సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వానల కోసం కొన్నాళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మారిన వాతావరణం నేపథ్యంలో మరో వారం రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. కొద్దిరోజుల నుంచి రాష్ట్రంపైకి పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ కూడా తక్కువగా ఉంటోంది. అలాగే బంగాళాఖాతంలో గాని, భూ ఉపరితలంలో గాని ఆవర్తనాలు/ద్రోణులు ఏర్పడటం లేదు. వర్షాలు కురవడం లేదు.
అంతేకాదు.. మేఘాల జాడ కనిపించడం లేదు. వీటన్నిటి ఫలితంగా గాలిలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతోంది. దీనికి పశ్చిమ/వాయవ్య గాలులు తోడై ఉష్ణతాపానికి, అసౌకర్య వాతావరణానికి కారణమవుతోంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వరకు వెళ్తున్నాయి. బుధవారం పల్నాడు జిల్లా శావల్యాపురంలో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.
కావలిలో 39.1, బాపట్లలో 39, ఒంగోలులో 38.9, విశాఖపట్నంలో 38 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న వారం రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని, వర్షాలకు ఆస్కారం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా కురిసినా తేలికపాటి వర్షం లేదా చిరు జల్లులకే పరిమితమవుతుందని పేర్కొంటున్నారు.
అల్పపీడనాలు ఇప్పట్లో లేనట్టే..
సాధారణంగా ఆగస్టు ఆరంభం నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ప్రభావం చూపుతుంటాయి. వాటికి ద్రోణులు, ఆవర్తనాలు తోడై ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ.. ఇప్పటివరకు వాటి జాడ లేదు. దీంతో వానలు ముఖం చాటేశాయి. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ముందస్తు అంచనాల్లో స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment