ఆగస్ట్‌లో సాధారణం కంటే 16 శాతం ఎక్కువ: ఐఎండీ
న్యూఢిల్లీ: ఆగస్ట్‌లో మాదిరిగానే సెప్టెంబర్‌లోనూ సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఆగస్ట్‌లో సాధారణానికి మించి 16 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపింది. అదేసమయంలో, వాయవ్య భారతంలో రికార్డు స్థాయిలో 253.9 మిల్లీమీటర్ల వర్షం పడిందని, 2001 సంవత్సరం తర్వాత ఆగస్ట్‌లో ఇంత భారీగా వానలు కురియడం ఇది రెండోసారని తెలిపింది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘దేశంలో ఆగస్ట్‌లో 248.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, అంతకుమించి ఈసారి ఆగస్ట్‌లో 287.1 మి.మీ. వర్షం కురిసింది. అదేవిధంగా, జూన్ ఒకటో తేదీన మొదలైన రుతు పవన సీజన్‌లో దేశంలో సాధారణంగా 701 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి ఏకంగా 749 మి.మీ. కురిసింది’అని ఆయన వివరించారు. ‘ఆగస్ట్‌లో సాధారణంగా 16.3 రోజులపాటు అల్పపీడన వాతావరణం కొనసాగుతుంది. కానీ, అంతకుమించి 17 రోజుల్లో అల్పపీడనాల ప్రభావం ఉంది.
ఆగస్ట్‌లో ఏర్పడిన ఆరు అల్పపీడనాల్లో రెండింటి కారణంగా ఉత్తర, మధ్యభారతంతోపాటు తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు సహా దక్షిణ భారతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆగస్ట్ నెల మొత్తం రుతు పవనాల ప్రభావం కొనసాగింది’అని ఐఎండీ డీజీ మహాపాత్ర తెలిపారు. అయితే, హిమాలయాలు, ఈశాన్య ప్రాంతంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఈ సీజన్‌లో అల్పపీడనాల్లో అధిక భాగం దేశ దక్షిణ ప్రాంతంపైనే కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణమని చెప్పారు.
వాయవ్య భారతంలో అతిభారీ వర్షాలు
వాయవ్య భారతం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆగస్ట్‌లో మాదిరిగా∙సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని ఐఎండీ డీజీ మృత్యుంజయ వివరించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణానికి మించి వానలు పడొచ్చని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో దీర్ఘకాలం సగటు 167.9 మి.మీ. మించి వర్షాలు పడొచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment