొర, గంటన్నదొరతో పాటు అగ్గిరాజు, యర్రయ్య కూడా కీలకంగా వ్యవహరించారు. మొత్తం 212 మంది ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వందలాదిమంది పోలీసులను నియమించినా అల్లూరిని పట్టుకోలేకపోయారు. మంపకు సమీపంలో ఉర్లకొండ వద్ద ఉన్న గృహంలో సీతారామరాజు సమావేశాలు ఏర్పాటు చేసేవారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేశారు. ఆ గుహ నుంచి చూస్తే మంప, రేవళ్లు రహదారుల నుంచి ఎవరు వస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు గుహ వైపు వచ్చినా తెలిసిపోతుంది. దీంతో దానినే రాజు స్థావరంగా ఎన్నుకున్నారు. ఈ విషయాలను సేకరించిన మేజర్ గుడాల్ మంపలో అల్లూరిని పట్టుకునేందుకు పథకం రచించారు. అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసేది ఈ కొలనులోనే.. కొలను చుట్టూ ఇనుప కంచె పెట్టాలి సీతారామరాజు స్మారక ప్రదేశంలో ప్రస్తుతం కొలను వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేయాలి. లేకుంటే పశువులు వచ్చి పాడు చేసే అవకాశం ఉంది. అదే విధంగా స్మారక ప్రాంతంలో మంచి మొక్కలను నాటాలి. గోడలపై సీతారామరాజు జీవిత చరిత్రను చిత్రాల రూపంలో వేయాలి. ఇలా చేస్తే సందర్శకులకు చారిత్రక విషయాలు తెలుస్తాయి. మంచి పర్యాటక ప్రదేశమవుతుంది. – ఇంగువ త్రినాథ్ పడాల్, మంప, సర్పంచ్ అల్లూరి జిల్లాతో నిజమైన నివాళి మన్యం వీరుడు అల్లూరిని పట్టుకున్న మంప, అతడిని కాల్చి చంపిన రాజేంద్రపాలెంతోపాటు కృష్ణాదేవిపేటలో ఉన్న సమాధుల ప్రాంతాన్ని పూర్తిగా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. మంపకు సమీపంలో ఉన్న ఉర్లకొండ గుహ ఒకప్పుడు అల్లూరి స్థావరంగా ఉండేది. దానిని వెలుగులోకి తీసుకురావాలి. పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు అల్లూరి పేరు పెట్టడం నిజమైన నివాళి. – పడాల వీరభద్రరావు, జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు -
మా ఇంటి భాగ్యలక్ష్మి
కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ అదేక్రమంలో ఆశయాలను సాధించి అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికీ కూడా మంచి పేరు తీసుకు వచ్చిందామె. పదవ తరగతి పూర్తవగానే పెద్దలు ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకున్నారు. అయితే ఉన్నత చదువులు చదివి మంచిఉద్యోగం చేయాలని చిన్ననాటినుంచి కన్నకలను నెరవేర్చుకుందామె. అందుకు కట్టుకున్న వాడిచ్చిన ప్రోత్సాహం ప్రాణం పోసింది. ఈ చదువులమ్మ ప్రస్థానం ఎందరికో ఆదర్శం.పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మిని అదే జిల్లా నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన బండారు సోమశేఖర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. సోమశేఖర్ ఉదయం ఏడుగంటలకే పనికి వెళ్లి, రోజంతా కష్టపడి నాలుగు రాళ్లు సంపాదించి రాత్రికి ఇల్లు చేరే రోజుకూలి. పెళ్లప్పటికి భాగ్యలక్ష్మి 10వ తరగతి మాత్రమే పూర్తి చేసింది. బాగా చదువుకోవాలన్న తన కోరిక నెరవేరక పోవడంతో అత్తవారింట అడుగుపెట్టిన భాగ్యలక్ష్మి మొదట్లో చాలా ముభావంగా ఉండేది. భర్త