సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా రాష్ట్రంలో అధిక వేడి (వడ గాలి, హీట్ వేవ్) నమోదవుతున్న రోజుల సంఖ్య తగ్గుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక – 2022 వెల్లడించింది. ఇదే సమయంలో చలి వాతావరణం ఉండే రోజుల సంఖ్య పెరుగుతోంది. అయితే, చలి రోజుల్లో కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంవత్సరాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు, చలి వాతావరణం ఉన్న రోజుల వివరాలను నివేదిక వివరించింది.
► రాష్ట్రంలో 2014 సంవత్సరంలో 16 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా, ఆ తర్వాతి సంవత్సరాల్లో కొంత తగ్గాయి. 2019 సంవత్సరంలో 13 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2020లో 3 రోజులు, 2021లో నాలుగు రోజులు మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక తెలిపింది.
► అత్యల్ప ఉష్ణోగ్రతలు 2014లో మూడు రోజులు మాత్రమే. 2021లో ఒక రోజే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. కానీ ఈ సంఖ్య 2018లో 8 రోజులు, 2020లో 6 రోజులుగా ఉంది.
► ఇతర రాష్ట్రాల్లో 2014లో ఒడిశాలో అత్యధికంగా 17 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 12 రోజులు చొప్పున, రాజస్థాన్‌లో 11 రోజులు, మధ్యప్రదేశ్‌లో 10 రోజులు, తెలంగాణలో రెండు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత 2019లో ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. గత రెండేళ్లుగా అన్ని రాష్ట్రాల్లోనూ వేడి రోజులు తగ్గిపోయినట్లు తెలిపింది.
హీట్ వేవ్ అంటే..
ఏదైనా ప్రదేశంలో వరుసగా రెండు రోజులు 45 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే హీట్ వేవ్ పరిస్థితులుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2016 మే 2వ తేదీన ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2017 మే 17వ తేదీన ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2020 మే 23న ప్రకాశం జిల్లా కనిగిరిలో 47.8 డిగ్రీలు, 2021 మార్చి 31 ప.గో. జిల్లా పెదపాడులో 45.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సమయంలో వేడిగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment