అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి
- వివాహ తొలి వార్షికోత్సవం రోజే దారుణం
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : అత్తింటి ఆరళ్లకు వివాహ తొలి వార్షికోత్సవం రోజే ఓ యువతి బలైంది. ఈ ఘటన గుడ్లవల్లేరు మండలం, శేరీకల్వ పూడిలో జరిగింది. ఎస్‌ఐ ఎ.గణేష్‌కుమార్, మృతురాలి బంధువుల కథనం మేరకు.. కలిదిండి మండలం గుర్వారిపాలేనికి చెందిన సాల నాగేంద్రం, పెద్దింట్లు దంపతులు తమ కుమార్తె భాగ్యలక్ష్మి (శశిరేఖ) (20)ని గుడ్లవల్లేరు మండలం శేరీకల్వపూడికి చెందిన లారీ డ్రైవర్ దేవరకొండ మాణిక్యాలరావుకి ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు.
కట్నంగా రూ.60 వేలు ఇచ్చారు. పెళ్లయినప్పటి నుంచే భాగ్యలక్ష్మికి అత్తింటి ఆరళ్లు ప్రారంభమయ్యాయి. కట్నం చాల్లేదని, గృహోపకరణాలు తేవాలని అత్తమామలు ముత్మమ్మ, నాగేశ్వరరావు ఆమెను వేధించేవారు. దీంతో భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు కొన్ని సామాన్లు పంపించారు. అయినా అత్తమామలు కనికరించలేదు.
ఈ వేధింపుల నేపథ్యంలో నాలుగునెలల క్రితం భాగ్యలక్ష్మి గర్భం పోయింది. వేధింపుల కారణంగానే భాగ్యలక్ష్మి ఉరివేసుకుని చనిపోయింది. అయితే ఆమె శరీరంపై కొద్దిపాటి గాయా లున్నాయి. ఆమె కంఠం భాగంపై ఉరివేసుకున్నట్లు తెలిపే గుర్తులు కనిపించలేదు. మృతురాలి చేతిలో తన చావుకు ఎవరూ కారణం కాదు అని రాసివున్న ఉత్తరం ఉంది.
ఆ ఉత్తరంపై ఆమె సంతకం లేదు. భాగ్యలక్ష్మి మృతితో ఆమె తల్లిదండ్రులు పెద్దింట్లు, నాగేంద్రం గుండెలవిసేలా రోదించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామని ఎస్‌ఐ గణేష్‌కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని గుడివాడ డీఎస్పీ నాగన్న, పామర్రు సీఐ వి.శ్రీనివాస్ పరిశీలించారు.