తనను అర్థం చేసుకోగలవాడని తెలుసుకుని కొన్నాళ్లకు ధైర్యం చేసి తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పింది. అతనికి కూడా ఆమెను చదివించాలని అనిపించింది. అయితే కుటుంబ ఆర్ధికపరిస్థితుల దృష్ట్యా వెంటనే అందుకు పూనుకోలేకపోయాడు. అలా ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. ఓ కొడుకు పుట్టాడు. అప్పటికే బంధువుల్లో కొందరు చదువుకుని ఉన్నత స్థానాల్లోకి వెళుతుండడంతో సోమశేఖర్‌కు ఎలాగైనా భార్య కోరిక నెరవేర్చాలనిపించింది. దాంతో 2008లో భాగ్యలక్ష్మి చదువుకు పచ్చజెండా ఊపాడు. ఆ మాత్రం ఆసరా ఉంటే చాలనుకుంది భాగ్యలక్ష్మి. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా డిగ్రీ చదవడానికి ప్రవేశ పరీక్ష రాశారు.తొమ్మిదేళ్ల తర్వాత రాసిన తొలిపరీక్షలో విజయం సాధించిన భాగ్యలక్ష్మి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. డిగ్రీ చదవడానికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో తరగతులకు హాజరవుతూ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత అదే ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎం.ఎ. తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. టీచర్ అవాలనే లక్ష్యంతో బీఈడీ కూడా చేశారు. అది పూర్తయిన తర్వాత నేషనల్ ఎటిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్) పరీక్షల్లో అర్హత సాధించారు. 2014లో తొలిసారి డీఎస్సీ రాశారు. ఆ ప్రయత్నంలో విఫలమయినా, నిరుత్సాహపడలేదు. 2018లో వెలువడిన డిఎస్సీ ప్రకటన ఆమెలో ఊపిరి పోసింది. రేయింబవళ్లు కష్టించి, పరీక్ష రాశారు. దీంతో తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల (జోన్–2) పరిధిలో గురుకుల పాఠశాల్లో ఉన్న ఒకే ఒక్క గ్రాడ్యుయేట్ తెలుగు టీచర్ పోస్టు భాగ్యలక్ష్మిని వరించింది. బోణం గణేష్, సాక్షి ప్రతినిధి ఫొటోలు: గాడి శేఖర్‌బాబు, నిడదవోలు ఆశయం తనది... ఫలాలు అందరివి ‘‘నేను పెద్దగా చదువుకోలేదు. తనకు చదువంటే చాలా ఇష్టం. మావేమో రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. చదువంటే ఫీజులు, పుస్తకాలని ఖర్చు. అందుకే చాలా కాలం ధైర్యం చేయలేకపోయాను. అయినా తన ఆశయాన్ని బతికించాలనుకున్నాను. తను కూడా ఎంతో కష్టపడింది. సగటు భార్యలకుండే ఎలాంటి కోరికలు ఆమెకు లేవు. సరదాలు, షికార్లు తెలియవు. అన్నిటినీ దూరంపెట్టి చదువుపైనే ధ్యాస ఉంచి ఈ రోజు ఈ విజయాన్ని తను సాధించి, ఫలితాన్ని మాకు అందించింది.’ బండారు సోమశేఖర్ ఇది అందరి విజయం ‘‘పదవ తరగతి తర్వాత పెళ్లై పోతే జీవితం చాలా గందరగోళంగా కనిపించింది. కానీ అర్థం చేసుకుని ప్రోత్సహించే భర్త దొరకడంతో నా జీవితమే మారిపోయింది. ఆర్థికఇబ్బందులు చాలాసార్లు మా మానసిక స్థైర్యాన్ని పరీక్షించాయి. కానీ వాటితో పోరాడుతూనే ముందుకు వెళ్లాం. నా భర్త కూలిడబ్బులతో పాటు నేను ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ కుటుంబ అవసరాలకు, చదువుకు ఖర్చుచేశాం. నాతోపాటే మా అబ్చాయి సాయిని నా ఆలోచనలకు తగ్గట్టుగానే చదివించుకుంటున్నాను. నా ఈ విజయంలో ఎంతోమంది చేయూత ఉంది. ముఖ్యంగా మేం అద్దెకున్న ఇంటియజమాని కొమ్మిన కృష్ణవేణి, నా భర్త మేనమామ కీర్తి ఆంజనేయులు, మా మేనమామ శ్రీమంతుల రామాంజనేయులు కష్టకాలంలో చేయూతనిచ్చారు. స్నేహితులు, బంధువులు, మా ఊరివాళ్లు ఇచ్చిన ప్రోత్సాహం కూడా నా విజయానికి తోడయ్యింది. సలాది భాగ్యలక్ష్మి -
టీడీపీకి గుణపాఠం తప్పదు
చింతపల్లి: రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని బెన్నవరం కాలనీలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయన్నారు. జన్మభూమి కమిటీలను నియమించి అక్రమాలకు తెరలేపారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు వందల అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను అన్నివిధాలా మోసం చేశారని ఆరోపించారు. మన్యంలో వైఎస్సార్ పార్టీ తరుపున గెలిచిన ప్రజాప్రతినిధులు డబ్బు కోసం పార్టీ ఫిరాయించి రాజకీయ జన్మనిచ్చిన పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఫిరాయింపుదారులకు గిరిజనులు బుద్ధి చెబుతారన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో టీడీపీ నాయకులు అభివృద్ధి పేరిట వివిధ పనులకు శిలాఫలకాలు వేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే శిలాఫకాలు వేసిన పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాజన్న రాజ్యం వస్తుందని, మన్యం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజనులంతా జగనన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందన్నారు. నవరత్నాల పథకాలు పేదల పాలిట వరాలని, వీటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, కార్యవర్గ సభ్యుడు పాంగి గుణబాబు, పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి, ఎంపీటీసీ సుబ్బారావు, మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు వెంకాయమ్మ, రీమలి నళిని, వైఎస్సార్ సీపీ నాయకులు, స్వామి, రామారావు, కృష్ణవేణి, బాబి, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశ్రీ అలభ్య అనువాద రచన (యక్షగానం) భాగ్యలక్ష్మి
మహాకవి శ్రీశ్రీ నూట ఎనిమిదో జయంతి సందర్భంగా, ఒక అదనపు కారణానికి కూడా ఈ పండుగ వేడుక హెచ్చింది. విరసం వారూ, తరువాత మనసు ఫౌండేషన్ వారూ వేసిన శ్రీశ్రీ సమగ్ర రచనలు లేదా సంపూర్ణ లభ్య రచనల సంకలనాల శ్రద్ధాపూర్వక కృషి తరువాత కూడా మరొక శ్రీశ్రీ రచన, లభ్యం అయ్యింది. అది రాసిన శ్రీశ్రీకి 34 ఏళ్ళు. ఒక ఏడాది ముందరే జరిగిన ఈ రచన, తన ప్రపంచ సాహిత్య అధ్యయన స్వభావానికి దీటుగానే ఉన్నది. ఈ రచన అచ్చు అయింది 26 మార్చ్ 1944 ఆనందవాణి పత్రికలో, భాగ్యలక్ష్మి (యక్షగానం) పేరిట. ఇది అనువాద కవిత కావడం మరొక విశేషం. ఇరవై మూడేళ్ళ రడ్యార్డ్ కిప్లింగ్ (1865 – 1936) రచన ‘ద మాస్క్ ఆఫ్ ప్లెంటీ’కి యేడాది క్రితం నేను చేసిన యధాశక్తి తర్జుమా) అని శ్రీశ్రీ పాదసూచి పెట్టారు. ఇంతకుముందు శ్రీశ్రీ అనువాదాలు ఎక్కువగా వచ్చిన ఖడ్గసృష్టిలో కానీ, శ్రీశ్రీ కవితా ప్రస్థానం పేరిట మనసు ఫౌండేషన్ వారి బృహత్ ప్రచురణలో కానీ ఈ రచన లేదు. శ్రీశ్రీ అనువాదాలను అధ్యయనం చేసే వారికి, వారి సాహిత్య