
నైరుతి వర్షాలపైనా తీవ్ర ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణాది రాష్ట్రాలు ఈసారి ఎండలతో మండిపోతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.ఎస్.పై తెలిపారు. మార్చి నుంచి మే నెల వరకు సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెబెక్స్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. మే నెలలో వడగాలుల తీవ్రత చిత్తూరు, నెల్లూరు జిల్లాలు మినహా అన్నిచోట్లా భారీగా ఉంటుందని తెలిపారు.
మే నెలలో వడగాలులు వీచే రోజుల సంఖ్య కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. నైరుతి రుతుపవనాల రాక సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే సూచనలున్నాయని, అందువల్ల రుతుపవనాలు బలహీనపడతాయని చెప్పారు.
దీనివల్ల ఈ వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులుంటాయని, రుతుపవనాల ప్రభావం కొంత తగ్గేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం, రవాణా తదితర రంగాలపై ఎండల తీవ్రత ప్రభావం చూపిస్తుందని డాక్టర్ డి.ఎస్.పై పేర్కొన్నారు.