సాక్షి, హైదరాబాద్: ఆర్థిక లాభం, వ్యక్తిగత కక్ష, ఈర్ష్య.. సైబర్ నేరాలకు, దాడులకు ప్రధానంగా ఇవే కారణాలుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం సైబర్ దంగల్ 2.0 తెరపైకి వచ్చింది. రాజకీయ, మతపరమైన విభేదాలతో పాటు తమ ఉనికిని చాటు కోవాలనే ఉద్దేశంతో కూడా సైబర్ నేరగాళ్లు దాడులకు తెగబడుతున్నారు. దీన్ని నిపుణులు సైబర్ హ్యాక్టివిజంగా పేర్కొంటున్నారు. అనానిమస్ సూడాన్, హ్యాక్టివిస్ట్ రష్యా, డ్రాగన్ ఫోర్స్ మలేసియా.. ఇలా అనేక గ్రూపులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి సవాల్ విసురుతున్నాయి. వీటి టార్గెట్‌లో భారత్ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉండటం ఆందోళన కలిగించే అంశం.
అటో ఎనభై...ఇటో ఎనభై...
ఉక్రెయిన్–రష్యా మధ్య ప్రారంభమైన యుద్ధం నేపథ్యంలో అనేక సైబర్ నేరగాళ్ల గ్రూపులు క్రియాశీలంగా మారాయి. సైబర్ నో అనే అంతర్జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం దాదాపు 190 గ్రూపులు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశాయి. వీటిలో 160 భారత్ పైనే గురి పెట్టాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో 80 రష్యాకు మద్దతుగా మిగిలిన సగం ఉక్రెయిన్‌కు మద్దతుగా వ్యహరిస్తున్నాయి.
భారత్ ఏ దేశానికి బహిరంగ మద్దతు ప్రకటిస్తే దాని వ్యతిరేక గ్రూపులు సైబర్ దాడులకు సిద్ధమయ్యాయని సైబర్ నో స్పష్టం చేసింది. అయితే భారత్ ఎలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోకపోవడంతో అవి మిన్నకుండిపోయాయని తెలిపింది. అనేక మంది హ్యాక్టివిస్ట్‌లు తమ సొంత నమ్మకాలను వ్యతిరేకించే వ్యక్తులను లేదా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, తెరపైకి రాకుండా, పెద్ద స్థాయిలో నష్టాలు కలిగించకుండా రెచ్చిపోతున్న హ్యాక్టివిస్టులు అనేక మంది ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
నుపుర్ వ్యాఖ్యలతో దండయాత్ర..
బీజేపీ ఎంపీ నుపుర్ శర్మ గతడాది చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హ్యాక్టివిస్టులు ఒక్కసారిగా దేశంపై దండెత్తారు. కేంద్ర ప్రభుత్వ సైట్‌లను లక్ష్యంగా చేసుకుని రెచి్చపోయారు. వీరికి చెక్ చెప్పడానికి దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్ సాయం కోరాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో భారత్‌కు వ్యతిరేకంగా ‘డ్రాగన్ ఫోర్స్ మలేసియా’, ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా’అనే రెండు హ్యాకర్ గ్రూపులు రంగంలోకి దిగాయి.
నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా జరిగే ఈ దాడిలో పాల్గొనాలని ఆ గ్రూపుల నిర్వాహకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓ వర్గం హ్యాకర్లకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 2 వేల వెబ్‌సైట్లపై ఈ రెండు గ్రూపులూ పంజా విసిరాయి. ప్రపంచంలో ఉన్న ఇతర హ్యాకర్లు, గ్రూపులు సైతం దాడులకు దిగేలా ప్రేరేపిస్తూ అందుకు అవసరమైన డార్క్‌వెబ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్స్‌ను తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశాయి.
భవిష్యత్తులో మరింతగా..
ఈ తరహా సైబర్ దాడులు భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ హ్యాకర్లు తన ఆర్థిక అవసరాల కోసం మరోచోట ఎటాక్ చేస్తారు. అక్కడ ఆర్జించిన అక్రమ సొమ్మును వినియోగించి డార్క్ నెట్ నుంచి కొత్త కొత్త సాఫ్ట్‌వేర్స్ సృష్టిస్తారు. వీటినే మాల్‌వేర్స్‌గా మారుస్తూ సైబర్ దాడులకు దిగుతారు. వీటిని ఎదుర్కోవాలంటే ప్రతి వ్యవస్థ, సంస్థ
సైబర్ సెక్యూరిటీకి ఇచ్చే ప్రాధాన్యం, బడ్జెట్ తదితరాలు పెరగాలి. పటిష్టమైన ఫైర్ వాల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి.
ముందే ప్రకటించి మరీ..
ఈ హ్యాక్టివిస్ట్ గ్యాంగ్‌లు తాము ఏ దేశాన్ని, ఏ కారణంగా టార్గెట్ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. దీనికోసం ట్విట్టర్‌లో ఖాతాలు, టెలిగ్రామ్‌లో గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ఎటాకర్స్ ఎలాంటి డిమాండ్లు చేయకుండా కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్ ప్రపంచాన్ని సవాల్ చేయడం, భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసమే వరుసపెట్టి ఎటాక్స్ చేస్తుంటారు. వీళ్లు ప్రధానంగా డీ డాస్‌గా పిలిచే డిసస్టట్రి డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ విధానంలో దాడి చేస్తున్నారు.
ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్ ఆయా వెబ్‌సైట్స్‌కు వచ్చేలా చేస్తారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక సర్వర్ కుప్పకూలిపోతుంది. డినైల్ ఆఫ్ సర్వీసెస్ (డీఓఎస్) తరహా ఎటాక్స్ సైతం దాదాపు ఇవే తరహా నష్టాన్ని కల్పిస్తాయి. విమానాశ్రయాలు, ఓడ రేవులతో పాటు ఆస్పత్రులకు సంబంధించిన సర్వర్లు వారి టార్గెట్‌గా మారుతున్నాయి.
-మావులూరి విజయ్‌కుమార్, సైబర్ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment