స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. యువతి మృతి
స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. యువతి మృతి
Published Thu, Jan 19 2017 1:12 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
దిగమర్రు (పాలకొల్లు అర్బన్) : పాలకొల్లు–నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృత్యువాత పడగా మరో యువతి తీవ్రంగా గాయపడి నరసాపురం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పాలకొల్లు నుంచి ఏపీ31 ఏజీ 0366 నంబరు గల టాటా సఫారీ కారు నరసాపురం వైపు వెళ్తూ అదే మార్గంలో ఏపీ 37 సీకే 2690 నంబరు యాక్టివా హోండాపై వెళుతున్న అక్కాచెళ్లెళ్లు దంగేటి గౌతమి, దంగేటి పావనిలను ఢీకొట్టింది. కారు గౌతమిని సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకు పోయింది. సఫారీ కారు నరసాపురం పెదకాలువలోకి దూసుకుపోయింది. అలాగే స్కూటర్ దిగమర్రు పంట కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని నరసాపురం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గౌతమికి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. నరసాపురం ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పావని చికిత్స పొందుతోంది. ఇదిలా ఉండగా టాటా సఫారీలో వెళుతున్న యువకులు మద్యంతాగి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టాటా సఫారీకి సమీపంలో మద్యం బాటిల్ కవరు రోడ్డుకు అతుక్కుపోయి ఉంది. బాటిల్ నుజ్జయింది. మద్యం మత్తులో స్కూటర్‌ను ఢీకొట్టారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారకులైన నిందితులు పారిపోయారని తెలిపారు. పాలకొల్లు పట్టణ సీఐ కోలా రజనీకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
ఐఏఎస్ కావాలని...
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గౌతమి నరసాపురం వైఎన్ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో రాజమండ్రిలో సివిల్స్‌కు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. మరో రెండు రోజుల్లో ఆమె తిరిగి రాజమండ్రి వెళ్లనుంది. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. గౌతమి తండ్రి ఏడాది క్రితమే చనిపోయారు. ఆ బెంగ నుంచి కుటుంబ సభ్యులు తేరుకోకముందే గౌతమి మృత్యు వార్త ఆ కుటుంబాన్ని మరింత కృంగదీసింది.
Advertisement
Advertisement