సమావేశంలో మాట్లాడుతున్న పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త భాగ్యలక్ష్మి
చింతపల్లి: రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని బెన్నవరం కాలనీలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయన్నారు. జన్మభూమి కమిటీలను నియమించి అక్రమాలకు తెరలేపారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు వందల అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను అన్నివిధాలా మోసం చేశారని ఆరోపించారు. మన్యంలో వైఎస్సార్ పార్టీ తరుపున గెలిచిన ప్రజాప్రతినిధులు డబ్బు కోసం పార్టీ ఫిరాయించి రాజకీయ జన్మనిచ్చిన పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఫిరాయింపుదారులకు గిరిజనులు బుద్ధి చెబుతారన్నారు.
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో టీడీపీ నాయకులు అభివృద్ధి పేరిట వివిధ పనులకు శిలాఫలకాలు వేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే శిలాఫకాలు వేసిన పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాజన్న రాజ్యం వస్తుందని, మన్యం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజనులంతా జగనన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందన్నారు.
నవరత్నాల పథకాలు పేదల పాలిట వరాలని, వీటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, కార్యవర్గ సభ్యుడు పాంగి గుణబాబు, పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి, ఎంపీటీసీ సుబ్బారావు, మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు వెంకాయమ్మ, రీమలి నళిని, వైఎస్సార్ సీపీ నాయకులు, స్వామి, రామారావు, కృష్ణవేణి, బాబి, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment