కొలనులో అల్లూరి స్నానం చేస్తున్న సమయంలో బ్రిటిష్ సైనికులు చుట్టుముట్టినట్లు చిత్రకారుడి ఊహా చిత్రం
ఒక అల్లూరి మరణిస్తే లక్షల మంది వీరులు పుట్టుకువస్తారు.. వారంతా విప్లవ యోధులుగా మారతారు.. ప్రతి రక్తం బొట్టు ఒక సైనికుడిని తయారు చేస్తుంది.. బ్రిటిష్ సామ్రాజ్యం నేల కూలుతుంది.. మేజర్ గుడాల్‌తో అల్లూరి సీతారామరాజు నిర్భయంగా పలికిన పలుకులివి. ఆ వీరుడు అన్నట్టుగానే అతని మరణం తరువాత దేశంలో స్వాతంత్య్ర పోరాటం నిప్పుకణమై మండింది. లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పుట్టుకువచ్చారు. తెల్లవారిని తరిమికొట్టారు. సీతారామరాజును కొయ్యూరు మండలం మంపలో బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. ఆ ప్రాంతంలోనే ఆ యోధుడి అధ్యాయం ముగిసింది. అందుకు గుర్తుగా అదే చోట 18 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఆ బృహత్ కార్యక్రమానికి ఆదివారం శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..
కొయ్యూరు: అది మే నెల ఏడవ తేదీ.. 1924వ సంవత్సరం. ఉదయం ఎనిమిది గంటలకు మంపలో ఉన్న కొలనులో సీతారామరాజు స్నానం చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ సైన్యం మేజర్ గుడాల్ నేతృత్వంలో చుట్టుముట్టింది. ఆయనే అల్లూరి అని నిర్ధారించుకునేందుకు గుడాల్ ఓ పరీక్ష పెట్టాడు. మరిగే పాలను ఇచ్చినా రామరాజు గటగటా తాగుతారని తెలిసి వేడి పాలను తీసుకువచ్చి తాగించారు. ఆయన ఆ పాలను నీళ్లు మాదిరిగా తాగడంతో అతనే సీతారామరాజని తేలింది. అప్పుడు అల్లూరిని మంపకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేంద్రపాలేనికి తీసుకువచ్చారు. అక్కడ అతడిని మంచానికి కట్టి మేజర్ గుడాల్ కాల్చి చంపారు. రామరాజు చనిపోయే ముందు పలికిన ఒక్కో మాట తూటాగా పేలింది. వందేమాతరం అంటూ దేశభక్తిని నింపి ప్రాణత్యాగం చేశారు.
అక్కడ నుంచి అతని పార్థివ దేహాన్ని కృష్ణాదేవిపేటకు తరలించి అక్కడ అంత్యక్రియలు చేశారు. అల్లూరి మరణించి 98 సంవత్సరాలు కావస్తోంది. జాతీయ అల్లూరి యువజన సంఘం ఆధ్వర్యంలో మంపలో ఆయన పట్టుబడిన కొలను మధ్యలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు అల్లూరికి కుడి ఎడమ భుజాలుగా నిలిచిన గాం గంటన్నదొర, మల్లుదొరతోపాటు మరికొందరి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. దీని శంకుస్థాపనకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలను ఆహ్వానించారు.
వేధింపులతో విప్లవానికి నాంది: నాడు రంపుల, చింతపల్లి ఘాట్‌రోడ్ల నిర్మాణ సమయంలో కూలి విషయంలో బ్రిటిష్ పాలకులు గిరిజనులను వేధించడాన్ని సీతారామరాజు స్వయంగా చూశారు. వారికి జరుగుతున్న అన్యాయంపై అతను సాయుధ పోరాటం మొదలు పెట్టారు. 1922 ఆగస్టులో చింతపల్లి, కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల స్టేషన్లపై రామరాజు ధైర్యంగా దాడులు చేశారు. పోలీసు రికార్డుల్లో ఆయన పట్టుకువెళ్లిన ఆయుధాలను కూడా నమోదు చేశారు. అతనితో కలిసి పోరాటం చేసిన వారిలో మల్లుదొర, గంటన్నదొరతో పాటు అగ్గిరాజు, యర్రయ్య కూడా కీలకంగా వ్యవహరించారు.
మొత్తం 212 మంది ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వందలాదిమంది పోలీసులను నియమించినా అల్లూరిని పట్టుకోలేకపోయారు. మంపకు సమీపంలో ఉర్లకొండ వద్ద ఉన్న గృహంలో సీతారామరాజు సమావేశాలు ఏర్పాటు చేసేవారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేశారు. ఆ గుహ నుంచి చూస్తే మంప, రేవళ్లు రహదారుల నుంచి ఎవరు వస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు గుహ వైపు వచ్చినా తెలిసిపోతుంది. దీంతో దానినే రాజు స్థావరంగా ఎన్నుకున్నారు. ఈ విషయాలను సేకరించిన మేజర్ గుడాల్ మంపలో అల్లూరిని పట్టుకునేందుకు పథకం రచించారు.
అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసేది ఈ కొలనులోనే..
కొలను చుట్టూ ఇనుప కంచె పెట్టాలి
సీతారామరాజు స్మారక ప్రదేశంలో ప్రస్తుతం కొలను వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేయాలి. లేకుంటే పశువులు వచ్చి పాడు చేసే అవకాశం ఉంది. అదే విధంగా స్మారక ప్రాంతంలో మంచి మొక్కలను నాటాలి. గోడలపై సీతారామరాజు జీవిత చరిత్రను చిత్రాల రూపంలో వేయాలి. ఇలా చేస్తే సందర్శకులకు చారిత్రక విషయాలు తెలుస్తాయి. మంచి పర్యాటక ప్రదేశమవుతుంది.
– ఇంగువ త్రినాథ్ పడాల్, మంప, సర్పంచ్
అల్లూరి జిల్లాతో నిజమైన నివాళి
మన్యం వీరుడు అల్లూరిని పట్టుకున్న మంప, అతడిని కాల్చి చంపిన రాజేంద్రపాలెంతోపాటు కృష్ణాదేవిపేటలో ఉన్న సమాధుల ప్రాంతాన్ని పూర్తిగా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. మంపకు సమీపంలో ఉన్న ఉర్లకొండ గుహ ఒకప్పుడు అల్లూరి స్థావరంగా ఉండేది. దానిని వెలుగులోకి తీసుకురావాలి. పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు అల్లూరి పేరు పెట్టడం నిజమైన నివాళి.
– పడాల వీరభద్రరావు, జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment