ఏటేటా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల తీవ్రత నుంచి రక్షించుకోగలిగే శీతల సదుపాయాల్లేక కోట్లాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు ప్రమాదంలో జీవిస్తున్నారు. 54 దేశాల్లో 117 కోట్ల మంది ఈ ముప్పును ఎదుర్కొంటున్నట్లు ‘సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్ ఆల్’లెక్కతేల్చింది. ఇది 2022 నాటి అంచనా. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ప్రతి ఏటా బాధితుల సంఖ్య ఆ మేరకు పెరుగుతోంది.
చాలా మంది మానసిక, శారీరక అనారోగ్యాల పాలవుతున్నారు. వడదెబ్బతో మృత్యువాతపడుతున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాదు రెక్కాడితేగాని డొక్కాడని పేదలు ఎండలో మాడుతూనే పనులు చేసుకోక తప్పటం లేదు. ఎండకు భయపడిన వారు పనిదినాలను, దినసరి ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
బాధితులు మన దేశంలోనే ఎక్కువ
అధిక ప్రభావం గల దేశాల్లో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో పేదరికం, విద్యుత్ సదుపాయంలో అంతరాల కారణంగా శీతలీకరణ సదుపాయాలకు నోచుకోని జనాభా గణనీయంగా ఉంది. అత్యంత ఎక్కువ ప్రభావిత దేశాలు 9. ఈ జాబితాలో 32.3 కోట్ల మందితో మన దేశానిదే అగ్రస్థానం. 15.8 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో నైజీరియా (14.2 కోట్లు), బంగ్లాదేశ్ (5 కోట్లు), ఇండోనేసియా (4.4 కోట్లు), పాకిస్తాన్ (3.4 కోట్లు), బ్రెజిల్ (3.2 కోట్లు), మొజాంబిక్ (2.7 కోట్లు), సూడాన్ (1.7 కోట్లు) ఉన్నాయి.
ఈ దేశాల్లో అధిక ఎండల కారణంగా అత్యధిక పేద, మధ్యతరగతి ప్రజలు ఎయిర్ కూలర్లు, ఏసీలు లేక ఫ్యాన్లతో సరిపెట్టుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు. పేద దేశాల్లో కొందరికైతే ఫ్యాన్ కూడా లేదు. విద్యుత్ సదుపాయమే లేని నిరుపేదలూ లేకపోలేదు. 2021కన్నా 2022లో ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ, పట్టణవాసుల్లో అధిక ఎండల బాధితుల సంఖ్య 2.86 కోట్లు పెరిగిందని సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ తెలిపింది.
ఇళ్లన్నిటికీ విద్యుత్ ఉంది కానీ..
ప్రజల ఆదాయం స్థాయినిబట్టి శీతల సదుపాయాలు కల్పించుకొనే స్తోమత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో విద్యుత్ సదుపాయం 100 శాతం ఇళ్లకు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ ఇళ్లలో శీతలీకరణ ఉపకరణాల వాడకం తక్కువగానే ఉంది. 19.6 కోట్ల ఫ్యాన్లు, 16.2 కోట్ల రిఫ్రిజిరేటర్లు, 4 కోట్ల ఎయిర్ కండిషనర్లు భారత్‌లో వినియోగంలో ఉన్నట్లు అంచనా.
సుస్థిర శీతల సాంకేతికతలు
ఏసీల వల్ల ప్రజలకు వేడి నుంచి తాత్కాలికఉపశమనం దొరుకుతున్నప్పటికీ వీటి నుంచి వెలువడే ఉద్గారాల వల్ల వాతావరణంఇంకా వేడెక్కుతోంది. అందువల్ల, సుస్థిర శీతల సదుపాయాలతో కూడిన ప్రత్యామ్నాయాలపై ముఖ్యంగా అధికోష్ణ ప్రభావిత 9 దేశాలుమరింతగా దృష్టి సారించాల్సి ఉంది.
నాలుగేళ్ల క్రితం భారత్ తొలి అడుగు వేసింది. ప్రత్యేక నేషనల్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. అడవుల పెంపకం, పట్టణాల్లో పచ్చదనం పెంపొందించటం ఉష్ణోగ్రతలను తగ్గించటంలో ఉపయోపడతాయి. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలపై మరింత పెట్టుబడి పెట్టడం ద్వారా సుస్థిర శీతల సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది.
– సాక్షి సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment