Rainfall Expansion
-
సెప్టెంబర్‌లోనూ అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: ఆగస్ట్‌లో మాదిరిగానే సెప్టెంబర్‌లోనూ సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఆగస్ట్‌లో సాధారణానికి మించి 16 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపింది. అదేసమయంలో, వాయవ్య భారతంలో రికార్డు స్థాయిలో 253.9 మిల్లీమీటర్ల వర్షం పడిందని, 2001 సంవత్సరం తర్వాత ఆగస్ట్‌లో ఇంత భారీగా వానలు కురియడం ఇది రెండోసారని తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘దేశంలో ఆగస్ట్‌లో 248.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, అంతకుమించి ఈసారి ఆగస్ట్‌లో 287.1 మి.మీ. వర్షం కురిసింది. అదేవిధంగా, జూన్ ఒకటో తేదీన మొదలైన రుతు పవన సీజన్లో దేశంలో సాధారణంగా 701 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి ఏకంగా 749 మి.మీ. కురిసింది’అని ఆయన వివరించారు. ‘ఆగస్ట్‌లో సాధారణంగా 16.3 రోజులపాటు అల్పపీడన వాతావరణం కొనసాగుతుంది. కానీ, అంతకుమించి 17 రోజుల్లో అల్పపీడనాల ప్రభావం ఉంది. ఆగస్ట్‌లో ఏర్పడిన ఆరు అల్పపీడనాల్లో రెండింటి కారణంగా ఉత్తర, మధ్యభారతంతోపాటు తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు సహా దక్షిణ భారతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆగస్ట్ నెల మొత్తం రుతు పవనాల ప్రభావం కొనసాగింది’అని ఐఎండీ డీజీ మహాపాత్ర తెలిపారు. అయితే, హిమాలయాలు, ఈశాన్య ప్రాంతంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఈ సీజన్లో అల్పపీడనాల్లో అధిక భాగం దేశ దక్షిణ ప్రాంతంపైనే కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. వాయవ్య భారతంలో అతిభారీ వర్షాలు వాయవ్య భారతం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆగస్ట్‌లో మాదిరిగా∙సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని ఐఎండీ డీజీ మృత్యుంజయ వివరించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణానికి మించి వానలు పడొచ్చని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో దీర్ఘకాలం సగటు 167.9 మి.మీ. మించి వర్షాలు పడొచ్చని చెప్పారు. -
తమిళనాడుని వణికించిన వాన
సాక్షి, చెన్నై : బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు తాంబరం పరిసరవాసుల్ని వర్షం వణికించింది. ఒక్క రాత్రిపూటే ఏకంగా 14 సెం.మీ వర్షం కురవడంతో రోడ్లు జలదిగ్భందంలో చిక్కాయి. గతంలో ఇక్కడ నెలకొన్న పరిణామాలతో అధికారులు ఇంకా గుణపాఠం నేర్వక పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 డిసెంబరులో ఈశాన్య రుతు పవనాలు చెన్నై మీద తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. నీట మునిగిన తాంబరం సమీపంలోని సబ్ వే ప్రధానంగా తాంబరం పరిసరాల్లో ఒకే రాత్రి 20 సెం.మీకి పైగా వర్షం పడటంతో ఇక్కడి చెరువులు తెగి ఆ నీళ్లు అడయార్‌లోకి ఉధృతంగా ప్రవహించడంతో చెన్నై నీట మునిగింది. కాంచీపురం జిల్లా, ప్రస్తుత చెంగల్పట్టు జిల్లా పరిధిలోని తాంబరం, ముడిచ్చూరు, వరదరాజపురం, మణివాక్కం, ఆలందూరు, మణిమంగళం, ఊరపాక్కం, గూడువాంజేరి ప్రాంతాల్లోని చెరువులన్నీ తెగడం కారణంగానే చెన్నై జలదిగ్భంధంలో చిక్కుకుని పది రోజుల పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ జామ్ అలాగే, పెరుంగళత్తూరు, సేలయూరు, పళ్లికరణై , పెరుంగుడి పరిసరాల్లోని చెరువుల రూపంలో ఆ పరిసరాలన్నీ కొన్ని రోజుల పాటు నీట మునగాల్సిన పరిస్థితి. దీంతో అడయార్ తీరంతో పాటు నీటి పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు మీద ప్రత్యేక దృష్టి పెట్టినా, అధికారులు ఆ తదుపరి యథారాజ తథాప్రజా అన్న చందంగా వ్యవహరించడం మొదలెట్టారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాలతో అధికారులు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని బుధవారం రాత్రి తాంబరం పరిసరాల్లో కురిసిన వర్షంతో వెల్లడైంది. కుండపోతగా వాన.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో మోస్తారుగా వర్షం పడ్డా, చెన్నైలో అంతంత మాత్రమే. చెన్నై శివారుల్లో కొంత మేరకు అప్పుడప్పుడు వర్షం పలకరిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో బుధవారం అర్థరాత్రి కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, పిడుగు పాటులతో ఆ ప్రాంతం దద్దరిళ్లింది. వర్షం ధాటికి కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల కలెక్టర్లు ఉదయాన్నే విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. రోడ్డుపై చేరిన నీరు ఈ రెండు జిల్లా పరిధిలోని శ్రీపెరంబదూరు, వాలాజాబాద్, తిరుప్పోరూర్, ఉత్తర మేరు, మహాబలిపురం, గూడువాంజేరి, పరిసరాల్లో భారీ వర్షం పడింది. అయితే, తాంబరం పరిసరాల్లో ఏకంగా 14.6 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షం కారణంగా తాంబరం – ముడిచ్చూరు మార్గం జలమయమైంది. తాంబరం – వేళచ్చేరి మార్గంలో సేలయూరు వద్ద రోడ్డు మీద వరద పారాయి. వాహనాలు ముందుకు సాగలేని పరిస్థితి. అన్ని రోడ్లు జలమయం కావడంతో పాటుగా రైల్వే సబ్‌వేలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తాయి. ఇక, అడయార్‌లో నీటి ప్రవాహం పెరిగింది. వాహనదారుల ఇక్కట్లు కొన్ని చోట్ల ఇళ్లల్లోకి సైతం నీళ్లు చొరబడటంతో అక్కడి ప్రజలు అధికారుల తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్త కాలువల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగి ఉండటంతో నీళ్లు బయటకు వెళ్ల లేని పరిస్థితి. పది గంటల తదుపరి అధికార వర్గాలు రంగంలోకి దిగి, నీటిని తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అంత వరకు ఆయా మార్గాల్లో ప్రయాణం గగనంగా మారింది. ఇక, వేలూరు జిల్లా పరిధిలో అనేక చోట్ల భారీ వర్షం ధాటికి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కొన్ని కళాశాలల్లో జరగాల్సిన పరీక్షలను యాజమాన్యాలు వాయిదా వేశాయి. మరో మూడు రోజుల వాన.... చెన్నైలోని ట్రిప్లికేన్, పురసైవాక్కం, విల్లివాక్కం, ఎగ్మూర్, టీ.నగర్, వడపళని, అంబత్తూరు, ఆవడి ప్రాంతాల్లో కాసేపు వర్షం పలకరించింది. ఈశాన్య రుతు పవనాలు మరింత బలపడే అవకాశాలతో మరోమూడు రోజుల పాటుగా అక్కడక్కడ భారీగానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో మోస్తారుగా వర్షం పడుతుందని, ఉత్తర తమిళనాడులో కొన్ని చోట్ల భారీగా వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం సమాచారంతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. 2015లో ఇదే తరహాలో నవంబర్ చివర్లో భారీ వర్షం పడటం, డిసెంబరు 1, 2 తేదీల్లో రాత్రికి రాత్రే కురిసిన వర్షాలతో చెన్నై నీట మునిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తరహాలో వర్షం పడే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. -
లాభాల స్వీకరణకు అవకాశం..!
* వర్షపాత విస్తరణపై ఇన్వెస్టర్ల దృష్టి * ఈ వారం మార్కెట్ తీరుపై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: లాభాల నుంచి స్టాక్ మార్కెట్ ఈ వారం ఒకింత విరామం తీసుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. రంజాన్ సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు రోజు కావడంతో ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. గత వారం స్టాక్ మార్కెట్ లాభపడడంతో ఈ వారం లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశముందని, తదుపరి సంకేతాల కోసం ఇన్వెస్టర్లు వర్షపాత విస్తరణను గమనిస్తారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు..ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 5(మంగళవారం) వెలువడే నికాయ్ సేవల రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది. కంపెనీలకు లాభాలు.. నైరుతి రుతుపవనాల విస్తరణ, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు.. ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. సంస్కరణల జోరు, వర్షాలు తగిన రీతిలో కురుస్తుండడం, కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలోనే ఉంటాయన్న అంచనాల కారణంగా బ్రెగ్జిట్ ఉదంతం తర్వాత ఇన్వెస్టర్లు భారత్‌పై దృష్టిసారించారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోజనాలన్నీ రానున్న క్వార్టర్లలో కంపెనీల లాభాలు పెరిగేందుకు తోడ్పడతాయని చెప్పారు. ఈ వారంలో లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశం ఉందని, దీంతో మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగవచ్చని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి, కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి ఒక వారంలో ప్రారంభమవుతాయని.. ఇవన్నీ సమీప కాలంలో మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వివరించారు. విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ లావాదేవీలపై ఆధారపడి ఈ వారం మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీలు ముఖ్యంగా ముడి చమురు ధరల కదలికలు కూడా కీలకమేనని పేర్కొన్నారు. ఫలితాలను బట్టి షేర్ల కదలికలు గత వారంలో మార్కెట్ పనితీరు బాగా ఉందని, ఈ వారంలో కొంత కరెక్షన్ జరగవచ్చని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్(ఈక్విటీస్) పంకజ్ శర్మ చెప్పారు. రానున్న 4-6 వారాల్లో పలు కంపెనీలు ప్రకటించనున్న ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు కీలకం కానున్నాయని వివరించారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను బట్టి కంపెనీల షేర్ల కదలికలు జరిగినట్లే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాలను బట్టి కంపెనీల షేర్ల కదలికలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా సోమవారం(జూలై 4) అమెరికా మార్కెట్లకు సెలవు. కాగా అంతకు ముందటి మూడు వారాల వరుస నష్టాలకు గత వారంలో తెరపడింది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 747 పాయింట్లు పెరిగి 27,145వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 240 పాయింట్లు లాభపడి 8,328 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 8 నెలల గరిష్టానికి, నిఫ్టీ 10 నెలల గరిష్టానికి చేరాయి. పెరుగుతున్న విదేశీ నిధుల ప్రవాహం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గత నెలలో భారత స్టాక్ మార్కెట్లో రూ.3,713 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల మొత్తం రూ.20,600 కోట్లకు పెరిగాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.41,661 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది మార్చి-మే కాలానికి రూ.32,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వర్షాలు బాగా కురుస్తాయనే అంచనాలతోనే విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టారని క్వాంటమ్ ఏఎంసీ అసోసియేట్ ఫండ్ మేనేజర్(ఈక్విటీ) నీలేశ్ షెట్టి చెప్పారు. మంచి వర్షాలతో కంపెనీల పనితీరు బాగా ఉంటుందన్న అంచనాలతోనే నిధుల ప్రవాహం పెరుగుతోందన్నారు. కాగా గత నెలలో ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్ నుంచి రూ.6,220 కోట్లు వెనక్కి తీసుకున్నారు.