
వచ్చే ఐదు రోజులు ఉధృతం కానున్న వడగాడ్పులు
పలు జిల్లాల్లో మరింత పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణతాపం మరింత ఉగ్రరూపం దాల్చనుంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఎండ కాక పుట్టిస్తోంది. తీవ్ర వడగాడ్పులు దడ పుట్టిస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రానున్న ఐదు రోజులు వడగాడ్పులు మరింత ఉధృతం కానున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశాలున్నాయి. బుధవారం అత్యధికంగా విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. బలపనూరు (వైఎస్సార్)లో 44.9, దొనకొండ (ప్రకాశం)లో 44.3, మహానంది (నంద్యాల)లో 44.2, రావికమతం (అనకాపల్లి)లో 44.1, కంభంపాడు (ఎన్టీఆర్), రావిపాడు (పల్నాడు)లలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
69 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 105 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 154 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటిలో తీవ్ర వడగాడ్పులు వీచే మండలాలు శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యంలో 12, ఏఎస్సార్ జిల్లాలో 2, అనకాపల్లిలో 3, విశాఖలో 1 (పద్మనాభం) మండలాలు ఉన్నాయని పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 4, పార్వతీపురం మన్యంలో 3, ఏఎస్సార్ జిల్లాలో 12, విశాఖపట్నంలో 3, అనకాపల్లిలో 15, కాకినాడలో 17, కోనసీమలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 19, పశి్చమ గోదావరి జిల్లాలో 4, ఏలూరులో 14, కృష్ణాలో 9, ఎన్టీఆర్‌లో 5, గుంటూరులో 14, పల్నాడులో 5, బాపట్లలో 1, నెల్లూరులో 1, ప్రకాశంలో 1, తిరుపతి జిల్లాల్లో 3 మండలాల్లో వడగాడ్పులు వీయవచ్చని వివరించింది. శుక్రవారం 36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 157 మండలాల్లో వడగాడ్పులు వీచే ఆస్కారం ఉందని తెలిపింది.
కొనసాగుతున్న ఆవర్తనం, ద్రోణి
మరోవైపు తెలంగాణ, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో గురువారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉక్కపోత, తేమతో కూడి అసౌకర్య వాతావరణం నెలకొంటుందని పేర్కొంది.