రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో సగానికి పైగా మండలాల్లో వడగాడ్పులు
అనకాపల్లి, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో 44.9 డిగ్రీలు
పార్వతీపురం మన్యం, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ 44.9 డిగ్రీలు
రెంటచింతలలో 44.6 డిగ్రీలు నమోదు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఏడు జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీలకు చేరువలోకొచ్చి మంట పుట్టించాయి. రాష్ట్రంలోని 670 మండలాలకు గాను 358 మండలాల్లో (సగానికి పైగా) వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు దడ పుట్టించాయి. 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 231 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపాయి.
శనివారం అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, ప్రకాశం జిల్లా తోకపల్లె, వైఎస్సార్ జిల్లా బలపనూరుల్లో రికార్డు స్థాయిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
ఆదివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 222 మండలాల్లో వడగాడ్పులు, సోమవారం 22 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం 24, పార్వతీపురం మన్యంలో 11, విశాఖపట్నం 1, అనకాపల్లి 7, కాకినాడ 4, తూర్పుగోదావరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రేపట్నుంచి కాస్త చల్లదనం..
కొద్దిరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒకింత చల్లని వార్తను మోసుకొచి్చంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడేందుకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తాయని తెలిపింది. ఉష్ణతాపం తగ్గినా పలు ప్రాంతాల్లో ఉక్కపోత, అసౌకర్య వాతావరణం మాత్రం ఉంటుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment