ఈవ్‌టీజింగ్ చిదిమేసింది
ఈవ్‌టీజింగ్ చిదిమేసింది
Published Fri, Jan 20 2017 1:48 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. అక్క శ్రీగౌతమి కలెక్టర్ కావాలనే సంకల్పంతో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. చెల్లెలు పావని ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. వీళ్లిద్దరూ స్కూటర్‌పై వెళుతుండగా.. మద్యం సేవించిన కొందరు యువకులు కారులో వెంబడించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటమే కాకుండా.. కారుతో ఆ స్కూటర్‌ను ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో శ్రీగౌతమి అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పాలకొల్లు అర్బన్/నరసాపురం రూరల్ : మద్యం మత్తు, ఈవ్‌టీజింగ్ ఓ యువతిని బలి తీసుకున్నాయి. ఇదే ఘటనలో మృతురాలి చెల్లి తీవ్రంగా గాయపడింది. ఈ దుర్ఘటన పాలకొల్లు–నరసాపురం రోడ్డులో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నరసాపురం పట్టణంలోని కోవెల వీధికి చెందిన దంగేటి శ్రీగౌతమి, పావని అక్కాచెల్లెళ్లు. పూలపల్లి సంధ్యామైరైన్స్‌లో పావని ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి శ్రీగౌతమి, పావని పూలపల్లి నుంచి స్కూటర్‌పై నరసాపురం వెళ్తుండగా, కారు ఢీకొంది. ఈ ఘటనలో శ్రీగౌతమి అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. పావని తీవ్రంగా గాయపడింది. నరసాపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈవ్‌టీజింగే కారణం
స్కూటర్‌పై వస్తున్న పావని, శ్రీగౌతమిని మద్యం సేవించిన కొందరు యువకులు కారులో వెంబడించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కారు స్కూటర్‌ను ఢీకొంది. ఫలితంగా గౌతమి అక్కడికక్కడే మరణించింది. పావని ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. కొందరు కారులో వెంబడించారని పావని కూడా చెబుతోంది.
వైజాగ్ రిజిస్ట్రేషన్‌తో కారు
స్కూటర్‌ను ఢీకొన్న కారు విశాఖపట్టణంలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్టు పాలకొల్లు రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
సివిల్స్ ప్రిపరేషన్‌లో శ్రీగౌతమి
శ్రీగౌతమి చిన్ననాటి నుంచి బాగా చదివే విద్యార్థిని. నరసాపురం వైఎన్ కళాశాలలో డిగ్రీ చదివిన ఆమె ఎన్‌సీసీ నేవీ విభాగంలో సీ సర్టిఫికెట్ పొందింది. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌డే పరేడ్‌లోనూ పాల్గొని ప్రశంసలందుకుంది. అదే కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం సివిల్స్‌కి ప్రిపేర్ అవుతోంది. విశాఖపట్నంలో శిక్షణ పొందుతోంది.
తండ్రి మరణం నుంచి తేరుకోకుండానే...
శ్రీగౌతమి తండ్రి నరసింహరావు వ్యవసాయ పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. ఆ దుఃఖం నుంచి కోలుకోకుండానే శ్రీగౌతమి మరణించడం, పావని ఆస్పత్రి పాలుకావడం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. బంధువులు, స్నేహితులు గౌతమి మృతదేహాన్ని చూసి తీవ్రంగా రోదిస్తున్నారు.
Advertisement