ప్రియులకు, తెలుగు సాహిత్య చరిత్రకు ఇదొక కొత్తగా లభ్యమైన వనరు. శ్రీశ్రీ రచనల సేకరణలో అనితర సాధ్యమైన కృషి చేసిన చలసాని ప్రసాద్ గారిని స్మరించడం కూడా ఈ సందర్భానికి శోభను ఇస్తుంది. శ్రీశ్రీ సంపూర్ణ లభ్య రచనల కృషిలో రెండు మూడు తరాల సాహిత్యాసక్తులు, సాహిత్య వేత్తలు, సేకర్తలు కలిసి పని చేసి సాధించిన ఫలితంలో ఇదొక అదనపు అక్షర అక్షయ నిధి. సాహిత్య, సామాజిక, సాంస్కృతిక అధ్యయనానికి పుష్కలమైన అవకాశం.కిప్లింగ్ ఆంగ్ల కవిత లాహోర్ నుంచి నడిచే పత్రిక ‘ది పయనీర్’లో 26 అక్టోబర్ 1888 నాడు ప్రచురణ. బ్రిటిష్ రాణి పాలనలో భారత జన జీవనంపై ఇదొక విలువైన రచన. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నియమించిన గవర్నమెంట్ విచారణ కమిషన్ తీరు తెన్నులపై, కిప్లింగ్ అంటే ఫ్రెంచ్ భాషలో ఒక పల్లీయ వినోద ప్రదర్శన గానూ, అలాగే అసలు విషయం దాచిపెట్టే కుహనా నివేదికల ప్రహసనంపై ఆంగ్ల భాషలో ఝ్చటజు అన్న అర్థంతోనూ ఈ రచన, పాలకుల ధోరణిపై విమర్శగా చేశాడు. అలా చూస్తే, బ్రిటిష్ ఇండియా సాహిత్యంలో ఒక ప్రధాన రచన అయిన దీన్ని శ్రీశ్రీ 75 ఏళ్ల ముందర తెలుగులోకి తెచ్చారు. యధాశక్తి తర్జుమా అన్నారు కనుక 1888 మూలం, 1943 తెలుగు అనువాదం, నిశిత పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. రైతు జీవితాలు 1888 నాటికి ఎలా ఉన్నాయో, కిప్లింగ్ చెప్పగా, అంతకన్నా మరింత గడ్డుగా స్వాతంత్య్రానంతర భారతంలో ‘మార్చాము’ కనుక – దాదాపు శతాబ్దపున్నర కిందటి ఈ భారతీయ సమాజ రచన ఆనాడే అక్కడే ఉండిపోకుండా, 75 ఏళ్ల కిందట వెలుగులోకి తెలుగులోకి తెచ్చిన మహాకవి శ్రీశ్రీ సృజన దర్శనానికి వందనాలు. సేకరణ, లఘువ్యాఖ్య: రామతీర్థ (అవతారిక:– భారతీయ ప్రభుత్వం వారు దేశంలో యోగక్షేమాల భోగట్టా తియ్యడానికొక ప్రత్యేక సంఘాన్ని నియోగించారు. నిక్షేపం లాగ దేశం భాగ్యభోగాలతో తులతూగుతోందని ప్రభుత్వం వారు పసికట్టారు). రంగం:– భూలోకస్వర్గం – అనగా సిమ్లా శిఖరం. భారతీయ ప్రభుత్వం భాగ్యలక్ష్మి వేషంలో పాడుకుంటూ ప్రవేశం. టకోరా; సన్నాయి మేళాల నేప«థ్య గానం. రైతు బ్రతుకే మధురం! ఆహా రైతు బ్రతుకే మధురం పగలూ, రాత్రీ, పాడీ పంటా రాజ్యమేలే రాజులకన్నా రైతు బ్రదుకే సులభం! ఆహా రైతు బ్రదుకే సుభగం (తొహరా) సాక్షాత్తూ మనదేశం స్వర్గమే అని మా ఉద్దేశం పుణ్యభూమి కాదటండీ వేరే భూకైలాసం ఉన్నాదటండీ! జరూరుగా తమరొక నివేదిక తయారుచేసి పారేస్తే చాలిక! శతసహస్ర భారత నరనారీమణులు శక్రచాప శబలిత తేజోఘృణులు చిత్రచిత్ర వర్ణాలతో వీరి పరిస్థితి చిత్రించండి సముజ్వల సుందరాకృతి (హిమాలయ పర్వతాలు దిగి సమర్థులైన పరిశీలన సంఘంవారు దయచేస్తారు.) తురుష్క వేత్ర హస్తుడు – యోగక్షేమాల భోగట్టా తీశారా? దేశం నాడిపరీక్ష చేశారా? చక్కని భాషలో నివేదిక రాశారా? సమాచారమేదో మా నెత్తిని కొట్టండి. ఆవులూ గేదెలూ దూడలూ దున్నలూ అమాం బాపతు లెక్కలు కట్టండి ఫస్టు క్లాసులో యమ్మే ప్యాసయిన బాబూజీనొకడ్ని పట్టండి కట్టలు కట్టలుగా కాగితాల కుప్పలతో గెజెటీర్లకి గెజెటీర్లే నిండుతాయి: విష్కంభం అనంతాకాశం నించి అశరీరవాణి (జంత్ర వాద్యాల సంగీతంతో) బక్కచిక్కిన దుక్కిటెద్దుల ప్రాణములు కనుగొనల దాగెను ఆకసము రక్తాగ్ని కుండము భూమి నల్లని బొగ్గుకుంపటి మండుగాడుపు టెండవేడికి మరిగి కాలం భగీల్మన్నది యముని కారెనుబోతు మెడలో ఇనుపగంటలు నవ్వినట్లుగ దిగుడుబావి దిగాలుమన్నది పైరు పంటలు బావు రన్నవి ఇంకిపోయిన ఏటి కడుపున ఇసుక దిబ్బలు గొల్లుమన్నవి పరమపద సోపాన పథమున పాము నోట్లో పడ్డ రైతూ! ఎవరికై చేయెత్తి ప్రార్థన? ఎవరి కర్మల కెవరు కర్తలు చూడు పడమట సూది బెజ్జపు మేర కూడా మేఘ మంటదు ఇంత వర్షపు చినుకు కోసం చూచి కన్నులు సున్న మైనవి ఏడుపెందుకు వెర్రి బిడ్డా ఎవరు నీ మొర లాలకింతురు చచ్చిపోయిన గొడ్డు నడుముకు చచ్చినట్టే నిద్రపోవోయ్! (విజయ గర్వంతో విర్రవీగుతూ సిమ్లా నగరానికి పరిశోధక సంఘంవారి పునరాగమనం. సింహ శాబకాన్ని వెంటబెట్టుకొని వస్తూన్న భరతపుత్రుని వేషంతో. అస్వస్థతగా వున్న భారతదేశం చికిత్స పొందుతున్న సూచనగా నుదుటికి పలాస్త్రీ, మోకాళ్లకి పట్టీలు) సంఘసభ్యుల సంగీతం:– తిరిగాము తిరిగాము గోవిందారామ దేశమంతా మేము గోవిందా రాజుల్ని చూశాము గోవిందారామ రైతుల్ని చూశాము గోవిందా చూశాము చూశాము గోవిందారామ దేశసౌభాగ్యాన్ని గోవిందా మాయ రోగాలేవి గోవిందారామ మచ్చుకైనా లేవు గోవిందా చావనే మాటైన గోవిందారామ స్మరియించగా రాదు గోవిందా శిస్తుగా ప్రజలెల్ల గోవిందారామ మస్తుగా బలిశారు గోవిందా సకల సంపదలతో గోవిందారామ తులతూగుతున్నారు గోవిందా. (నాట్యం) కాపులూ కరణాలు రాజులూ రెడ్లు బ్రాహ్మణులు వైశ్యులూ మాల మాదిగలు పిండార్లు థగ్గులూ జైనులూ జాట్లు సర్కారు దయవల్ల గోవిందారామ చల్లగా వున్నారు గోవిందా తిని తిరిగి హాయిగా గోవిందారామ తెగ బలిసి పోయారు గోవిందా గో‘ఓ’వింద! (ఇండియా ప్రభుత్వం తెల్ల శాటిన్ రెక్కలతో ఎగిరివచ్చి అమెరికన్ రోడ్డు తంబురా మీటుతూ స్వస్తి వాచకం–) ప్రజ లేకగ్రీవమ్ముగ పంచభక్ష్య రసాన్నములు పర్వత శిఖరాగ్రమ్ముల ప్రశాంతముగ పవ్వళించి ఆరగించు దృశ్యమ్మును ఆక్షి పేయమగునట్లుగ చూచుచుంటకంటె వేరె సుఖమున్నదె శుభమున్నదె? పరిశోధక సంఘసభ్య పావనమూర్తులకు జయము ఫలియించెను మీరు పడిన పరిశ్రమము ధన్యులొహో కిరాయి మేళం – బాకాలూదుతూ:– గొప్ప గొప్ప కామందులపై వారి బంధుమిత్రాదులపై భగవంతుని కరుణారసామృతం ప్రవహించక తప్పదు మరి వానలూ వరదలూ వచ్చినా కరువూ కాటకం కలరా వచ్చినా పేదవాళ్ల సొమ్మేం బోయింది ఆదమరిచి నిద్రపోతే సరి పేదవాళ్లు సుఖంగానే వున్నారని భాగ్యవంతులు నిర్ణయించేశారు గొప్ప గొప్ప వారందరికీ జయం వారి చుట్టూ తిరిగే వారందరికీ జయం పేదవాళ్ల కెందుకూ భయం? ప్రాణమున్నన్నాళ్లు బతుకుతారు నయం! Rudyard Kipling రాసిన The Masque of Plenty కి ఏడాది క్రితం నేను చేసిన యథాశక్తి తర్జుమా. –శ్రీశ్రీ -
నలుగురు రైతుల ఆత్మహత్య
