ఆ తరువాత స్వల్పంగా పెరగనున్న ఉష్ణతాపం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు వడగాడ్పులకు విరామం లభించనుంది. ఇప్పటికే ఐదారు రోజుల నుంచి ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించడం లేదు. ఫలితంగా వడగాడ్పులు వీయడం లేదు.
ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అప్పటివరకు వడగాడ్పులకు ఆస్కారం ఉండదని పేర్కొంటున్నారు. 20వ తేదీ తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయంటున్నారు. మరోవైపు దక్షిణ అంతర్భాగ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కేరళ నుంచి కర్ణాటక మీదుగా మరఠ్వాడా వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ద్రోణితో విలీనమైంది.
అదే సమయంలో రాష్ట్రంపై ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న ఐదు రోజులు (20వ తేదీ వరకు) కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో తెలిపింది. వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
కాగా.. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు గోగులదిన్నె (ప్రకాశం)లో 4.1, గవరవరం (ఏలూరు)లో 3.9, పైడిమెట్ల (తూర్పు గోదావరి)లో, ఫిరంగిపురం (గుంటూరు)లో 3.4 సెం.మీ. చొప్పున, జీకే వీధి (అల్లూరి సీతారామరాజు) 3, ఆత్మకూరు (నంద్యాల)లో 2.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment