
నేటి నుంచి తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గరిష్టంగా 42 డిగ్రీలకు మించలేదు. అత్యధికంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా కొత్తవలసల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 63 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
గురువారం 11 మండలాల్లో తీవ్ర, మరో 129 మండలాల్లో వడగాడ్పులు, శుక్రవారం 13 మండలాల్లో తీవ్ర, 79 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గురువారం నుంచి మూడు రోజులపాటు ఉత్తర కోస్తాలోను, శుక్రవారం నుంచి రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది.
దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వానలతో పాటు ఉరుములు, మెరుపులు, అక్కడక్కడా పిడుగులు సంభవించవచ్చని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఒకింత వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని వివరించింది.
చల్లని కబురు చెప్పిన స్కైమేట్
మండే ఎండలో ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. రుతుపవనాల సీజన్‌లో 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు “స్కైమెట్’ ఎండీ జతిన్‌సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో వాతావరణ పోకడ లానినాగా మారుతోందని పేర్కొన్నారు. దీనివల్ల రుతుపవనాల కదలికలు బలపడొచ్చని, ఫలితంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.