నెట్వర్క్: అప్పుల బాధ భరించలేక నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం సింగంపేట గ్రామానికి చెందిన వడ్ల భాగ్యలక్ష్మి(28) తమకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతికేది. ఖరీఫ్‌లో వరి సాగు చేశారు. విద్యుత్ కోతలతో దిగుబడి సరిగా రాలేదు. పంట కోసం చేసిన రూ.1.10 లక్ష అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైంది. ఈ మేరకు శనివారంరాత్రి ఇంట్లో పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కాపువారిగూడెంకి చెందిన నేనావత్ శ్రీను(30) తన రెండెకరాల భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తిసాగు చేశాడు. రూ.3లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు పంట దిగుబడి సరిగా రాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపానికి గురై శనివారం రాత్రి పురుగుల మందు తాగి చనిపోయాడు. వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరుకు చెందిన రైతు పెంటపర్తి నర్సిరెడ్డి(43) 10 ఎకరాల్లో పత్తి, మూడు ఎకరాల్లో సాగుతోపాటు తన పెద్ద కూతురు వివాహా నికి సుమారు రూ.8 లక్షల అప్పులు చేశాడు. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో అప్పులు తీర్చేదారిలేక ఉరివేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మం డలం మల్కపేటకు చెందని జంగిటి శ్రీనివాస్(27) ఆరెకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగుకు రూ.2 లక్షలు అప్పు చేశాడు. అంతకుముందు గల్ఫ్ వెళ్లేందుకు చేసిన రూ.4 లక్షలున్నాయి. ఎలా తీర్చాలనే మనోవేదనతో ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. -
అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి
వివాహ తొలి వార్షికోత్సవం రోజే దారుణం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : అత్తింటి ఆరళ్లకు వివాహ తొలి వార్షికోత్సవం రోజే ఓ యువతి బలైంది. ఈ ఘటన గుడ్లవల్లేరు మండలం, శేరీకల్వ పూడిలో జరిగింది. ఎస్ఐ ఎ.గణేష్‌కుమార్, మృతురాలి బంధువుల కథనం మేరకు.. కలిదిండి మండలం గుర్వారిపాలేనికి చెందిన సాల నాగేంద్రం, పెద్దింట్లు దంపతులు తమ కుమార్తె భాగ్యలక్ష్మి (శశిరేఖ) (20)ని గుడ్లవల్లేరు మండలం శేరీకల్వపూడికి చెందిన లారీ డ్రైవర్ దేవరకొండ మాణిక్యాలరావుకి ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. కట్నంగా రూ.60 వేలు ఇచ్చారు. పెళ్లయినప్పటి నుంచే భాగ్యలక్ష్మికి అత్తింటి ఆరళ్లు ప్రారంభమయ్యాయి. కట్నం చాల్లేదని, గృహోపకరణాలు తేవాలని అత్తమామలు ముత్మమ్మ, నాగేశ్వరరావు ఆమెను వేధించేవారు. దీంతో భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు కొన్ని సామాన్లు పంపించారు. అయినా అత్తమామలు కనికరించలేదు. ఈ వేధింపుల నేపథ్యంలో నాలుగునెలల క్రితం భాగ్యలక్ష్మి గర్భం పోయింది. వేధింపుల కారణంగానే భాగ్యలక్ష్మి ఉరివేసుకుని చనిపోయింది. అయితే ఆమె శరీరంపై కొద్దిపాటి గాయా లున్నాయి. ఆమె కంఠం భాగంపై ఉరివేసుకున్నట్లు తెలిపే గుర్తులు కనిపించలేదు. మృతురాలి చేతిలో తన చావుకు ఎవరూ కారణం కాదు అని రాసివున్న ఉత్తరం ఉంది. ఆ ఉత్తరంపై ఆమె సంతకం లేదు. భాగ్యలక్ష్మి మృతితో ఆమె తల్లిదండ్రులు పెద్దింట్లు, నాగేంద్రం గుండెలవిసేలా రోదించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామని ఎస్ఐ గణేష్‌కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని గుడివాడ డీఎస్పీ నాగన్న, పామర్రు సీఐ వి.శ్రీనివాస్ పరిశీలించారు.